సోమవారం 01 మార్చి 2021
Nalgonda - Jan 03, 2021 , 01:19:43

ఫలప్రదం

ఫలప్రదం

 • విభిన్నపంటల ఉద్యాన‘వనం’  
 • ఆధునిక సాగు పద్ధతులపై రైతుల ఆసక్తి
 • డ్రాగన్‌ ఫ్రూట్‌, ఆపిల్‌బేర్‌, అంజీరా సాగు   
 • కినో ఆరెంజ్‌, తైవాన్‌ జామ, సీతాఫలం సైతం

వ్యవసాయం అంటే... ఆహారపంటలు లేదంటే వాణిజ్యపంటలే అనేది సర్వసాధారణమైంది. సాగునీరు పుష్కలంగా ఉండే ప్రాంతాల్లో వరి, మెట్ట ప్రాంతాల్లో బత్తాయి, నిమ్మ, మామిడి..  ఇక పూర్తి మెట్ట ప్రాంతాల్లో పత్తి, కందిపంటలు... మూడు, నాలుగు దశాబ్దాలుగా ఇదే పద్ధతి అవలంబిస్తున్న రైతాంగం ఇటీవల ప్రయోగాత్మక సాగుకు శ్రీకారం చుట్టారు. ఉద్యాన పంటల్లో విభిన్న రకాల సాగుకు మొగ్గుచూపుతున్నారు. జిల్లాకు పరిచయమే లేని డ్రాగన్‌ ఫ్రూట్స్‌, కినోఆరెంజ్‌, ఆపిల్‌బేర్‌, అంజీరా, ఖర్జూర లాంటి పంటల సాగు మొదలైంది. వీటికి తోడు ప్రత్యేక షెడ్స్‌ వేసి పూలతోటల పెంపకాన్ని ప్రారంభించారు. డిమాండ్‌ ఉన్న ఆర్గానిక్‌ ఫామింగ్‌పైనా ఆసక్తి మొదలైంది. ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్న నేపథ్యంలో ఉద్యానవనంలో మొలకెత్తుతున్న ఆధునిక పంటలపై ఈ ‘ఆదివారం’ ప్రత్యేక కథనం...

- నల్లగొండ, జనవరి 2 (నమస్తే తెలంగాణ-ప్రతినిధి) 

సంప్రదాయ పంటల నుంచి ఇప్పుడిప్పుడే జిల్లా రైతులు దృష్టిని మళ్లిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో పండే విభిన్న, లాభదాయక పంటల సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతుల్లో కొందరు, కొత్తగా సాగులోకి తొంగిచూస్తున్న యువత, రిటైర్డ్‌ ఉద్యోగులు సాగులో ప్రయోగాలకు మొగ్గుచూపుతున్నారు. రాష్ట్ర రాజధానికి దగ్గరగా ఉండే జిల్లా కావడంతో మార్కెటింగ్‌కు కూడా పెద్దగా ఇబ్బంది ఉండబోదన్నది ఆధునిక రైతుల యోచన. 

కొత్త రకం పండ్ల తోటల సాగు..

