గురువారం 25 ఫిబ్రవరి 2021
Nalgonda - Jan 12, 2021 , 02:15:19

కొనుగోళ్లకు రెడీ

కొనుగోళ్లకు రెడీ

సబ్సిడీ గొర్రెల కోసం మహబూబ్‌నగర్‌, ఏపీకి.. లబ్ధిదారులకు అధికారుల నుంచి ఫోన్‌ కాల్స్‌మేలు రకం దొరికే వరకూ రెండు, మూడ్రోజులు అక్కడే..సర్కారు సంకల్పం మేరకు గొల్లకురుమలకు సబ్సిడీ గొర్రెలు పంపిణీ చేసేందుకు పశు సంవర్ధక శాఖ కసరత్తు ప్రారంభించింది. నల్లగొండ జిల్లావ్యాప్తంగా తొలి విడుతలో డీడీలు కట్టిన 2,103 మందికి గొర్రెలు ఇచ్చేందుకుగాను కొనుగోళ్లకు సిద్ధమైంది. అందుకోసంమహబూబ్‌నగర్‌తోపాటు ఏపీలోని ప్రకాశం, గుంటూరు వెళ్లేందుకు తమతో రావాలని ఆయా మండలాల అధికారులు లబ్ధిదారులకు ఫోన్లు చేస్తున్నారు. రెండు, మూడ్రోజులు అక్కడే ఉండైనా మేలు రకం జీవాలు తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ నెల 16న రెండో విడుత గొర్రెల పంపిణీ నల్లగొండ నుంచి ప్రారంభం కానుండగా, తొలిరోజు 254 మందికి ఇచ్చేలా ఏర్పాట్లు సాగుతున్నాయి.

నల్లగొండ, జనవరి 11 : జిల్లావ్యాప్తంగా తొలి విడుతలో డీడీలు చెల్లించిన 2103మందికి ఈ నెలలోనే సబ్సిడీ గొర్రెలు ఇచ్చేందుకు గొర్రెలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, గుంటూరు జిల్లాలతోపాటు మన రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి కొనుగోలుకు అవకాశం కల్పించారు. మొత్తం 2103మంది లబ్ధిదారుల్లో ఒక్కొక్కరికి 20గొర్రెలు, ఒక పొట్టేలు చొప్పున 44,163 గొర్రెలు కావాల్సి ఉన్నది. ఇందుకుగాను లబ్ధిదారుడి కంట్రిబ్యూషన్‌ కింద ఒక్కొక్కరు రూ.31,250 చొప్పున మొత్తం రూ. 6,57,18,750  డీడీల రూపంలో చెల్లించనున్నారు.  ఈ మొత్తానికి ప్రభుత్వ సబ్సిడీ ఒక్కొక్కరికి రూ.93,750 చొప్పున మొత్తం రూ.19,71,56,250 అందనున్నది. గొర్రెలు విక్రయించిన వారికి రూ.1.25లక్షలను చెక్కు రూపంలో అందిస్తారు. 

లబ్ధిదారునికి నచ్చినవే కొనుగోలు..  

గొల్లకురుమలకు ఆర్థిక వనరులు కల్పించేందుకు ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి రూ.93,750 వెచ్చిస్తున్న నేపథ్యంలో నాణ్యమైన కొదుమలు, లేదంటే ఒకటి రెండు ఈతలు ఈనినవి మాత్రమే కొనుగోలు చేయాలని సర్కార్‌ ఆదేశించినందున నాణ్యమైనవి కొనుగోలు చేసి ఇచ్చే బాధ్యత పశుసంవర్ధక శాఖ చేపట్టింది. దీంతో స్థానిక పశుసంవర్ధక శాఖ అధికారి మండల లబ్ధిదారులతో కలిసి నేడో రేపో ఆయా జిల్లాలకు వెళ్లనున్నారు. అవసరమైతే రెండ్రోజులు అక్కడే ఉండి లబ్ధిదారునికి నచ్చిన గొర్రెలను మాత్రమే కొనుగోలు చేయనున్నారు. గొర్రెలకు ఉచిత బీమా సౌకర్యం కల్పించి  పంపిణీ చేయనున్నారు.

మేలు రకమైనవే కొనుగోలు చేస్తాం

ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుడికి సబ్సిడీ రూపంలో ఈ గొర్రెలు కొనేందుకు రూ.93,750 ఖర్చు చేస్తున్నది. దీంతో ప్రతి రూపాయి సద్వినియోగం అయ్యేలా  చర్యలు తీసుకుంటాం.   మేలురకమైన గొర్రెలను మాత్రమే కొనుగోలు చేసి పంపిణీ చేస్తాం.

- శ్రీనివాసరావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి, నల్లగొండ

VIDEOS

logo