శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Nalgonda - Dec 31, 2020 , 00:04:16

చిరస్మరణీయులు

చిరస్మరణీయులు

 • ఉమ్మడి జిల్లాపై పంజా విసిరిన కొవిడ్‌ 
 • నల్లగొండ జిల్లాలో 74, సూర్యాపేట జిల్లాలో 33మంది మృతి
 • వైరస్‌ భయంతో అంత్యక్రియలకు ముందుకురాని జనం
 • పట్టణాలను వదిలి పల్లెలకు పెరిగిన వలసలు 
 • అభాగ్యులకు ఆసరాగా నిలిచిన మానవతావాదులు
 • ప్రతి ఒక్కరికీ చేదు జ్ఞాపకాలనుమిగిల్చిన 2020
 • ఏడాదంతా కరోనాతో సతమతం
 • వైరస్‌ బారిన పడి పలువురు మృతి
 • ఉపాధిని దెబ్బతీసిన మహమ్మారి
 • కరోనా మృతుల చివరి చూపునోచుకోని కుటుంబాలు
 • వైద్య, పారిశుధ్య సిబ్బందితోనే ముగిసిన అంత్యక్రియలు
 • 2020 కరోనా నామ సంవత్సరంగా మిగిలిపోయింది. ఏడాదంతా వైరస్‌ ప్రభావంతో జనం 
 • అవస్థలు పడ్డారు. పనులన్నీ ఎక్కడికక్కడే 

ఆగిపోవడంతో ఎంతో మంది జీవనోపాధి కోల్పోయారు. మాస్కులు, శానిటైజర్లు వాడుతూ కాలం వెళ్లదీశారు.  వైరస్‌బారిన పడిన వారు నల్లగొండ జిల్లాలో 20,400 మంది, సూర్యాపేట జిల్లాలో 28,819 మంది ఉన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారు చాలా మంది కోలుకోగా.. కొంత మంది 

అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో ప్రాణాలు వదిలారు. నల్లగొండ జిల్లాలో 74, సూర్యాపేట జిల్లాలో 33 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారంతా అందరి మదిలో నిలిచిపోనున్నారు. కొవిడ్‌ నిబంధనల కారణంగా కడచూపునకు నోచుకోలేదన్న బాధ వారి కుటుంబాలు, శ్రేయోభిలాషుల్లో ఉన్నది. ఇది ఒక చేదు జ్ఞాపకమైనా కరోనా పాజిటివ్‌ మృతులంతా చిరస్మరణీయులుగా నిలిచిపోతారు. 

నీలగిరి, సూర్యాపేట టౌన్‌ : కరోనా మహమ్మారి బారిన పడి మృతి చెందిన వారు చరిత్రలో చిరస్మరణీయులుగా మిగిలిపోతున్నారు. కడచూపునకు నోచక.. అంతిమయాత్రకు ఎవ్వరూ ముందుకు రాక.. అందరూ ఉన్నా ఒంటరిగా వెళ్లిపోయారు. కరోనా చావులు బాధల కన్నా భయాలను మిగిల్చాయి. గతంలో ఎవరైనా మరణిస్తే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు.. సమాచారం అందుకున్న ప్రతి ఒక్కరూ వచ్చి కడసారి చూసుకునేవారు. చిన్న కర్మ, పెద్ద కర్మ, ఇష్టబంతి, నెల మాసికం, సంతాపసభలు నిర్వహించేవారు. కానీ, కరోనా అతి తక్కువ సమయంలో వాటన్నింటినీ మరిపించింది. కరోనా మృతుల కడసారి చూపుకే కాదు.. దహన సంస్కారాల్లోనూ ఎవరూ పాల్గొనకుండా చేసింది. మృతదేహాలను దవాఖానాల్లోనే వదిలేయడంతో పారిశుధ్య సిబ్బందే అత్యక్రియలు నిర్వహించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

నల్లగొండలో ఏప్రిల్‌ 1న తొలికేసు.. 

నల్లగొండ జిల్లాలో ఏప్రిల్‌1న, సూర్యాపేట మున్సిపాలిటీలోని కుడకుడలో ఏప్రిల్‌ 2న తొలి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఉమ్మడిజిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో కరోనా బాధిత ప్రాంతాలను రెడ్‌జోన్లుగా ప్రకటించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు వారికి కావాల్సిన నిత్యావసరాలను సమకూర్చారు. మే 5న తొలి కరోనా మృతి నమోదుకాగా జిల్లాలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 107కు చేరింది. కరోనా మృతుల్లో వృద్ధులు, అనారోగ్యం బారిన పడిన వారే అధికం. 

అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం...

పాజిటివ్‌ కేసులు నమోదైన వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఆయా ప్రాంతాలను రెడ్‌జోన్లుగా, కంటైన్‌మెంట్లుగా ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో ప్రజలు బయటకు రాకుండా ఎక్కడికక్కడ కంచెలను ఏర్పాటు చేసింది. ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలను ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి బాధిత ప్రాంతాలకు వైద్య సహాయం అందించింది. ప్రత్యేకంగా ‘మీ కోసం’ యాప్‌తో నిత్యావసరాల సమస్య రాకుండా చూసింది. ఏప్రిల్‌ 7నుంచి కేసులు నమోదు కాకపోవడంతో ఏప్రిల్‌ 14న లాక్‌డౌన్‌ మొదటి దశ ముగింపు సందర్భంగా రెడ్‌జోన్‌లో ఉన్న నల్లగొండను ఆరెంజ్‌ జోన్‌లోకి మార్చింది. కరోనా బాధితుల కోసం మహాత్మగాంధీ యూనివర్సిటీలో క్వారంటైన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా జనరల్‌ దవాఖానతోపాటు మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌, దేవరకొండ ఏరియా దవాఖాన, నకిరేకల్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో కరోనా ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. 

నల్లగొండ జిల్లాలో... 

వలస కూలీలు 6,343మంది ఉండగా అందులో మొదట తొమ్మిది మందికి పాజిటివ్‌ వచ్చింది. వారి నుంచి ఇతరులకు విస్తరించింది. 

మార్చిలో 12మంది వియత్నాం దేశీయులు జిల్లాకు వచ్చారు. వారిని హైదరాబాద్‌కు తరలించి పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ వచ్చింది. 

ఏప్రిల్‌లో కరోనా వ్యాప్తికి ప్రధాన కారణమైన ఢిల్లీలోని మర్కజ్‌కు జిల్లా నుంచి 52మంది వెళ్లారు. అందులో 45మందికి కరోనా నెగెటివ్‌ రాగా ఏడుగురికి పాజిటివ్‌ వచ్చింది. ఆ తర్వాత వారి కుటుంబ సభ్యుల్లో ఐదుగురికి పాజిటివ్‌ వచ్చింది. వీరంతా పలు మసీదుల్లో తిరగడంతో జిల్లా యంత్రాంగం 32ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. 

ఏప్రిల్‌లో జిల్లాలో మత ప్రచారం కోసం ఇతర ప్రాంతాల నుంచి 17మంది రాగా వారిలో 15మంది బర్మా దేశస్తులున్నారు. మరో ఇద్దరు జమ్మూకశ్మీర్‌కు చెందిన వారిగా గుర్తించారు. పరీక్షల అనంతరం క్వారంటైన్‌కు తరలించారు.

VIDEOS

logo