తిప్పర్తి, నల్లగొండ మండలాల్లో పలువురు రైతులు డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగును ప్రయోగాత్మకంగా చేపట్టారు. దీపకుంటలో ఓ యువరైతు ఇప్పటికే పంటను మార్కెట్‌కు తరలించి సంతృప్తికర ఫలితాలు సాధించారు. బత్తాయికి ప్రత్యామ్నాయంగా కినోఆరెంజ్‌ సాగు మొదలైంది. నిడమనూర్‌, నల్లగొండ, తిప్పర్తి, గుర్రంపోడు మండలాల పరిధిలో పలువురు రైతులు సాగు చేపట్టారు. జిల్లాకు అస్సలు పరిచయమే లేని ఆపిల్‌బేర్‌ సాగు విస్తరించింది. పెద్దవూర మండలంతో పాటు పలు చోట్ల దీని సాగుకు రైతులు ముందుకు వచ్చారు. తైవాన్‌జామతో పాటు సాధారణ జామ సాగు కూడా పెరిగింది. తిప్పర్తి, నల్లగొండ, మాడ్గులపల్లి, కనగల్‌ మండలాల్లో తైవాన్‌జామ తోటలు పెద్ద మొత్తంలో సాగు చేశారు. పొలాల గట్ల వెంట, గుట్టల వెంట, ఇంటి పెరట్లోనే కనిపించే సీతాఫలం కూడా ప్రత్యేకంగా సాగుచేస్తున్నారు. హైబ్రీడ్‌ విత్తనంతో వీటి సాగుకు రైతులు ఉపక్రమిస్తున్నారు. ఇటీవల సీతాఫలాలు కిలో రూ.200నుంచి 250వరకు ధర పలికాయి. నల్లగొండ మండలంలోని పలు గ్రామాల్లో అంజీరా, ఖర్జూర దిగుబడి మొదలైంది. వీటికి కూడా మార్కెట్‌లో మంచి ధర పలుకుతున్నది. బొప్పాయి, దానిమ్మ, పుచ్చకాయల పండ్ల తోటల సాగు కూడా రోజురోజుకూ పెరుగుతున్నది. సాగునీటి వసతి కల్గిన ప్రాంతాల్లో రైతులు కొత్త పద్ధతుల ద్వారా సాగుకు ఉపక్రమిస్తున్నారు. ఉన్నత చదువులు చదివిన యువత, రిటైర్డ్‌ ఉద్యోగులు కూడా సాగుకు సిద్ధం కావడం విశేషం. సూర్యాపేట జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగు ఇప్పటికే ఊపందుకోగా డ్రాగన్‌ ఫ్రూట్‌, దానిమ్మ, తైవాన్‌ జామ, అరటితో పాటు ఇతర రకాల పండ్ల సాగు విస్తరిస్తున్నది. 

జామ సాగులోలాభాల మజా

 • తైవాన్‌జామతో మేలైన ఆదాయం

కోదాడ రూరల్‌, జనవరి 1 : తైవాన్‌ జామ సాగుతో ఆదాయం బాగున్నదని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రెడ్లకుంటకు చెందిన రైతు సాధినేని అప్పారావు తెలిపారు. మూడేళ్ల కిందట ఆంధ్రప్రదేశ్‌లోని జంగారెడ్డిగూడెం నర్సరీ నుంచి మొక్కలు తెప్పించాడు. ఎకరానికి 12వందల మొక్కల చొప్పున ఐదెకరాల్లో తైవాన్‌ జామ మొక్కలు నాటాడు. ప్రభుత్వం 80శాతం సబ్సిడీపై అందించిన డ్రిప్‌ ద్వారా నీరందిస్తున్నాడు. తొలి కోత 10వ నెలకు చేతికి వస్తుందని, ఎకరానికి తొలి సంవత్సరం 2నుంచి మూడు టన్నుల దిగుబడి సాధించానని అప్పారావు తెలిపారు. పెట్టుబడి ఖర్చులు పోను ఏటా ఎకరానికి రూ.80వేలకు పైగా ఆదాయం ఉంటుందని వెల్లడించాడు. తైవాన్‌జామలోనే అంతర పంటగా ఒక ఎకరం విస్తీర్ణంలో సీతాఫలం సాగు చేస్తున్నాడు. 

దామరచర్ల: నాలుగు ఎకరాల్లో తైవాన్‌ జామ సాగుచేస్తున్నాను. మూడేండ్లుగా దిగుబడి ఆశాజనంగా ఉండి మంచి ఆదాయం వస్త్న్నుది. వ్యాపారులు నేరుగా తోట దగ్గరికే వచ్చి కొనుగోలు చేశారని బొత్తలపాలెం గ్రామ రైతు పడిగెపాటి వెంకటరెడ్డి తెలిపారు. 

నేరేడుచర్ల : మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్‌కు చెందిన గిరిజన మహిళా రైతు బాణోతు రాజేశ్వరి 1.2ఎకరాల్లో తైవాన్‌జామ సాగుచేస్తున్నది. మొదటి, రెండో సంవత్సరంలోనే పెట్టుబడి మొత్తం చేతికొచ్చిందని, ప్రతి సీజన్‌లో సుమారు లక్షన్నర లాభం వస్తున్నదని తెలిపింది. 

