ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Nalgonda - Jan 02, 2021 , 00:48:26

తొలి త్రైమాసికం.. ఎన్నికల కోలాహలం!

తొలి త్రైమాసికం.. ఎన్నికల కోలాహలం!

  • వరుస ఎన్నికలతో సందడే సందడి
  • మొదలైన పట్టభద్రుల ఎన్నికల వేడి
  • ఆపై నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక కూడా..
  • నకిరేకల్‌ మున్సిపాలిటీకి త్వరలోనే..
  • అన్ని పక్షాలు ఆ వైపే దృష్టి
  • సంక్రాంతి తర్వాత పార్టీల కార్యాచరణపై స్పష్టత

గతేడాది ఆరంభంలో మున్సిపల్‌ ఎన్నికలతో జిల్లాలో రాజకీయంగా సందడి నెలకొనగా ఈ సంవత్సరం తొలి త్రైమాసికం అంతా ఎన్నికల హడావుడే కనిపించనుంది. వరుసగా శాసనమండలి పట్టభద్రుల ఎన్నికలు, ఆ తర్వాత నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక, వీటి మధ్యలోనే నకిరేకల్‌ మున్సిపల్‌ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. పట్టభద్రుల ఎన్నికల విషయంలో ఇప్పటికే అన్ని రాజకీయపక్షాలు కార్యాచరణ ప్రారంభించాయి. సాగర్‌ ఉప ఎన్నికపైనా ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. ఎన్నికల నోటిఫికేషన్లు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలన్న ధోరణితో ఆయా పార్టీల నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇక ఇటీవలే గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారిన నకిరేకల్‌లోనూ ఎన్నికల సందడికి తెరలేవనుంది. మార్చి చివరి నాటికి ఈ మూడు ఎన్నికలు పూర్తవుతాయన్న అంచనాలో ఆయా పార్టీల నేతలు ఉన్నారు.

- నల్లగొండ, జనవరి1  తెలంగాణ, ప్రతినిధి)

నల్లగొండ, జనవరి1(నమస్తే తెలంగాణ ప్రతినిధి):రాజకీయంగా రాష్ట్రంలోనే ప్రత్యేక పరిస్థితులు ఉన్న జిల్లాగా ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రసిద్ధి. టీఆర్‌ఎస్‌తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీకి కూడా బలమైన నేతలంతా ఇక్కడ ఉండడంతో సహజంగానే అందరికీ ఇక్కడి రాజకీయాలపై ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ఈ నేపథ్యంలో రానున్న మూడు నెలల కాలంలో కీలకమైన ఎన్నికలకు నల్లగొండ జిల్లా వేదికగా మారనుంది. అందులో శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలు కూడా ఒకటి. నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం పూర్వ జిల్లాలతో కూడిన ఈ పట్టభద్రుల నియోజకవర్గ కేంద్రంగా నల్లగొండ ఉంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పదవీ కాలం ఈ ఏడాది మార్చి 29వ తేదీతో ముగియనుంది. ఆ లోగానే ఇక్కడి ఎన్నిక పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కార్యాచరణ ప్రకటించింది. ఓటర్ల నమోదుతో తుది జాబితా వెల్లడి కోసం నోటిఫికేషన్‌ వెలువరించింది. గతేడాది అక్టోబర్‌ ఒకటి నుంచి ఓటరు దరఖాస్తులను నవంబర్‌ ఆరో తేదీ వరకు స్వీకరించారు. తర్వాత దరఖాస్తుల పరిశీలన నవంబర్‌ చివరి వరకు కొనసాగింది. డిసెంబర్‌ ఒకటి నుంచి ఓటర్ల నమోదుపై అభ్యంతరాల స్వీకరణతో పాటు నూతనంగా దరఖాస్తులకు అవకాశం కల్పించారు. శుక్రవారం నుంచి ఈ నెల 12 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఫైనల్‌గా ఓటర్ల తుదిజాబితాను ఈ నెల 18వ తేదీన ప్రకటించేందుకు ఎన్నికల అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఆ తర్వాత కొంత గడువుతో ఫిబ్రవరి చివరి వారంలోపు నోటిఫికేషన్‌ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పట్టభద్రుల ఓటర్ల నమోదు నుంచి ఆయా పార్టీల్లో కదలిక మొదలైంది. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు క్షేత్ర స్థాయి వరకు ఓటరు నమోదులో క్రియాశీలకంగా కదిలి పనిచేశారు. దీంతో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు టీఆర్‌ఎస్‌ సిద్ధ్దంగా ఉంది. ఇప్పటికే జిల్లాలో మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో ప్రస్తుత ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలంతా మండలి ఎన్నికల దృష్టి కోణంలో కార్యచరణ కొనసాగిస్తున్నారు. అభ్యర్థ్ధి ఎవరైనా వరుసగా నాలుగో సారి ఈ స్థానం నుంచి విజయకేతనం ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇక ఇక్కడ నుంచి కాంగ్రెస్‌, బీజేపీ, వామ పక్షాలతో పాటు పలు ప్రజాసంఘాలు కూడా బరిలో దిగేందుకు ఉత్సుకత చూపుతున్నాయి. అయితే  ఈ సారి భారీగా ఓటర్ల నమోదుతో పాటు అం దరూ కూడా ప్రత్యేక దృష్టి సారిస్తుండడంతో ఎన్నికలు ఆసక్తికరంగా సాగే అవకాశాలు ఉన్నాయి.

