శనివారం 27 ఫిబ్రవరి 2021
Nalgonda - Jan 06, 2021 , 00:11:31

టీకాకు చకచకా...

టీకాకు చకచకా...

  • ప్రభుత్వ వైద్యారోగ్య 
  • కేంద్రాల్లో ఏర్పాట్లు
  • తొలి విడుతలో 
  • ఫ్రంట్‌ లైన్‌ 
  • వారియర్స్‌కు వ్యాక్సిన్‌
  • 13 నుంచి వేసే అవకాశం
  • కరోనాకు కళ్లెం వేసేందుకు 

కొవిడ్‌ వ్యాక్సిన్‌ వస్తున్నది. ఐసీఎంఆర్‌, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యాక్సినేషన్‌కు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నది. అన్ని సవ్యంగా సాగితే ఈ నెల 13 నుంచే తొలి విడుత టీకాల పంపిణీ ప్రారంభం కానున్నది. కరోనాపై పోరులో ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా సేవలందిస్తున్న వైద్యారోగ్య సిబ్బంది, అంగన్‌వాడీ, ఆశ వర్కర్లకు ముందుగా వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. అందుకోసం నల్లగొండ జిల్లాలో 10,866 మందిని, సూర్యాపేట జిల్లాలో 2,794 మందిని ఇప్పటికే గుర్తించారు. వ్యాక్సిన్‌ నిల్వ, సరఫరాకు అన్ని ఏర్పాట్లూ చేశారు.

  • నల్లగొండ తొలి విడుత ప్రణాళిక47  సెంటర్లు
  • సూర్యాపేట10, 866 మందికి.. 28సెంటర్లు
  • 2,794మందికి.. ఎల్లుండి డ్రై రన్‌

నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని 78 సెంటర్లలో శుక్రవారం డ్రై రన్‌కు వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ ప్రక్రియలో టీకా వేయడం మినహాయిస్తే మిగతాదంతా సేమ్‌ టు సేమ్‌. వ్యాక్సినేషన్‌ సమయంలో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు, ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలను సిబ్బంది పాటిస్తారు. ఆ మేరకు ఇప్పటికే శిక్షణ పొందారు. 

నల్లగొండ, జనవరి5(నమస్తే తెలంగాణ-ప్రతినిధి) :  కరోనాపై శాశ్వత విజయం సాధించడంలో కీలకపాత్ర పోషిస్తుందని భావిస్తున్న వ్యాక్సినేషన్‌కు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సర్వం సిద్ధమవుతున్నది. కరోనా మొదలైన నాటి నుంచే వ్యాక్సిన్‌పై తీవ్ర చర్చ జరుగుతూ వచ్చింది. వ్యాక్సిన్‌ త్వరగా అందుబాటులోకి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. ఈ నేపథ్యంలో పలు సంస్థలు తయారుచేసిన వ్యాక్సిన్‌కు కేంద్రం ఆమోదం తెలుపుతూ ప్రజలకు వేసేందుకు అనుమతులిచ్చింది. అందుకు అనుగుణంగా నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. 

తొలుత ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కే..

 భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతించిన కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌ వ్యాక్సిన్లు జిల్లాకు సరఫరా కావచ్చని తెలుస్తోంది. ఈ వ్యాక్సిన్లను తొలి విడుతలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ అయిన వైద్యులు, వైద్యారోగ్య సిబ్బంది, ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లకు వేయనున్నారు. ఇప్పటికే వీరికి సంబంధించిన సమగ్ర సమాచారం సేకరించి ప్రొఫైల్‌ సిద్ధం చేశారు. ఇందులో ప్రభుత్వ వైద్య సిబ్బందితోపాటు ప్రైవేటు దవాఖాన వైద్యులు, సిబ్బంది కూడా ఉన్నారు. నల్లగొండ జిల్లాలో మొత్తం 10866 మందిని ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించి టీకా వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నల్లగొండ జిల్లా కేంద్ర దవాఖానతోపాటు మరో 47 వైద్యారోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాకు సరఫరా అయిన వ్యాక్సిన్‌ను ముందుగా జిల్లా కేంద్ర దవాఖానలోని వ్యాక్సిన్‌ స్టోర్‌లో నిల్వ చేస్తారు. అక్కడి నుంచి వ్యాక్సినేషన్‌కు ఎంపిక చేసిన 47 కేంద్రాలకు తరలిస్తారు. ఈ కేంద్రాల్లో వ్యాక్సిన్‌ నిల్వ కోసం ముందుగానే కోల్డ్‌ స్టోరేజ్‌ సౌకర్యాన్ని కూడా కల్పించారు. ఇక సూర్యాపేట జిల్లాలోనూ తొలి విడుత వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 2794 మందికి తొలి విడుత టీకా వేయనుండగా అందులో 200 మంది ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్యులు, 34 మంది స్టాఫ్‌ నర్సులు, 312 మంది ఏఎన్‌ఎంలు, 1034 మంది ఆశవర్కర్లు, 1196 మంది అంగన్‌వాడీ సిబ్బంది, 18మంది ఆర్‌బీఎస్‌కే సిబ్బంది ఉన్నారు. వీరందరికీ టీకా వేసేందుకు జిల్లాలోని 28 వైద్యారోగ్య కేంద్రాలను ఎంపిక చేశారు. 

