నాటు నుంచి మారింది రూటు

- కూలీల కొరతను అధిగమించేందుకు కొత్త దారులు
- డ్రమ్‌సీడర్, వెదజల్లే పద్ధతుల్లో వరి సాగు
- ఉమ్మడి జిల్లాలో 30వేల ఎకరాలకుపైగా...
- ఎకరాకు రూ.5వేల నాటు కూళ్లు మిగులు
పెరిగిన పెట్టుబడులు, కూలీల కొరతతో రైతులు కొత్త దారుల్లో పయనిస్తున్నారు. మెరుగైన ఫలితాలు ఇస్తుండడంతో కొన్ని పురాతన పద్ధతులనూ పునరావృతం చేస్తున్నారు. నారు, నాటుతో పని లేని డ్రమ్ సీడర్, వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేస్తున్న వారి సంఖ్య ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్నది. ఈ యాసంగి సీజన్లో ఇప్పటివరకు 20వేల ఎకరాల్లో డ్రమ్ సీడర్‌తో, 10వేల ఎకరాలకు పైగా వెదజల్లే పద్ధతితో సాగు మొదలుపెట్టినట్లు వ్యవసాయధికారులు చెప్తున్నారు. ఈ విధానంలో ఎకరాకు నాటు ఖర్చు రూ.5వేల దాకా మిగులుతున్నదని, దిగుబడి కూడా బాగున్నదని ఇప్పటికే ఒక కారు పంట తీసిన రైతులు చెప్తున్నారు. పంట కూడా 15 రోజులు ముందే చేతికొస్తున్నట్లు తెలిపారు.
రైతుల్లో పెరుగుతున్న ఆసక్తి...
గతంలో ఎక్కడో ఒక్కచోట వెదజల్లడం, డ్రమ్‌సీడర్ పద్ధతులు ఉపయోగించేవారు. వానకాలంలో మంచి ఫలితాలు రావడంతో పాటు గణనీయంగా ఖర్చులు తగ్గిపోవడంతో చాలామంది రైతులు ఈ పద్ధతులపై ఆసక్తి చూపుతున్నారు. ఈ యాసంగి సీజన్లో ఉమ్మడి జిల్లాలో సుమారు 20వేల ఎకరాల్లో డ్రమ్‌సీడర్‌తో, సుమారు 10వేల ఎకరాలకు పైన వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేసినట్లు వ్యవసాయాధికారుల అంచనా.
సంప్రదాయ పద్ధతి..
ముందుగా విత్తనాలను నానబెట్టి, మండె కట్టాలి. మొలకెత్తిన తర్వాత సిద్ధం చేసిన నారు మడిలో చల్లుకోవాలి. 25రోజులు నారును పెంచాలి. ఆ తర్వాత నారు పీకి కరిగట్టు చేసిన పొలంలో కూలీల ద్వారా నాటు వేయాలి. ఇందుకు కూలీల ఖర్చు ఎక్కువగా అవుతుంది.
వెదజల్లే పద్ధతి..
వెదజల్లే పద్ధతి పురాతనమైనది. 12గంటలపాటు వడ్లు నానబెడుతారు. మండెకట్టి రెండ్రోజులకు మొలకలు వచ్చిన తర్వాత నేరుగా కరిగట్టు చేసిన మడుల్లో చల్లుతారు. ఈ పద్ధతి వల్ల రైతులు నారు మడి దున్నాల్సిన పని లేదు.. నారు పోయాల్సిన అవసరం లేదు.. నాటు వేయాల్సిందీ లేదు. కూలీల అవసరం కూడా ఉండదు. కానీ, నైపుణ్యం కల్గిన వ్యక్తుల అవసరం ఉంటుంది. గతంలో దీనిని అలుకుడు పద్ధతి అనేవారు.