చండూరు : కస్తాల గ్రామానికి చెందిన బొమ్మరబోయిన సైదులు నాలుగు ఎకరాల్లో తైవాన్‌జామ సాగు చేస్తున్నాడు. ఒక్కో చెట్టు 50కిలోల దిగుబడి ఇస్తున్నది. వ్యాపారులే నేరుగా తోట వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నట్లు సైదులు తెలిపాడు. 

దేవరకొండ : దేవరకొండ మండలంలోని కొమ్మెపల్లి గ్రామానికి చెందిన చింతపల్లి వెంకటయ్య రెండేండ్లుగా రెండెకరాల్లో జామ సాగు చేస్తున్నాడు. వారంలో మూడు మార్లు కాయలు విక్రయిస్తున్నాడు. పెట్టుబడులు పోను అశించిన లాభం వస్తున్నదని తెలిపాడు. 

సీతాఫలం.. మెట్టకు అనుకూలం

 • నీటి లభ్యత తక్కువ ఉన్నా ఆదాయం నికరం  

మాడ్గులపల్లి, జనవరి 2 : శీతాకాలంలో అధికంగా వచ్చే ఉద్యాన పంట సీతాఫలం. అటవీజాతి మొక్కల్లో ఏపుగా ఎదిగే చెట్టు. మెట్ట ప్రాంతాల్లో నీటి సమస్య ఉన్న రైతులు సీతాఫలం సాగుతో మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మాడ్గులపల్లి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన గడ్డం ప్రభాకర్‌రెడ్డి ఆరేండ్ల కిందట సంగారెడ్డిలోని కొండాలక్ష్మణ్‌ బాపూజీ హార్టికల్చర్‌ యూనివర్సిటీ నుంచి బాలానగర్‌ రకం మొక్కలు 250 తెప్పించారు. ఎకరం భూమిలో నాటించి డ్రిప్‌ ద్వారా నీటిని అందించారు. నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పటికీ ఎలాంటి సమస్య లేకుండా మొక్కలు పెరిగాయి. మూడేండ్లలోనే దిగుబడి వచ్చింది. చీడపీడల సమస్య రాకుండా సస్యరక్షణ చర్యలు తీసుకున్నారు. ఏటా లక్ష రూపాయల ఆదాయం ఆర్జిస్తున్నాడు. మార్కెట్లో ధర ఎక్కువగా ఉండడంతో ఆదాయం బాగా ఉంటుందని ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

అరటి.. ఆమె

 • ఎకరాకు 60నుంచి 80వేల వరకు ఖర్చు
 • ఎకరాకు పెట్టుబడి పోను 1,50,000ఆదాయం వస్తుందని అంచానా 
 • ఎకరాకు 30నుంచి 35 టన్నులు వచ్చే అవకాశం

పెద్దవూర, జనవరి 2 : పెద్దవూర మండలం బట్టుగూడెంలో మహిళా రైతు గాలి వెంకటమ్మ అరటి సాగులో రాణిస్తున్నది. బోరు కింద ఏటా పత్తి, మిర్చి సాగు చేస్తుండగా ఈ ఏడాది ఉద్యానశాఖ అధికారి సలహా మేరకు 2.20గుంటల్లో హైదరాబాద్‌ నుంచి టిష్యూకల్చర్‌ మొక్కలను తెప్పించి నాటారు. ప్రస్తుతం 8నెలలు పూర్తికాగా అరటి తోట గెలలు వేసింది. ఎకరానికి పెట్టుబడి రూ.60-80వేలు కాగా, ఎకరానికి 30-35టన్నుల దిగుబడి అంచనా వేస్తున్నారు. ఖర్చులు పోను రూ.1.50లక్షల ఆదాయం రావచ్చని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన పంటలను ప్రోత్సహిస్తున్నదని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉద్యానశాఖ అధికారి మురళి తెలిపారు. హెక్టారుకు రెండు పంటలకు రూ.31వేలు మంజూరు చేస్తున్నదని వెల్లడించారు.

ఆపిల్‌ బేర్‌ ఆశాజనకం.. 

