సదరం.. సందేహాలా..!

- దళారుల జోక్యం లేకుండా సర్టిఫికెట్ నేరుగా పొందే అవకాశం
- తొలిరోజు 32మంది స్లాట్ బుకింగ్, 22మంది హాజరు
పరీక్షలు షురూ..
నీలగిరి, జనవరి 4 : జిల్లాలో ఈ సంవత్సరానికి సంబంధించి సదరం క్యాంపులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఆదేశాలతో జనవరి 1నుంచే స్లాట్ బుకింగ్ అవకాశం కల్పించగా వైద్యశిబిరం సోమవారం ప్రారంభమైంది. రోజుకు 32మంది పరీక్షలు చేయించుకుంటున్నారు. కొత్తగా 26మంది , మరో ఆరుగురు రెన్యూవల్ స్లాట్ బుక్ చేసుకున్నారు. మొత్తం 22మందికి వైద్యులు పరీక్షలు చేశారు.
నీలగిరి, జనవరి 4 : వైకల్య ధ్రువీకరణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సదరం కేంద్రాల్లో దళారుల జోక్యం మితిమీరిపోయింది. దళారుల కారణంగా దివ్యాంగులు ఆర్థికంగా నష్టపోతున్నారు. సర్టిఫికెట్ పొందే విధానం తెలియక మోసపోతున్నారు. సర్టిఫికెట్ ఎలా పొందాలి. దానిలో ఏమైనా మార్పులు, చేర్పులు ఎలా సాధ్యం.. తదితర అంశాల సమాహారం ఈ కథనం.
వైకల్య ధ్రువీకరణ పొందడం ఇలా..
నూతనంగా లేదా రెన్యూవల్ సదరం సర్టిఫికెట్ పొందాలనుకునే వారు ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోతో మీ సేవ కేంద్రంలో నమోదు చేసుకుని తేదీ, సమయం, స్థలం వివరాలు పొందాలి. ఆ ప్రకారం జిల్లా జనరల్ దవాఖానకు వెళ్లి క్యాంపు అడ్మిన్‌ను సంప్రదించి సంబంధిత డాక్టర్‌తో పరీక్షలు చేయించుకోవాలి. ఆన్లైన్లో వైకల్యం వివరాలు నమోదైన అనంతరం కంప్యూటర్ ద్వారా సర్టిఫికెట్ జారీ చేస్తారు. సదరం సర్టిఫికెట్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆదేశాలతో గ్రామ కార్యదర్శి ద్వారా లబ్ధిదారుడికి అందుతుంది.
ధ్రువీకరణ ఎవరెవరికి ఇస్తారంటే..!
శారీరక వైకల్యం, మానసిక రుగ్మత, వినికిడి లోపం, కంటి రుగ్మతలు కలిగిన వారు సదరం ద్వారా వైకల్యం సర్టిఫికెట్ తీసుకోవచ్చు.
తాత్కాలిక సర్టిఫికెట్ రెన్యూవల్ ఇలా..
తాత్కాలిక సర్టిఫికెట్ గడువు ముగిసిన తరువాత మీసేవ కేంద్రంలో పాత సర్టిఫికెట్ చూపించి స్లాట్ బుక్ చేసుకోవాలి. నిర్ణీత తేదీ, సమయం, స్థలంలో జిల్లా కేంద్రంలోని జనరల్ దవాఖానకు వెళ్లాలి. అడ్మిన్ కార్యాలయంలో సంబంధిత డాక్టర్ చేత పరీక్ష చేయించుకోవాలి. తిరిగి మొదటిసారి మాదిరిగానే ఎంపీడీఓ కార్యాలయం నుంచి గ్రామ కార్యదర్శి చేతుల మీదుగా వస్తుంది.
సదరం క్యాంపు వేళలు..
సదరం క్యాంపు జిల్లా జనరల్ దవాఖానలో ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 1.00వరకు మాత్రమే నిర్వహిస్తారు. నిర్ణీత సమాయానికి కచ్చితంగా హాజరుకావాలి.
పేరు, చిరునామా మార్పునకు..
