కార్లకు యమా క్రేజ్

కరోనా తెచ్చిన మార్పువిలాసం నుంచి అవసరం దాకా..ఆసక్తి చూపుతున్న మధ్యతరగతి ప్రజలు50 శాతం పెరిగిన విక్రయాలుకొత్త కార్లకు ఫుల్ డిమాండ్కొన్ని మోడల్స్‌కు 3 నెలల వరకు వెయిటింగ్మార్కెట్లో దొరకని సెకండ్ హ్యాండ్ వెహికల్స్కార్ డెకార్స్, గ్యారేజీల్లో చేతినిండా పని కొన్ని విశేషాలు కరోనాకు ముందు నెలకు 100 కార్లు అమ్మిన షోరూమ్‌లు ఇప్పుడు 150 వరకు అమ్ముతున్నాయి. గతంలో డీజిల్ కార్లకు డిమాండ్ ఉండేది. ప్రస్తుతం పెట్రోల్ కార్లపై జనం ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అన్ని కంపెనీల సేల్స్‌లోనూ రూ.6 లక్షల నుంచి రూ.10లక్షల మధ్య ధర ఉన్న కార్లకే డిమాండ్ ఉంది.
- సెకండ్ హ్యాండ్ కార్లకూ డిమాండ్ పెరగడంతో
- మోడల్‌ను బట్టి ధర కూడా రూ.50వేల నుంచి
- లక్ష వరకు ఎక్కువ చెప్తున్నారు.
- కొత్త కార్లు కొనాలనుకుంటున్న వాళ్లు ఆన్లైన్లో బాగా సెర్చ్ చేస్తున్నారు. వివిధ కంపెనీల మోడల్స్, ప్రత్యేకతలు, ఇతర మోడల్స్తోసరిపోల్చుకుంటున్నారు.
- ఒకప్పుడు.. కారు అంటే
విలాస వస్తువు. ఎగువ మధ్యతరగతి మొదలు.. పైస్థాయి వారు ఎక్కువగా ఉపయోగించడం తెలిసిందే. కరోనాకు ముందు, తర్వాత అన్నట్టుగా తయారైన సొసైటీలో జనం ప్రాధమ్యాల్లోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది. అలాంటి మార్పుల్లో ఒకటిగా కారు నేనొక అవసరమంటూ హారన్ కొడుతున్నది. కరోనా రేపిన కల్లోలం చూసి రిస్క్ ఎందుకని కొందరు.. ఉన్నంతలోనే బాగా బతుకుదామనే ఆలోచనలో కొందరు కార్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. పది మందితో కలిసి ప్రయాణించడం కంటే విడిగా వెళ్లడం మంచిదన్న ఆలోచనతో చిన్నదో, పెద్దదో ఓ కారు కొంటున్నారు. ఆర్థిక స్థోమతను బట్టి కొత్తది, లేదంటే సెకండ్ సేల్స్‌లో తీసుకుంటున్నారు. అన్‌లాక్ ప్రారంభం నుంచి ప్రతి నెలా విక్రయాలు అంతకంతకూ పెరుగుతున్నట్లు షోరూమ్‌ల నిర్వాహకులు చెబుతున్నారు. గతేడాదితో చూస్తే 50శాతం అమ్మకాలు ఎక్కువ ఉన్నట్లు తెలిపారు. కొన్ని మోడల్స్ అయితే.. బుకింగ్ చేసిన 3 నెలల దాకా కూడా రావడం లేదు. మరోవైపు మార్కెట్లో డిమాండ్ ఉండడంతో సెకండ్ హ్యాండ్ కార్లు కూడా అంత ఈజీగా దొరకట్లేదు. ధరలు కూడా బాగా పెరిగాయి. కార్ల కొనుగోలుతో కార్ డెకార్స్, కార్ గ్యారేజీలకూ చేతినిండా పని దొరుకుతున్నది.
