సోమవారం 01 మార్చి 2021
Nalgonda - Jan 02, 2021 , 00:37:24

భళా బాల రామాయాణం

భళా బాల రామాయాణం

  • ఆంగ్లంలో రామాయణాన్ని రాసిన బాలుడు
  • సందర్భోచిత చిత్రాలు గీసిన బాలిక
  • ‘అద్విక్‌ రామాయణం’ పుస్తకం ఆవిష్కరణ
  • కార్టూన్‌ ఛానెల్‌లో రామాయణం 

చూసిన ఆ బాలుడు.. తన సందేహాలను తల్లిదండ్రుల ద్వారా తీర్చుకున్నాడు. అంతటితో ఆగకుండా రామాయణం రాయాలన్న సంకల్పంతో అనతికాలంలోనే ఆ ప్రయత్నాన్ని విజయవంతంగా పూర్తిచేశాడు. ఈ విషయం తెలిసిన ఓ బాలిక   సందర్భోచితంగా బొమ్మలు గీసి ప్రాణం పోసింది. వెరసి 71 పేజీలు, 17 బొమ్మలతో ‘అద్విక్‌ రామాయణం’ పుస్తకం ఆవిష్కృతమైంది. నల్లగొండ జిల్లా చిట్యాల వేదికగా విమర్శకుల మెప్పు పొందింది.

- చిట్యాల, జనవరి 1

లాక్‌డౌన్‌ సమయంలో పిల్లలు సమయం దొరికితే చాలు.. సెల్‌ఫోన్లతో గడుపుతున్నారు. తల్లిదండ్రులు ఎంత వారించినా మార్పు రావడం లేదు. ఆన్‌లైన్‌ క్లాసుల కారణంగా మరింతగా సెల్‌ఫోన్లకు అతుక్కుపోతున్న ఈ తరుణంలో ఆ చిన్నారులు మాత్రం అందుకు భిన్నంగా పుస్తక రచనకు శ్రీకారం చుట్టారు. విదేశాల్లో ఉన్నా, పాశ్చాత్య సంస్కృతికి భిన్నంగా రామాయణాన్ని రాశాడు... అద్విక్‌. చిట్యాల మండలం నేరడ గ్రామానికి చెందిన రాపోలు సీతారామరాజు ఉద్యోగ రీత్యా సౌతాఫ్రికాలోని జోహన్స్‌బర్గ్‌లో నివసిస్తున్నాడు. సాహితీప్రియుడైన రామరాజు కవితలు, పుస్తకాలు రాస్తుండటాన్ని గమనించిన అతడి కుమారుడు తనకు కూడా ఏదైనా రాయాలని ఉన్నదనే కాంక్షను వెలిబుచ్చాడు. నాలుగో తరగతి చదువుతున్న కుమారుడి ఆసక్తిని గమనించి రామాయణం రాయమని సూచించాడు. అప్పటికే కార్టూన్‌ ఛానెల్‌లో రామాయణం చూసిన అద్విక్‌ రాయడం ప్రారంభించాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇండియాకు వచ్చిన సీతారామరాజు.. తన కుమారుడు రాసిన రామాయణం తాలూకూ వివరాలను వాట్సాప్‌లో మిత్రులతో షేర్‌ చేసుకున్నాడు. మిర్యాలగూడకు చెందిన కవయిత్రి ఉప్పల పద్మ తన కూతురు హరినందనతో బొమ్మలు గీయిస్తానని తెలియజేశారు. రామరాజు స్క్రిప్ట్‌ను పింపించడంతో కథకు అనుగుణంగా పద్మ కూతురు 9వ తరగతి చదువుతున్న చిలుకూరి హరినందన అందమైన బొమ్మలు గీసింది. అనంతరం హరినందన బొమ్మలు, అద్విక్‌ కథనంతో అందమైన పుస్తకం రూపొందింది. 

ఆవిష్కరణ అద్భుతమే... 

నాలుగో తరగతి చదివే విద్యార్థి రామాయణం రాయడమే ఓ విశేషం కాగా.. అందమైన బొమ్మలు వేసిన హరినందన మరింత ఆశ్చర్యానికి గురిచేసింది.. ఇక ఈ పుస్తకాన్ని చిన్నారులతోనే సమీక్షించి ఆవిష్కరించడం గమనార్హం. సభాధ్యక్షుడు మొదలు వక్తలు కూడా చిన్నారులే కావడం విశేషం. ఈ నెల 27న చిట్యాలలో ఈ సభ నిర్వహించగా.. అధ్యక్షత వహించిన 10వ తరగతి విద్యార్థిని మెండె సహస్ర ప్రసంగం సభికులను ఆకర్షించింది. 

మా నాన్నే స్ఫూర్తి.. : అద్విక్‌

ఎప్పుడూ ఏదో ఒకటి రాస్తుండే మా నాన్నను చూసి నాకు కూడా ఏదైనా రాయాలనిపించింది. ఆ విషయం చెప్పగానే రామాయణం రాయమని ప్రోత్సహించి అది రాస్తే నా పేరు మీద పుస్తకం అచ్చువేయిస్తానని చెప్పాడు. నాన్న ప్రోత్సాహంతోనే రాయడం పూర్తి చేశాను. పుస్తకం మీద నా పేరు చూశాక చాలా గొప్పగా ఫీలయ్యాను. 

కళలపై ఆసక్తి.. : అరినందన

మా ఇంట్లో సాహితీ వాతావరణం ఉండటం వల్లనే నేను చిన్నప్పటి నుంచి కళలకు ఆకర్షితురాలినయ్యాను. 3వ తరగతి నుంచే బొమ్మలు గీయటం అలవాటు. అమ్మ ప్రోత్సాహంతో మరింత ఆసక్తి పెరిగింది. ఎప్పుడూ ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచన ఉంటుంది. ఉన్నత విలువలు కల్గిన రామాయణానికి బొమ్మలు గీసే అవకాశం రావడం చాలా గొప్పగా ఫీలవుతున్నాను. 

సృజనాత్మకతను వెలికి తీయాలి.. 

తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల్లో సృజతనాత్మకతను వెలికి తీయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 250పుస్తకాలను చిన్నారులు రాశారు. పిల్లలను ప్రోత్సహించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి. అందువల్లనే ఆవిష్కరణ సభను చిన్నారులతో ఏర్పాటు చేశాం. 

- సాగర్ల సత్తయ్య, కవి, ఉపాధ్యాయుడు 


VIDEOS

logo