ధనాధన్ధరణి

- 50 రోజుల్లో 8,565 రిజిస్ట్రేషన్లు
- జోరుగా వ్యవసాయ భూముల క్రయ, విక్రయాలు
- ఆటంకాలను అధిగమిస్తూ మున్ముందుకు..
- త్వరలోనే అన్ని రకాల భూములకు అవకాశం
- అంతే దూకుడుగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు
- ఇప్పటికి 7,975 రిజిస్ట్రేషన్లు.. రూ.22.5కోట్ల ఆదాయం
సేవల్లో జాప్యం లేదు. చేతులు తడిపే పని అసలే లేదు. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు, పాస్‌పుస్తకాల కోసం నిరీక్షణలు తప్పాయి. పారదర్శకతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘ధరణి’ సేవలు సమర్థవంతంగా అందుతున్నాయి. స్లాట్ బుక్ చేసుకుని, ఇచ్చిన సమయానికి తాసీల్దార్ కార్యాలయానికి వెళ్తే.. అరగంట లోపే రిజిస్ట్రేషన్‌తోపాటు భూ హక్కుల బదలాయింపు పూర్తవుతున్నది. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చి మంగళవారంతో 50 పని దినాలు పూర్తవగా.. ఇప్పటివరకు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 8,565 వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయి. పార్ట్-బీలో పెండింగ్‌లో ఉన్న భూములను కూడా కొలిక్కి తెచ్చేందుకు రెండు నెలల కార్యాచరణ సిద్ధమవుతున్నది.
-నల్లగొండ, జనవరి6 (నమస్తే తెలంగాణ-ప్రతినిధి)
నల్లగొండ, జనవరి6 (నమస్తే తెలంగాణ-ప్రతినిధి) : రెవెన్యూలో నూతన శకంగా భావిస్తున్న ధరణి పోర్టల్ సేవల్లో వేగం పుంజుకుంది. ధరణి ద్వారా సులభతర సేవలు అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న మాటలను అక్షరాలా నిజం చేస్తూ జిల్లాలో భూ లావాదేవీలు కొనసాగుతున్నాయి. భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా చేపట్టిన రికార్డుల ఆధునీకరణ ఫలితాలు రిజిస్ట్రేషన్లలో సాక్షాత్కారిస్తున్నాయి. పట్టాదారు పాసుపుస్తకాలు కలిగిన రైతుల రిజిస్ట్రేషన్లలో ఎలాంటి జాప్యం లేకుండా సేవలు కొనసాగుతున్నాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అవసరమైన డాక్యుమెంట్లను స్లాట్ బుకింగ్ సమయంలోనే మీ సేవ ద్వారా అప్లోడ్ చేయడంతోపాటు నిర్ణీత ఫీజుల చెల్లింపు పూర్తవుతుంది. దీంతో అక్కడ ఇచ్చిన పత్రాలకు కేటాయించి సమయానికి తాసీల్దార్ కార్యాలయానికి చేరుకుంటే ఇద్దరు సాక్షుల సంతకాలతో జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్న తాసీల్దార్ సమక్షంలో ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. రిజిస్ట్రేషన్, ఆ వెంటనే మ్యుటేషన్, పాసుపుస్తకాల్లో భూ మార్పిడి కూడా అరగంటలోపే పూర్తి అవుతున్నది. ఈ విధానంపై క్రయవిక్రయదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి జాప్యం లేకుండా అక్కడికక్కడే మొత్తం ప్రక్రియ పూర్తి అవుతుండడం విశేషం. ఈ విధానంలో ప్రారంభంలో ఒకటిరెండు రోజులు రిజిస్ట్రేషన్లు తక్కువగా జరిగినా మెల్లమెల్లగా ఊపందుకున్నాయి.
50రోజుల్లో 8,565 రిజిస్ట్రేషన్లు పూర్తి
నవంబర్ 2న ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. ఇప్పటివరకు 5,683 స్లాట్ బుకింగ్స్ కాగా 5,345 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. మరో 338 రిజిస్ట్రేషన్లు కావాల్సి ఉంది. రెవెన్యూ డివిజన్ల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా నల్లగొండ డివిజన్లో 2340, దేవరకొండలో 2019, మిర్యాలగూడలో 1314 స్లాట్స్‌తో రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. సగటున రోజూ 113 రిజిస్ట్రేషన్ల చొప్పున నల్లగొండ జిల్లాలో పూర్తయ్యాయి.
సూర్యాపేట జిల్లాలో 2,812..
సూర్యాపేట జిల్లాలో 50 పనిదినాల్లో 2,882 స్లాట్స్‌కు 2,812 రిజిస్ట్రేషన్లు పూర్తి కాగా మరో 70 పెండింగ్‌లో ఉన్నాయి. నవంబర్ 11న అత్యధికంగా 119 రిజిస్ట్రేషన్లు, అదే నెల 12న 100 రిజిస్ట్రేషన్లు జరిగాయి. మొత్తంగా సగటున రోజూ 57 రిజిస్ట్రేషన్ల చొప్పున రిజిస్ట్రేషన్లు జరిగాయి.
సంక్రాంతి తర్వాత ఇంకా వేగం..
సంక్రాంతి తర్వాత వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల వేగం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఊపందుకుంటున్నట్లు స్పష్టం అవుతుంది. పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ పూర్తయ్యి మ్యుటేషన్ పెండింగ్‌లో ఉన్న వాటికి కలెక్టర్ల ద్వారా రిజిస్ట్రేషన్లకు ఆప్షన్ అందుబాటులోకి తెచ్చారు. దీంతోపాటు లీజు తదితర అంశాల్లోనూ రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు పార్ట్‌బీలో పెండింగ్‌లో ఉన్న భూముల వివరాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం రెండు నెలల కార్యాచరణను సిద్ధం చేస్తున్నది.
వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు 7,975
వ్యవసాయేతర ఆస్తుల, భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా ఎప్పటిలాగే గాడిలో పడింది. కొత్తగా వేసిన వెంచర్లలోని ప్లాట్లను మినహాయిస్తూ అన్ని రకాల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం అనుమతించింది. డిసెంబర్ 22 నుంచే రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా.. 30 నుంచి పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు వేగం పుంజుకున్నాయి. ఉమ్మడి జిల్లాలో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. వీటి పరిధిలో బుధవారం నాటికి 7,975 రిజిస్ట్రేషన్లు పూర్తయినట్లు జిల్లా రిజిస్ట్రేషన్ల శాఖాధికారి ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.22.15 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిపారు.
తాజావార్తలు
- కరోనా వ్యాక్సినేషన్:మినిట్‌కు 5,900 సిరంజీల తయారీ!
- పాత వెహికల్స్ స్థానే కొత్త కార్లపై 5% రాయితీ: నితిన్ గడ్కరీ
- ముత్తూట్ మృతిపై డౌట్స్.. విషప్రయోగమా/కుట్ర కోణమా?!
- శ్రీశైలం.. మయూర వాహనంపై స్వామి అమ్మవార్లు
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం
- స్విస్ ఓపెన్ 2021: మారిన్ చేతిలో సింధు ఓటమి
- తెలుగు ఇండస్ట్రీలో సుకుమార్ శిష్యుల హవా
- భైంసాలో ఇరువర్గాల ఘర్షణ.. పలువురికి గాయాలు
- గుత్తాకు అస్వస్థత.. మంత్రి, ఎమ్మెల్యేల పరామర్శ
- 2021లో రెండు సినిమాలతో వస్తున్న హీరోలు వీళ్లే