నల్లగొండ, జనవరి9 (నమస్తే తెలంగాణ-ప్రతినిధి) : సొంత వాహనం.. అందులోనూ కారు ఉండాలనే కాంక్ష ప్రజల్లో పెరిగింది. కరోనా వేళ ప్రయాణాలకు బస్సులు, అద్దె వాహనాల కంటే సొంత కారునే కోరుకుంటున్నారు. కరోనాకు ముందు సామాన్యులతో పాటు మధ్యతరగతి ప్రజలు సైతం ఆర్టీసీ బస్సులు లేదంటే ప్రైవేటు వాహనాలను అద్దెకు తీసుకుని వెళ్లేవారు. ఆ ఒక్క రోజు టాక్సీ చెల్లిస్తే మళ్లీ అవసరం వచ్చినప్పుడు మాత్రమే కారు ఆలోచన చేసేవారు. కానీ, కరోనా నాటి నుంచి పరిస్థితులు తారుమారయ్యాయి. కరోనా భయం ప్రతి ఒక్కరినీ వెంటాడుతున్నది. కుటుంబంతో కలిసి ప్రయాణించాలన్నా, అత్యవసర పరిస్థితుల్లో సుదూర ప్రాంతాలకు వెళ్లాలన్నా చిన్నదో, పెద్దదో ఓ సొంత వాహనం ఉండాలన్న అభిప్రాయం బలపడింది. తమకున్న ఆర్థిక స్థోమతను బట్టి ఫోర్ వీలర్ల వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి పెరిగింది. ఏ మాత్రం ఆర్థిక వెసులుబాటున్నా... పాతదో కొత్తదో కొనడానికి వెనుకడుగు వేయడం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్లో కార్ల విక్రయాలు భారీగా పెరిగాయి. కొత్తవాటితో పాటు సెకండ్ హ్యాండ్ కార్లకు సైతం డిమాండ్ విపరీతంగా పెరిగింది.
కరోనా తెచ్చిన మార్పు వెయిటింగ్ భారం..
కార్ల ఉత్పత్తిపైనా కరోనా ప్రభావం చూపింది. దీంతో మార్కెట్లో పేరున్న రెండుమూడు కంపెనీల కార్లకు కొరత ఏర్పడడంతో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. హుండాయ్ క్రెటా, వెన్యూ, ఐ20 లాంటి ప్రముఖ మోడల్ కార్లకు సగటున నెలన్నర రోజుల వెయిటింగ్ కొనసాగుతున్నది. మారుతీ స్విఫ్ట్ డిజైర్, బ్రిజా, ఎర్టిగా లాంటి పెట్రోల్ మోడల్స్‌కు 15రోజుల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉన్నది. కొన్ని రకాల మోడల్స్ కోసం వేచిచూసే ధోరణి ఇష్టం లేక ఇతర కంపెనీల కార్లను సైతం కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. తమకు అనుకూల బడ్జెట్లో దొరికే కారు కొనుగోలు చేస్తున్నారు. వీరిలో తొలిసారి కారు కొనేవాళ్లే ఎక్కువగా ఉండడం గమనార్హం.
పెట్రోల్ కార్లపై మక్కువ...
పెట్రోల్ కార్లపై ప్రజలు మక్కువ చూపినట్లు స్పష్టమవుతున్నది. డీజిల్ వాహనాల ఉత్పత్తిని మారుతీ కంపెనీ నిలిపేయగా హుండాయ్, ఫోర్డ్ కంపెనీల్లోనూ పెట్రోల్ కార్ల సేల్స్ పెరిగింది. ఎక్కువగా రూ.6-10లక్షల మధ్య ధర కల్గిన పెట్రోల్ కార్లకే డిమాండ్ ఎక్కువగా ఉంది. వాడకం ఎక్కువగా ఉంటే డీజిల్ వాహనాన్ని, అరుదుగా బయటకు తీసే వారు పెట్రోల్ కార్లను ఎంచుకుంటున్నారు. నిత్యం అవసరం లేకున్నా కుటుంబానికి ఓ కారు ఉండాలన్న తాపత్రయమే కొనుగోలుదారుల్లో ఎక్కువగా కన్పిస్తున్నది.
సెకండ్ సేల్స్కూ డిమాండ్...
మధ్యతరగతి ప్రజలు సెకండ్ హ్యాండ్ కార్ల అన్వేషణలో మునిగితేలుతున్నారు. గతంలో ప్రత్యేకంగా సేల్ పాయింట్స్ పెట్టి క్రయవిక్రయాలు జరిపేవారు. కానీ కరోనా అనంతరం సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు తగ్గిపోయాయి. మార్కెట్‌కు పెద్దగా రావడం లేదు. ఎక్కువ మంది ఉన్న కారునే వాడేందుకు ఆసక్తిని చూపుతున్నారు. పైగా ఆయా కంపెనీలు గతంలో కొత్త కార్ల సేల్స్ పెంచుకునేందుకు ఎక్స్చేంజ్ మేళా పెట్టి ఆఫర్లు కూడా ప్రకటించేవారు. కానీ ఈ సీజన్లో అలాంటి పరిస్థితి లేదని ఆయా కంపెనీ నిర్వాహకులు తెలిపారు. సెకండ్ హ్యాండ్ కార్లు ఎక్సేంజ్‌కు రావడం లేదని, తాము కూడా వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం రావడం లేదంటున్నారు.
కార్ డెకార్స్, గ్యారేజీలకు గిరాకీ...