తిప్పర్తి : ఆపిల్‌బేర్‌ సాగు ఆశాజనకంగా ఉన్నదని తిప్పర్తి మండలం చిన్నాయిగూడెం గ్రామానికి చెందిన యరమాద ప్రవీణ్‌రెడ్డి చెప్పారు. ఇతను మూడు ఎకరాల్లో ఆపిల్‌ బేర్‌ సాగు చేస్తున్నాడు. తక్కువ సమయంలో పంట దిగుబడి రావడంతో పాటు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుండడంతో మూడేళ్ల కిందట సాగుచేపట్టాడు. జడ్చర్ల నుంచి ఒక్కో మొక్కను రూ.35కు తెప్పించి నాటించాడు. ‘ఎకరం భూమిలో యాపిల్‌ బేర్‌ సాగుకు రూ.40నుంచి 50వేల పెట్టుబడి అవుతుంది. పంటకు చీడ పీడల బెడద అంతగా ఉండదు. పది నుంచి 11నెలల్లోపు కాతకొచ్చింది. ప్రస్తుతం హోల్‌సేల్‌ ధర కిలో రూ.18-20వరకు పలుకుతున్నది. ఎకరానికి ఖర్చులు మినహా రూ.80వేల ఆదాయం చేతికందుతున్నది’ అని ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. గతంలో తాను మార్కెట్‌కు వెళ్లి అమ్ముకునే వాడినని, కానీ, ఇప్పుడు తోట దగ్గరకే వచ్చి వ్యాపారులు తీసుకెళ్తున్నట్లు చెప్పాడు. హార్టికల్చర్‌ శాఖ మూడేండ్ల పాటు సంవత్సరానికి పదివేల రూపాయలు మెయింటెనెన్స్‌ ఖర్చులు చెల్లిస్తున్నదని తెలిపారు.

కినో.. లాభాలెన్నో..!

 • పెట్టుబడికి మూడింతలు ఆదాయం 

పెన్‌పహాడ్‌ : బత్తాయి సైజులో కమలాను పోలి ఉండే ‘కినో ఆరెంజ్‌' పంటను మండలంలోని అనాజీపురంలో సాగు చేస్తున్నారు రైతు కత్తి ఆనందరెడ్డి. కినో ఆరెంజ్‌ సాగుకు ఎర్ర నేలలు, దుబ్బ చెలకలు అనువు. మే నెలలో గుంతలు తీసి జూన్‌, జులైలో మొక్కలు నాటించాలి. సుమారు 20-30 అడుగుల వ్యవధిలో మొక్కలు నాటాలి. తద్వారా ప్రతి మొక్కను సంరక్షించుకునే వీలుంటుంది. నాటిన ఆరేండ్లలోపే కాపు కాస్తుంది. పూత, వాసన, పండ్లు బత్తాయి, కమలా పండ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటాయి.

పెట్టుబడి తక్కువ.. లాభం ఎక్కువ... 

కినో ఆరెంజ్‌ సాగుతో తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభాలు సాధించవచ్చని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. బత్తాయి దిగుబడి కంటే 35శాతం అదనంగా వస్తుంది. సబ్సిడీ డ్రిప్‌తో పాటు హెక్టారుకు (రెండున్నర ఎకరాలు) రూ.16వేలు యాజమాన్య చర్యలు నిమిత్తం ఆర్థిక సాయం అందుతుంది. ఎకరం విస్తీర్ణంలో రూ.40వేల పెట్టుబడి అవుతుండగా సుమారు రూ.లక్షన్నరకు పైగా ఆదాయం ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. ‘ఆరేండ్ల కిందట ఐదున్నర ఎకరాల్లో బత్తాయి, నాలుగు ఎకరాల్లో కినోఆరెంజ్‌ సాగు మొదలుపెట్టిన.. ప్రభుత్వం మూడేండ్ల పాటు పెట్టుబడి సాయం, డ్రిప్‌ సౌకర్యం కల్పించింది. బత్తాయి కంటే ఫలసాయం, ఆదాయం ఎక్కువగా ఉంటున్నది.

