సోమవారం 01 మార్చి 2021
Nalgonda - Dec 31, 2020 , 00:08:29

మచ్చ తెస్తున్నారు!

మచ్చ తెస్తున్నారు!

  • ‘మహాత్మ’లో ఆగని లైంగిక వేధింపులు 
  • ఆలస్యంగా వెలుగులోకి మరో కీచక అధ్యాపకుడి బాగోతం
  • ఎంజీయూలో ప్రత్యేక కమిటీలవిచారణ
  • నివేదిక అనంతరం విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ
  • ఎంజీయూలో ఆగని లైంగిక వేధింపులు 
  • వెలుగులోకి మరో కీచక అధ్యాపకుడి బాగోతం
  • యూనివర్సిటీలో ప్రత్యేక కమిటీల విచారణ
  • నివేదిక అనంతరం విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు

విద్యాబుద్ధులు చెప్పి సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన అధ్యాపకులు సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్న సంఘటనలు నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో పునరావృతం అవుతున్నాయి. దీంతో జాతిపిత పేరుకు మచ్చతెస్తున్నారు. గతంలో ఇద్దరు అధ్యాపకులు కళాశాల విద్యార్థినులను వేధింపులకు గురిచేయడంతో వారిపై వేటు పడగా ...తాజాగా అదే తరహాలో ఓ అధ్యాపకుడు మహిళా ఉద్యోగులను వేధించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎంజీయూ ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ ఫిర్యాదుతో ఉన్నతాధికారులు ప్రత్యేక కమిటీతో విచారించడంతో సదరు అధ్యాపకుడు(కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌) పై అధికారులు వేటు వేశారు. యూనివర్సిటీ విధుల నుంచి తొలగిస్త్తూ ఉత్తర్వులు జారీచేశారు.

-నల్లగొండ విద్యావిభాగం 

నల్లగొండ విద్యావిభాగం : మహాత్మాగాంధీ యూనివర్సిటీలో లైంగిక వేధింపులు ఆగడం లేదు. ఇదే సంవత్సరం మార్చి, జూలై మాసాల్లో వేధింపులకు సంబంధించి ఇద్దరిని తొలగించారు. ఆ సంఘటనలు మరువక ముందే తాజాగా మరో అధ్యాపకుడి వేధింపుల బాగోతం బయటకు వచ్చింది. అంతేకాకుండా యూనివర్సిటీలోని పలు విభాగాల్లో రెగ్యులర్‌ అధ్యాపకులు సైతం మహిళా ఉద్యోగులు, విద్యార్థినుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఇంజినీరింగ్‌ కళాశాలలోనే ...

యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో ఈ ఏడాది మార్చిలో కళాశాల కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(అకాడమిక్‌ కన్సల్టెంట్‌)వైస్‌ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన పునీత్‌ బీటెక్‌  విద్యార్థిని వేధింపులకు గురి చేశాడు. దీనిపై కమిటీ వేయగా వాస్తవాలు రుజువు కావడంతో అతణ్ని విధుల నుంచి తొలగించారు. తిరిగి మళ్లీ ఇదే కళాశాలలో డిపార్టుమెంట్‌ ఆఫ్‌ మేథమెటిక్స్‌లో పనిచేసే డా.అనంతుల శ్రీనివాస్‌ మహిళా ఉద్యోగులపై వేధింపులకు పాల్పడగా వారు యూనివర్సిటీ ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌, ఇన్‌చార్జి వీసీ  అరవింద్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రత్యేక కమిటీతో విచారణ అనంతరం అతణ్ని విధుల నుంచి తొలగిస్తూ రిజిస్ట్రార్‌ ప్రొ.యాదగిరి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఇదే కళాశాలలో మెకానికల్‌ విభాగంలో అధ్యాపకుడిగా పనిచేసే ఓ అధ్యాపకుడు సైతం పలువురిపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణల నేపథ్యంలో మందలిస్తూ అతడి నుంచి అండర్‌టేకింగ్‌ తీసుకున్నట్లు సమాచారం. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక తెలుగు విభాగంలో అధ్యాపకుడిగా పనిచేసిన నర్రా ప్రవీణ్‌రెడ్డి ఓ విద్యార్థినిని వేధించడంతో విధుల నుంచి తొలగించారు.  

మరికొన్ని సంఘటనలు...

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీలో పనిచేసే ఇద్దరు రెగ్యులర్‌ అధ్యాపకులు(అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌) లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని గతంలో ఆందోళనలు జరిగాయి. ఇదే విభాగంలో పీహెచ్‌డీ విద్యార్థిని ఫిర్యాదు చేసినా పట్టించుకోనట్లు తెలిసింది. ఆ విద్యార్థినినే తప్పు పడుతూ అడ్మిషన్‌ రద్దు చేసి అధికారులు పంపినట్లు సమాచారం.

పరీక్షల విభాగంలో పనిచేసే ఓ అధికారి సైతం అక్కడ పనిచేసే కొందరు మహిళా ఉద్యోగులపై దురుసుగా ప్రవరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఓ ఉద్యోగిని విషయం బయటకు చెప్పుకోలేక ఉద్యోగం వదిలి వెళ్లినట్లు సమాచారం. 

ఇంజినీరింగ్‌ కళాశాలలో మహిళా ఉద్యోగినులపై లైంగిక వేధింపుల ఆరోపణలపై ఉన్నతాధికారులు కమిటీ వేశారు. ఎంజీయూ ఉమెన్స్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ నివేదిక, ఇన్‌చార్జి వీసీ ఆదేశాలతో అధ్యాపకుడు డా.ఎ.శ్రీనివాస్‌ను తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేశాం. నిజ నిర్ధారణ కమిటీల నివేదికలతోనే చర్యలు తీసుకున్నాం. విద్యార్థ్ధినులు, మహిళా ఉద్యోగులకు పూర్తి రక్షణ ఉండేలా వ్యహరిస్తున్నాం. 

-ప్రొ.ఎం.యాదగిరి, రిజిస్ట్రార్‌, ఎంజీయూ  


VIDEOS

logo