డ్రమ్ సీడర్
విత్తనాలను 12గంటలు నానబెట్టి 24గంటలు మండెకట్టాలి. కొద్దిగా ముక్కు పగిలిన గింజలను సీడర్లో వేసి విత్తుకోవాలి. వరుసల మధ్య, మొక్కల మధ్య సమాన దూరం ఉంటుం ది. గాలి, సూర్యరశ్మి, పోషకాలు సమానంగా అందుతాయి. మొక్కల సాంద్రత అంతటా సమానంగా ఉంటుంది. ఈ పద్ధతికి ఎటువంటి శాస్త్రపరిజ్ఞానం అవసరం లేదు. ఇద్దరు వ్యక్తులు ఒక రోజులో మూడు ఎకరాల వరకు విత్తుకోవచ్చు.
ఖర్చులు ఆదా
ఎకరంలో వరినాటుకు 7-8మంది కూలీలు అవసరం. దీంతో కూలి రేటు ఒకొక్కరికి రూ.500వరకు ఉంటుంది. రోజువారీ కూలి ఇస్తే ఎకరానికి రూ.3500- 4000ఖర్చు అవుతుంది. చాలా ప్రాంతాల్లో రూ.3500గుత్తా ఇచ్చి నాటు వేయిస్తున్నారు. కానీ, డ్రమ్‌సీడర్, వెదజల్లే పద్ధతుల్లో ఒకరిద్దరితోనే పని పూర్తవుతుంది. తద్వారా ఖర్చు తగ్గించుకోవచ్చు. శ్రమ తక్కువ, ఆదాయం ఎక్కువగా ఉంటుంది. వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామ రైతు చల్లభట్ల సైదిరెడ్డి నాలుగేళ్లుగా వెదజల్లే పద్ధతిలో సాగు చేస్తున్నాడు. ఈ పద్ధతి వల్ల ఎకరానికి రూ.5వేల చొప్పున పది ఎకరాలకు 50వేలు ఆదా అవుతున్నదని, కూలీల కోసం తిరిగే బాధలు తప్పినయి అని తన అనుభవాన్ని పంచుకున్నాడు. మిర్యాలగూడ పట్టణానికి చెందిన యరమాద వెంకట్‌రెడ్డి డ్రమ్ సీడర్ సాగులో ఎనిమిదేండ్ల అనుభవం గడించాడు. తన మిత్రులకు సైతం ఈ పద్ధతిని పరిచయం చేశాడు. చీడపీడల బాధల్లేవు.. ఎకరానికి 40బస్తాలకు పైగా దిగుబడి వస్తున్నదని తెలిపాడు. తిరుమలగిరి మండలకేంద్రానికి చెందిన ప్రభుత్వోద్యోగి రణధీర్‌రెడ్డి వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు సూచన మేరకు తనకున్న మూడు ఎకరాల్లో డ్రమ్ సీడర్ ద్వారా కొంత, మరికొంత వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేశాడు. ఈ విధానంతో 15రోజులు ముందుగానే పంట చేతికందుతుందని తెలిపాడు.
డ్రమ్‌సీడర్, వెదజల్లే పద్ధతులే మేలు..
సంప్రదాయ పద్ధతిలో నారును పీకడం వల్ల మొక్క షాక్‌కు గురవుతుంది. తిరిగి కుదురుకుని పిలకలు రావడానికి కొంత సమయం పడుతుంది. వాస్తవానికి వరిమొక్కకు 12రోజుల నుంచి పిలకలు వచ్చే స్వభావం వస్తుంది. మొక్కలు వత్తుగా ఉండడం వల్ల పిలకలు వేసే సామర్థ్యాన్ని కోల్పోతుంది.
తాజావార్తలు
- దేశంలో కొత్తగా 18,711 పాజిటివ్ కేసులు
- హుజురాబాద్ శివారులో ప్రమాదం : ఒకరు మృతి
- మహేష్ బర్త్ డే రోజు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్న మేకర్స్
- శర్వానంద్‌కు మెగాస్టార్, కేటీఆర్ సపోర్ట్..!
- తాజ్ మహల్ సాక్షిగా వివాహ వార్షికోత్సవం..
- భయపెడుతున్న భానుడి భగభగలు
- అమరచింత మాజీ ఎమ్మెల్యే మృతి
- కబడ్డీ కోర్టులో కొండెంగ.. నేను ఆడుతా!
- మరోసారి బుల్లితెరపై సందడికి సిద్ధమైన రానా..!
- ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్య