శనివారం 27 ఫిబ్రవరి 2021
Nalgonda - Jan 09, 2021 , 01:18:47

కడుపులోనే కడతేరుస్తున్నారు

కడుపులోనే కడతేరుస్తున్నారు

అడ్డగోలుగా లింగ నిర్ధారణ పరీక్షలుఆడపిల్ల అయితే కాసుల కోసం అబార్షన్లుపెద్దకాపర్తిలో ఏకంగా స్కానింగ్‌ సెంటర్‌17 మంది ఆర్‌ఎంపీలు, రిటైర్డ్‌ డాక్టర్‌తో నెట్‌వర్క్‌9మందికి రిమాండ్‌.. పరారీలో 8 మంది4 దవాఖానలు సీజ్‌.. విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి..లింగ నిర్ధారణ పరీక్షలు నేరమని తెలిసినా కొందరు బరితెగిస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడి కడుపులో ఉన్నది ఆడ పిల్లో, మగ పిల్లగాడో చెప్తున్నారు. ఆడ శిశువైతే బేరం మాట్లాడుకుని అప్పుడే ఆయువు తీస్తున్నారు. కొందరు ఆర్‌ఎంపీలు, కాంపౌండర్లు, డాక్టర్లు కలిసి సీక్రెట్‌ నెట్‌వర్క్‌ను ఆపరేట్‌ చేస్తున్నారు. నార్కట్‌పల్లి, చిట్యాలలో ఇలాంటి అక్రమానికి ఒడిగడుతున్న ముఠా అరెస్టుతో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

ఏకంగా స్కానింగ్‌ సెంటర్‌

చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో కొందరు ఆర్‌ఎంపీలు కలిసి అక్రమంగా స్కానింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. చిట్యాల, నార్కట్‌పల్లి, చౌటుప్పల్‌, నకిరేకల్‌ ప్రాంతాల్లోనెట్‌వర్క్‌ ఏర్పాటుచేసుకుని లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. స్కానింగ్‌కు రూ.10వేలు, అబార్షన్‌కు రూ.30వేలు అంటూ రేట్లు ఫిక్స్‌ చేసి మరీ ఆడపిల్లలను గర్భంలోనే చిదిమేస్తున్నారు.మొత్తం 17మంది సభ్యుల ముఠాలో పోలీసులు శుక్రవారం 9మందిని అరెస్ట్‌ చేశారు. మరో ఏడుగురు పరారీలో ఉన్నారు. నల్లగొండకు చెందిన ముగ్గురు ఆర్‌ఎంపీలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.

నల్లగొండ, జనవరి 8 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి) : లింగనిర్ధారణ, అబార్షన్ల విషయంలో కఠిన చట్టాలు అమలులో ఉన్నా... నేటికీ కొందరు కాసులకు కక్కుర్తి పడి గుట్టుగా వీటిని నిర్వహిస్తూనే ఉన్నారు.  ఇందులో గ్రామీణప్రాంతాల్లో పనిచేసే కొంతమంది ఆర్‌ఎంపీలు కీలకంగా వ్యవహరిస్తుండగా.. గ్రామాల్లో ఉండే సామాన్యులే వీరికి కేంద్రబిందువు. మగపిల్లాడు కావాలన్న కోరికను ఆసరాగా అక్రమదందాకు తెరలేపుతున్నారు. అలాంటి వారు వస్తే... ఓ రేట్‌ ఫిక్స్‌ చేసి స్కానింగ్‌తోపాటు అబార్షన్‌ వరకు అన్నీ తామై వ్యవహరిస్తారు. ఆర్థిక స్థోమతను బట్టి 30 నుంచి రూ.50 వేల వరకు   వసూలు చేస్తున్నారు. ఇందులో స్కానింగ్‌ చేసి ఆడ, మగ చెప్పేందుకు 10వేలు.. అబార్షన్‌కు 20నుంచి రూ.40 వేల వరకు గుంజుతున్నారు. దగ్గరలో ఉన్న పట్టణాల్లో కొన్ని స్కానింగ్‌ సెంటర్ల సహకారంతో ఈ దందా సాగిస్తున్నారు. చిట్యాల, నార్కట్‌పల్లి ప్రాంతాల్లో పోలీసుల విచారణలో ఈ విషయం వెలుగు చూసింది. ఎంబీబీఎస్‌ వైద్యుల వద్దకు వెళ్తే ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తున్నదని ఏకంగా సీనియర్‌ కాంపౌండర్లతోనే అబార్షన్లు చేసేస్తున్నట్లు సమాచారం.

గ్రామంలోనే స్కానింగ్‌ సెంటర్‌...

చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో కొందరు ఆర్‌ఎంపీలు కలిసి ఏకంగా ఓ స్కానింగ్‌ సెంటర్‌ను ఏర్పాటుచేశారు. అనుమతులు, అర్హతలు లేకుండా కొంతకాలంగా లింగనిర్ధారణ పరీక్షలు జరుపుతున్నారు. చిట్యాలతోపాటు నార్కట్‌పల్లి, చౌటుప్పల్‌, నకిరేకల్‌ తదితర ప్రాంతాల నుంచి  ఆర్‌ఎంపీలు రహస్యంగా ఈ కేంద్రాన్ని ఉపయోగిస్తున్నట్లు పోలీసుల విచారణలో స్పష్టమైంది. ఇక్కడ లింగ నిర్ధారణకే రూ.10 వేలు వసూలు చేస్తున్నారు. అబార్షన్‌ కోసం ప్రత్యేక దవాఖానలను నిర్వహిస్తున్నారు. వీటిల్లో రిటైర్డ్‌ వైద్యులు లేదంటే సీనియర్‌ కాంపౌండర్లను వాడుకుంటున్నారు. కొందరు ఆర్‌ఎంపీలయితే తామే అబార్షన్లు చేసేస్తున్నారు. అందుకోసం రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నట్లు స్పష్టమైంది. వారంరోజులుగా పోలీసుల విచారణలో అనేక విస్తుగొలిపే విషయాలు వెలుగుచూస్తున్నాయి. లింగ నిర్ధారణకు పాల్పడుతూ.. దవాఖానలను నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటివరకు ఈ దందాలో పాత్రదారులుగా 17మందిని గుర్తించి కేసులు నమోదు చేశారు. ఇందులో 9మందిని అరెస్టు చేశారు. 8మంది పరారీలో ఉండగా వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరిచ్చిన సమాచారం ఆధారంగా జిల్లా మొత్తం ఇలాంటి దందాపై పోలీసులు దృష్టి సారించారు. పట్టణాల్లో సైతం ఈ దందాతో సంబంధం ఉన్న వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. నల్లగొండకు చెందిన ఓ ముగ్గురు ఆర్‌ఎంపీలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.

VIDEOS

logo