శనివారం 06 మార్చి 2021
Nalgonda - Jan 11, 2021 , 01:41:45

ఎస్సీ కార్పొరేషన్‌లో రుణమేళా

ఎస్సీ కార్పొరేషన్‌లో రుణమేళా

  • 12 వరకు దరఖాస్తులకు గడువు
  • ఆన్‌లైన్‌ సెంటర్లకు యువత క్యూ 

హుజూర్‌నగర్‌ జనవరి 10 : షెడ్యూల్డ్‌ కులానికి చెందిన నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం సువర్ణావకాశం కల్పించింది. ఈ ఏడాది కూడా ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా భారీ రాయితీతో రుణాలు అందించేందుకు సిద్ధమైంది. సూర్యాపేట, నల్లగొండ జిల్లాల వారికి 12వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది. 

యూనిట్లు ఇవే..

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా భారీ సబ్సిడీతో పలు యూనిట్లను కేటాయించింది. ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, మినీ డెయిరీ, కూరగాయల సాగు, వితంతు మహిళలకు కోళ్ల పెంపకం, సిమెంట్‌ బ్రిక్స్‌, డిటర్జంట్‌ పౌడర్‌, సబ్బులు, ఫిష్‌ పాండ్స్‌, మినీ బ్యాండ్‌సెట్‌, మొబైల్‌ టిఫిన్‌ సెంటర్‌, పేఅండ్‌ యూజ్‌ టాయిలెట్స్‌, రీసైక్లింగ్‌ ప్లాస్టిక్‌ యూనిట్‌, పేపర్‌ ప్లేట్స్‌, గ్లాసుల తయారీ, టైలరింగ్‌, రెడీమేడ్‌ గార్మెంట్స్‌, పసుపు మిషన్‌, జ్యూట్‌బ్యాగ్స్‌ తయారీ, మినీ రైస్‌మిల్స్‌, శానిటైజర్‌ ఉత్పత్తి, డయాగ్నోస్టిక్‌ కేంద్రం, గన్నీబ్యాగ్స్‌, స్వీట్‌ షాప్స్‌, అల్యూమినియం షాప్‌, లాండ్రీ, డ్రైక్లీనింగ్‌ షాప్‌, బైక్‌ మెకానిక్‌ సర్వీస్‌ సెంటర్‌, క్యాటరింగ్‌ అండ్‌ కర్రీ పాయింట్‌, ప్రూట్స్‌ అండ్‌ జ్యూస్‌ సెంటర్‌, డిజిటల్‌ నెట్‌వర్క్‌, పవర్‌ టిల్లర్స్‌, ఆటోలు(డీజిల్‌, ఎలక్ట్రికల్‌), ప్యాసింజర్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ ఫోర్‌ వీలర్స్‌, రూరల్‌ గూడ్స్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ యూనిట్లు ఉన్నాయి. ఇందులో రూ.80వేల నుంచి రూ.19 లక్షల  వరకు వ్యయమయ్యే యూనిట్లు ఉండడంతో దరఖాస్తు చేసేందుకు ఆన్‌లైన్‌ సెంటర్లలో నిరుద్యోగులు క్యూ కడుతున్నారు.  

అర్హులు వీరే..

జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు కార్పొరేషన్‌ రుణాల కోసం ఆన్‌లైన్‌లో WWW.tsobmms.cgg.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆధార్‌కార్డు, కులం, ఆదాయం, రేషన్‌, పాన్‌కార్డు తదితర సర్టిఫికెట్లతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. గతంలో ఎస్సీ కార్పొరేషన్‌ నుంచి లోను పొంది 5 సంవత్సరాలు దాటిన వారు, ఇప్పటివరకు రుణాలు పొందని వారు అర్హులే.  ట్రాన్స్‌పోర్టు రుణానికి తప్పకుండా లైసెన్స్‌ కలిగి ఉండాలి.  

60 నుంచి 70 శాతం వరకు రాయితీ..

యూనిట్లలో రూ. లక్ష వరకు 80 శాతం, రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు 70 శాతం, రూ. 2 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు 60 శాతం రాయితీ ఇవ్వనున్నారు. మొత్తంమీద రాయితీ రూ.5 లక్షలకు మించి ఇవ్వరు. సూర్యాపేట జిల్లాకు 468 యూనిట్లు మంజూరయ్యాయని,  వీటిని ఐదు విభాగాలుగా విభజించి రూ.24.11 కోట్లతో 2020-21 సంవత్సరానికి కార్యాచరణ సిద్ధం చేసినట్లు సూర్యాపేట జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ బి. శిరీష తెలిపారు.

VIDEOS

logo