- కత్తి ఆనంద్‌రెడ్డి, రైతు, అనాజీపురం, పెన్‌పహాడ్‌  

ఆదాయాన్నిచ్చే డ్రాగన్ ఫ్రూట్

 • పాతికేండ్ల పంట
 • ఏటా అదనపు దిగుబడి

మునగాల : మండల పరిధిలోని ఎస్‌ఎంపేట సమీపంలో డ్రాగన్‌ ఫ్రూట్‌ తోట రైతాంగాన్ని విశేషంగా ఆకర్షిస్తున్నది. సూర్యాపేటకు చెందిన ఆనంద పద్మావతి 2017లో ఇక్కడ ‘డ్రాగన్‌ ఫామ్‌' పేరుతో మొక్కలు నాటించారు. రెండున్నర ఎకరాల్లో మొక్కలకు, స్తంభాలకు సుమారు రూ.6లక్షలు ఖర్చయ్యింది. ప్రభుత్వం రూ.3లక్షల 60వేలు సబ్సిడీ అందజేసింది. డ్రిప్‌ ఏర్పాటుకు 60శాతం సబ్సిడీ వర్తించింది. రెండో ఏడాది నుంచి పండ్లను మార్కెట్‌కు తరలించారు. ఎకరానికి టన్నున్నర దిగుబడి రాగా రెండు లక్షల ఆదాయం వచ్చింది. మూడో ఏడాదిలో ఎకరానికి మూడు టన్నుల దిగుబడి వస్తున్నదని తెలిపారు. 25ఏండ్ల కాల పరిమితి కల్గిన డ్రాగన్‌ ఫ్రూట్‌ ద్వారా ఏటా దిగుబడి, ఆదాయం పెరుగుతుందని తెలిపారు. 

మాడ్గులపల్లి : మండలంలోని ఆగామోత్కూర్‌ గ్రామంలో మహ్మద్‌ మోసీన్‌ అలీ డ్రాగన్‌ ప్రూట్‌ సాగు చేస్తున్నాడు. పది నెలల కిందట అమెరికన్‌ బ్యూటీ రకం మొక్కలను నాటించారు. రెండెకరాల్లో 960స్తంభాలకు 3840మొక్కలు నాటించారు. ఎకరానికి స్తంభాలు, పైన రింగులు, మొక్కలు, డ్రిప్‌ ఇతరత్రా మొత్తం నాలుగు లక్షలు ఖర్చయినట్లు తెలిపాడు. అంతర పంటగా వేరుశనగ, పుచ్చ సాగు చేసుకుంటే మంచిదని సూచిస్తున్నాడు. 

పెద్దఅడిశర్లపల్లి : అంగడిపేట సమీపంలో రిటైర్డ్‌ ఉద్యోగి తేరా భాస్కర్‌రెడ్డి పండ్ల తోటలు సాగు చేస్తున్నాడు. పంచాయతీరాజ్‌ శాఖలో డీఈగా రిటైర్మెంట్‌ తీసుకున్న వెంటనే వ్యవసాయానికి సిద్ధమయ్యాడు. మూడెకరాల్లో డ్రాగన్‌ ఫ్రూట్‌, మరో మూడు ఎకరాల్లో తైవాన్‌జామ, రెండెకరాల్లో సీతాఫలం సాగు చేస్తున్నాడు.  

ప్రభుత్వ ప్రోత్సాహం...

ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక పథకాలను తీసుకువచ్చింది. తోటల సాగుకు అవసరమైన గుంతలు తీయడం నుంచి మొదలుపెడితే మొక్కల సరఫరా, పెట్టుబడిలో రాయితీ, ఎరువుల సరఫరా లాంటి వాటిలో అండగా నిలుస్తుంది. అరటి, బొప్పాయి, బత్తాయి, కూరగాయల సాగుకు 40శాతం పెట్టుబడి రాయితీని కల్పించింది. రెండు, మూడో ఏడాదీ రాయితీని వర్తింపజేస్తున్నది. తోటల మధ్యలో నీటి కుంటల తవ్వకాలకు, మల్చింగ్‌ సౌకర్యానికి కూడా 50శాతం రాయితీని అందజేస్తున్నది. ఇక వీటిల్లో ఉపయోగించే సాగు యంత్రాలకు కూడా 50శాతం సబ్సిడీని ప్రకటించింది. యేటా ప్రోత్సాహకాలు కొనసాగిస్తున్నది. 

VIDEOS

logo