సాగర్‌ ఉప ఎన్నికపై కసరత్తు...

 నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. డిసెంబర్‌ 1న నర్సింహయ్య మరణించగా నిబంధనల ప్రకారం ఆరు నెలల లోపు ఎన్నికల ప్రక్రియను  ముగించాల్సి ఉంటుంది. అయితే ఈ ఉప ఎన్నికకు మే చివరి నాటికి గడువు ఉన్నా ఈ లోపే పూర్తి కావచ్చన్న అంచనా ఉంది. మార్చి 16వ తేదీ లోపు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక జరపాల్సి ఉందని సమాచారం. దీంతో తిరుపతి ఉప ఎన్నికతో పాటే నాగార్జునసాగర్‌కు కూడా ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడవచ్చన్న చర్చ కొనసాగుతున్నది. ఇదే నిజమైతే సంక్రాంతి అనంతరం ఇక్కడ రాజకీయం వేడెక్కనుంది. మార్చిలో ఎన్నికలు అంటే ఫిబ్రవరి చివరి వారాల్ల్లో ఎన్నికల నోటిఫికేషన్‌కు అవకాశం ఉంటుంది. ఇప్పటికే తమ సిట్టింగ్‌ స్థానంలో మరోసారి విజయం కోసం టీఆర్‌ఎస్‌ దృష్టి సారించింది. మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గంలో కార్యకలాపాలను మరింత ముందుకు తీసుకుపోతున్నారు. పార్టీ ప్రకటించిన అభ్యర్థ్ధి గెలుపే లక్ష్యంగా పనిచేసే దిశగా పార్టీ క్యాడర్‌ను కూడా సన్నద్ధం చేసేలా చర్యలు చేపట్టారు. ఇక ఇక్కడ గత ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కుందూరు జానారెడ్డి మరోసారి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. నియోజకవర్గంలోని పార్టీ క్యాడర్‌తో ఉన్న గ్యాప్‌ను పూడ్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాను పోటీకి సిద్ధ్దమేనన్న సంకేతాలతో క్యాడర్‌ను కలుస్తున్నారని నియోజకవర్గంలో చర్చ ఉంది. గత ఎన్నికల్లో కేవలం 2678 ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచిన బీజేపీ కూడా మరోసారి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నది. అయితే పార్టీ టికెట్‌ విషయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి, మరో నేత కడారి అంజయ్యయాదవ్‌  పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా పార్టీలోని ముఖ్యనేతలు సైతం ఇరువర్గాలుగా చీలిపోయి చెరోవైపు మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో ఆదిలోనే ఆ పార్టీ క్యాడర్‌లో అయోమయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలన్న యోచనలో అన్ని పార్టీలు ఉన్నాయి. 

నకిరేకల్‌ మున్సిపల్‌ ఎన్నికలు.. 

గ్రామ పంచాయతీగా ఉన్న నకిరేకల్‌ పట్టణం పక్షం రోజుల కిందటే మున్సిపాలిటీగా ఏర్పడింది. దీంతో ఇక్కడ కూడా మున్సిపల్‌ ఎన్నికలకు ఆస్కారం నెలకొంది. త్వరలోనే వరంగల్‌, ఖమ్మం మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో వీటితో పాటే నకిరేకల్‌ మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించవచ్చని భావిస్తున్నారు. అయితే ఈ లోపు ఇక్కడ విలీన గ్రామాలతో పాటు నకిరేకల్‌ పట్టణాన్ని కలుపుకుని వార్డుల పునర్విభజన చేపట్టనున్నారు. వార్డుల పునర్విభజన పూర్తి చేసి ఓటర్ల జాబితాను వెల్లడించాక ఎన్నికల ప్రక్రియ మొదలుకానుందని సమాచారం. అయితే ఇక్కడ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధమవుతున్నది. కాంగ్రెస్‌, ఇతర రాజకీయ పక్షాలు కూడా ఇక్కడ బరిలోకి దిగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరుగనున్న ఏకైక మున్సిపాలిటీ నకిరేకల్‌ కానుండడంతో దీనిపైనా అందరి దృష్టి ఉండనుంది. ఇలా వరుస ఎన్నికలతో ఈ ఏడాది తొలి మూడు నెలలు రాజకీయంగా ఆసక్తికర పరిణామాలకు వేదిక కానుందనడంలో సందేహం లేదు. 


VIDEOS

logo