కార్ల క్రయవిక్రయాలు పెరగడంతో కార్ డెకార్స్, కార్ గ్యారేజీలకు గిరాకీ పెరిగింది. కొత్త కారు కొనుగోలు చేసే వారు అదనపు హంగుల కోసం కార్ డెకార్స్ను ఆశ్రయిస్తుంటారు. తమ అభిరుచులకు అనుగుణంగా ఇంటీరియర్ డెకరేషన్ చేయించుకుంటారు. సీట్ కవర్స్ మొదలు సౌండ్ సిస్టమ్, స్పీకర్లు, మ్యాట్స్, రియర్‌వ్యూ మిర్రర్లు ఇలా అదనపు ఫిట్టింగ్‌లకు మొగ్గు చూపుతారు. ప్రస్తుతం వీటికి మంచి డిమాండ్ పెరిగింది. గతంలో ఒకటో రెండు డెకార్స్‌కు మాత్రమే డిమాండ్ ఉండగా ప్రస్తుతం ఉన్న అన్ని కారు డెకార్స్‌కు చేతి నిండా పని ఉంటున్నది. కరోనా లాక్డౌన్లోని నష్టాలను అధిగమిస్తూ కారు డెకార్స్, గ్యారేజీలు, వీల్ అలైన్మెంట్ సెంటర్లు కళకళలాడుతున్నాయి.
ఆన్లైన్ సెర్చింగ్..
కొత్త, పాత కార్ల కోసం ఆన్లైన్ సెర్చింగ్, వెబ్సైట్లలో వెతుకులాట బాగా పెరిగినట్లు సమాచారం. కంపెనీల మోడళ్లు, వాటి ప్రత్యేకతలు, ఇతర మోడళ్లతో పోలికలు, ధరల్లో తేడాలు... ఇలా అనేక అంశాలను ఇంటర్నెట్ వేదికగా నిత్యం లక్షలాది మంది పరిశీలిస్తున్నట్లు కూడా ఆయా కంపెనీల ప్రతినిధులు వెల్లడించారు. ఎక్కువ మంది కార్ల పనితీరు, వాటిల్లో ఉండే సౌకర్యాలపై ఆరా తీస్తున్నారు. పరిస్థితులు ఇదేవిధంగా ఉంటే కార్ల వాడకం సర్వసాధారణం కానుందని మార్కెట్‌ను బట్టి స్పష్టం అవుతోంది.
కొత్తకారుకు తప్పని వెయిటింగ్..
సెకండ్ హ్యాండ్ కార్లు సైతం మంచి ధర పలుకుతున్నాయి. ఇక కొత్త కార్లు వెయిటింగ్ లిస్టులో ఉంటున్నాయి. సగటున నెల రోజుల వెయిటింగ్ ఉంటున్నదని షోరూం నిర్వాహకులు చెబుతున్నారు. గతంలో రెండు మూడు కంపెనీల కార్లపైనే ఎక్కువ ఆసక్తిని కనబరిచే వారు ఇప్పుడు అలాంటి ఆలోచన చేయడం లేదు. తమకు అనుకూల బడ్జెట్లో ఉందనిపిస్తే ఏ కంపెనీ కారైనా కొనుగోలు చేసేందుకు సిద్ధపడుతున్నారని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
50శాతం పెరిగిన విక్రయాలు...
కరోనాకు పూర్వంతో పోలిస్తే కార్ల విక్రయం 50శాతం పెరిగినట్లు సేల్స్ స్పష్టం చేస్తున్నాయి. గతంలో ఉమ్మడి జిల్లా మార్కెట్లో మెజార్టీ భాగం మారుతీ, హుండాయ్ కంపెనీల షేర్ ఉండేది. కానీ, ప్రస్తుతం ఫోర్డ్, టాటా, మహీంద్రా, కియా, టయోటాలతో పాటు రెనాల్ట్, డాట్సన్ కంపెనీల వాహనాల సేల్స్ కూడా పెరిగాయి. జిల్లాకేంద్రంలోని ఓ కారు షోరూంలో 2019ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు సగటున నెలకు అన్ని మోడళ్ల కార్లు వందకు పైగా విక్రయించేవారు. కానీ, కరోనా కాలంలో ఆగస్టు నుంచి డిసెంబర్ చివరి నాటికి సరాసరి నెలకు సగటున 150వాహనాల వరకు విక్రయించారు. ఇదే స్థాయిలో మరో కంపెనీ విక్రయాల్లోనూ 50శాతం వృద్ధి కన్పించింది. గతంలో 60కార్లు విక్రయిస్తే ఈ ఐదు నెలల కాలంలో నెలకు సగటున 90కార్ల వరకు విక్రయించినట్లు ఆ కంపెనీ సేల్స్ ప్రతినిధి వెల్లడించారు.
500కి పైగా.. 150 దాకా..