పేరు, పుట్టిన తేదీ, చిరునామా మార్పునకు జిల్లా జనరల్ దవాఖానలోని సదరం కార్యాలయంలో దరఖాస్తు చేయాలి. పేరు, పుట్టిన తేదీ మార్పునకు ఆధార్ లేదా పదో తరగతి సర్టిఫికెట్ సమర్పించాలి. చిరునామా మార్పునకు నివాస ధ్రువీకరణ పత్రం జిరాక్స్ ప్రతులు సమర్పించాలి. తదుపరి చర్యకు గాను జిల్లా మెడికల్ బోర్డు, డీఆర్డీఏ ఆమోదంతో మార్చిన సదరం సర్టిఫికెట్ అందిస్తారు. జిల్లాలో మార్పు చేయలేని వాటికి ప్రభుత్వ ఉత్తర్వు 31ప్రకారం రాష్ట్ర అప్పిలేట్ బోర్డుకు సిఫార్సు చేస్తారు.
వైకల్యశాతం తక్కువ వస్తే...
జిల్లా మెడికల్ బోర్డులో వైకల్యశాతం తక్కువగా వచ్చిందని భావిస్తే తదుపరి రీ అసెస్మెంట్కు గాను జిల్లా మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసి రాష్ట్ర అప్పిలేట్ బోర్డుకు వెళ్లాల్సి ఉంటుంది.
పేరు నమోదుకు ఏం చేయాలి..?
ఆధార్ కార్డు అప్డేట్ కాని పక్షంలో మీసేవలో పేరు నమోదుకు ఆటంకాలేర్పడుతాయి. వేలిముద్రలు అప్డేట్ లేకపోవచ్చు. లేదా చిరునామా ఆప్డేట్ అవసరం ఉండొచ్చు. వెంటనే ఆధార్ కేంద్రంలో కార్డు అప్డేట్ చేసి మళ్లీ ప్రయత్నించాలి.
సదరం సర్టిఫికెట్ పోగొట్టుకుంటే...
సదరం సర్టిఫికెట్ పోగొట్టుకుంటే సమీప పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించాలి. ధ్రువీకరణ వివరాలతో జిల్లా దవాఖానలో సదరం కార్యాలయాన్ని సంప్రదించి నిర్ణీత నమునాలో దరఖాస్తు చేసి పొందవచ్చు. ఒక వేళ అప్పుడు సదరం సర్టిఫికెట్ జారీ చేసిన డాక్టర్లు పదవీ విరమణ లేదా బదిలీ అయితే రాష్ట్ర మెడికల్ బోర్డులో ఆసెస్మెంట్ చేయించుకుని వైకల్య శాతంలో మార్పులను అంగీకరిస్తూ పొందవచ్చు. ఈ మేరకు దివ్యాంగులు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
అనర్హులు సర్టిఫికెట్ తీసుకుంటే..
వైకల్యం లేకుండా సదరం సర్టిఫికెట్ తీసుకోవడం నేరం. సర్టిఫికెట్ పొందడానికి ప్రయత్నించిన వారికి రెండేండ్ల జైలు లేదా రూ.20వేలు జరిమానా విధిస్తారు. ఒక్కో సందర్భంగా రెండింటినీ అమలు చేస్తూ సెక్షన్ 69 పర్సన్స్ విత్ డిసేబిలిటీ చట్టం 1995 ప్రకారం శిక్షించే వీలుంది.
సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్..
సదరం సందేహాల నివృత్తికి 8499024111నెంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. పని దినాల్లో ఉదయం 10నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు.
తాజావార్తలు
- గవర్నర్ దత్తాత్రేయను తోసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
- గుజరాత్‌కు కాషాయ పార్టీ చేసిందేమీ లేదు : సూరత్ రోడ్‌షోలో కేజ్రీవాల్
- నల్లటి పెదవులు అందంగా మారాలా? ఇవి ట్రై చేయండి
- కుమార్తె ప్రియుడితో పారిపోయిన తల్లి
- టికెట్ డబ్బులు రిఫండ్ ఇవ్వండి..
- రోడ్ షోలో స్కూటీ నడిపిన స్మృతి ఇరానీ.. వీడియో
- నిర్మల్ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
- హాట్ టాపిక్‌గా వైష్ణవ్‌తేజ్ 3 సినిమాల రెమ్యునరేషన్
- బస్సులను అపడం లేదు.. కానీ నెగటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి
- రైలు పట్టాలపై ఆత్మహత్యాయత్నం.. అడ్డుకున్న రైల్వే పోలీసులు ..వీడియో