రెండు, మూడు దశల్లో మరింత మందికి..

రెండో దశలో కరోనాపై పోరులో తమవంతు పాత్ర పోషించిన పోలీసు, ఆర్మీ, మున్సిపల్‌, పంచాయతీ ఉద్యోగులు, సిబ్బందికి టీకా వేయాలని నిర్ణయించారు. వీరికి సంబంధించిన సమగ్ర సమాచారం త్వరలోనే సేకరించనున్నారు. మూడో దశలో 50 ఏండ్ల పైబడిన వారితోపాటు 50 ఏండ్ల లోపల ఉండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి టీకా వేయనున్నారు. ఇలాంటి వారందరూ కూడా తమ పేర్లను ఏదో ఒక గుర్తింపు కార్డుతో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా వెలువడలేదు. సుమారు ఆరు నెలల పాటు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగనున్నట్లు వైద్యారోగ్య శాఖ అంచనా వేస్తుంది. ఒక్కో వ్యక్తికి 28రోజుల వ్యవధిలో రెండుసార్లు టీకా వేస్తేనే వ్యాక్సినేషన్‌ పరిపూర్ణమైనట్లుగా భావిస్తారు. 

ప్రతి రోజూ 100 మందికి...

తొలి విడుతలో ఎంపిక చేసిన వైద్యసిబ్బందిలో ప్రతి రోజూ ఒక్కో సెంటర్‌లో వంద మందికి మాత్రమే వ్యాక్సినేషన్‌ చేయనున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఒక్కో వ్యాక్సినేషన్‌ కేంద్రంలో ఒక వైద్యుడితో పాటు మరో నలుగురు వైద్యసిబ్బంది ఉండనున్నారు. టీకా వేసే సమయాన్ని మూడు దశలుగా విభజించి ఒక్కో దశలో తగు జాగ్రత్తలను తీసుకోనున్నారు. టీకా వేసేందుకు అవసరమైన శిక్షణ కూడా క్షేత్ర స్థాయి వరకు పూర్తి చేశారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో మంగళవారం వైద్యారోగ్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ, టీకా వేసేందుకు పాటించాల్సిన నిబంధనలపై అవగాహన కల్పించారు. బుధవారం కూడా మరోసారి అనుమానాలను నివృత్తి చేయనున్నారు. ఒక్కో రోజు వందమంది చొప్పున నల్లగొండ జిల్లాలోని 10866 మందికి టీకా వేయాలంటే మూడు రోజుల సమయం పట్టనుంది. మొత్తం 50 కేంద్రాల్లో రోజూ వంద మంది చొప్పున ఐదు వేల మంది వరకు వ్యాక్సినేషన్‌ జరుగనుంది. ఇక సూర్యాపేట జిల్లాలోనూ 28 కేంద్రాల్లో వంద మందికి చొప్పున టీకా వేస్తే 2794 మందికి ఒకే రోజులో వ్యాక్సినేషన్‌ పూర్తి కానుంది. వివిధ ప్రభుత్వ వైద్యకేంద్రాల్లో సాధారణంగా బుధ, శనివారాల్లో ఇతర వ్యాక్సిన్లను ఇస్తుండడం వల్ల మిగిలిన సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసే అవకాశాలు ఉన్నాయి. 

విజయవంతం చేయాలి : డీఎంహెచ్‌ఓ

 డ్రై రన్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నల్లగొండ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ అన్నిమళ్ల కొండల్‌రావు అన్నారు. మంగళవారం జిల్లా కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏఎన్‌ఎంలకు వ్యాక్సినేషన్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ నెల రెండో వారంలో జిల్లాకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ చేరుకునే అవకాశం ఉందన్నారు. వ్యాక్సిన్‌పై ప్రతి వైద్యసిబ్బంది అన్ని విషయాలను తెలుసుకోవాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అరుంధతి, డీఐఓ రామ్మోహన్‌రావు, పీహెచ్‌సీ, యూహెచ్‌సీల డాక్టర్లు, సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు. 


VIDEOS

logo