కరోనా కాలంలో ప్రజలు ఎక్కువగా సొంత వాహనాలపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో సాధారణ రోజుల్లో కంటే మా కంపెనీ కార్ల విక్రయం భారీగా పెరిగింది. ఈ కరోనా కాలంలోనే 500కార్లకు పైగా విక్రయించాం. కరోనా కంటే ముందు అన్ని మోడళ్లు కలిపి నెలకు 100కార్లు అమ్మితే ప్రస్తుతం 150కార్ల వరకు విక్రయిస్తున్నాం. కొన్ని మోడల్స్‌కు డిమాండ్ ఉండడంతో వెయిటింగ్ తప్పడం లేదు.
- కే.చంద్రపవన్రెడ్డి, పవన్ మోటార్స్ ఎండీ, నల్లగొండ కస్టమర్లే
షోరూమ్‌కు వస్తున్నారు..
కరోనాతో సొంత వాహనంపై ప్రతి ఒక్కరికీ మక్కువ పెరిగింది. గతంలో కస్టమర్ల వద్దకే రకరకాల ఆఫర్లతో కంపెనీలు వెళ్లేవి. కానీ నేడు ఆయా కంపెనీల షోరూంల వద్దకు కస్టమర్ల రాక బాగా పెరిగింది. తమ బడ్జెట్‌కు అనుకూలంగా ఉన్న మోడల్స్ ఎంచుకుని కొనుగోలు చేస్తున్నారు. గతంలో నెలకు సగటున 60కార్లు సేల్ అయ్యేవి. ప్రస్తుతం 90కార్లు విక్రయిస్తున్నాం. పెట్రోల్ కార్లకు డిమాండ్ పెరిగింది.
- మద్ది వినీలారెడ్డి, సన్సాయి హుండాయ్, ఎండీ, నల్లగొండ
కరోనా భయంతోనే కారు కొన్నా..
నల్లగొండ రూరల్, జనవరి 9: మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్న నేను జిల్లా మొత్తం తిరగాల్సి ఉంటుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు పడ్డా. పైగా ఏదైనా పని ఉంటే ప్యామిలీని బైక్‌పై బయటికి తీసుకెళ్లడానికి ఇబ్బంది అవుతున్నది. అందుకే రెండు నెలల కిందట 3.80లక్షలు పెట్టి సెకండ్‌హ్యాండ్ కారు కొన్నా.
- సాదు కిరణ్‌కుమార్, నల్లగొండ
ఇబ్బందే.. కానీ తప్పలేదు..
మిర్యాలగూడ టౌన్, జనవరి 9: బస్సుల్లో తిరగాలంటే భయంగా ఉన్నది. ఐదు నెలల కిందట మా నాన్నను హైదరాబాద్ దవాఖానకు తీసుకుపోవాల్సి వచ్చింది. అప్పుడు బస్సుల్లేవు. కార్లు తిరగట్లేదు. అంబులెన్సులో కిరాయి ఎక్కువ కావడంతో చాలా ఇబ్బందులు పడ్డాం. ప్రతి నెలా ఫైనాన్స్ కట్టడం ఇబ్బందే అయినా కరోనా సోకి దవాఖానలకు లక్షలు పెట్టడం కంటే పెద్ద కష్టం కాదనిపించి కారు కొన్నాం.
- ఎం.సుకుమార్, తక్కెళ్లపహాడ్, మిర్యాలగూడ
సొంత బండి ఉండాలని..
కోదాడ టౌన్, జనవరి 9: కరోనా వైరస్ కారణంగా చాలా మంది బస్సులు, ఆటోల్లో వెళ్లాలంటే భయపడుతున్నారు. నేను జ్యుయలరీ బిజినెస్ నిమిత్తం పలు ప్రాంతాలకు వెళ్లివస్తుంటాను. కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇండ్లకు కూడా వెళ్తుంటాం. కరోనా ఉన్నదనే భయంతోనే కుటుంబ సభ్యుల కోరిక మేరకు కొత్తగా కారు కొన్నా.
- మేకల నరేశ్, కోదాడ
తాజావార్తలు
- పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం
- అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన వాహనం యజమాని మృతి
- ఎవరీ పద్మశ్రీ.. దిల్ రాజు ఎక్కడినుంచి పట్టుకొచ్చాడు..?
- రూ.43వేల దిగువకు బంగారం ధర..
- ఆయుష్మాన్ 'డ్రీమ్ గర్ల్' తెలుగు రీమేక్‌కు రెడీ
- అందుకే పెద్ద సంఖ్యలో గురుకులాల స్థాపన
- .. ఆ ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ ఉపసంహరణ
- ఒలింపిక్ జ్యోతిని చేపట్టనున్న శతాధిక వృద్ధురాలు!
- రేణుకా ఎల్లమ్మ ఆలయంలో కర్ణాటక మంత్రి పూజలు
- ప్రభుత్వ కార్యక్రమానికి మంత్రికి బదులు సోదరుడు హాజరు