ఇరిగేషన్ శాఖలన్నీ ఒకే గొడుగు కిందికి..

- మేజర్, మైనర్ ఇరిగేషన్ శాఖలను జలవనరులశాఖగా నామకరణం
- జీఓ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- జలవనరుల శాఖగా మార్చేందుకు జీఓ విడుదల
- కొత్తగా సీఈ, ఎస్ఈ తదితర పోస్టులకు అవకాశం
- ఎక్కడికక్కడ రైతుల ఇబ్బందులు తీర్చేందుకు ఏర్పాటు
వ్యవసాయ రంగానికి సాగు నీటిని అందించే శాఖలన్నీ ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలోని మేజర్, మైనర్ శాఖలను పునర్వ్యవస్థీకరించి జలవనరుల శాఖగా నామకరణం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనికి సంబంధించి ఈ నెల 28న జీఓ విడుదల చేసిన సర్కార్ దానికనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో నల్లగొండ జిల్లాలో ఒక సీఈ, మూడు ఎస్ఈ పోస్టులు, సూర్యాపేట జిల్లాలో ఒక సీఈ, రెండు ఎస్ఈ పోస్టులు రానున్నాయి. అలాగే రెండు జిల్లాల్లో 17.26 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా ప్రతి లక్ష ఎకరాలకు ఒక ఈఈ, 20వేల ఎకరాలకు ఒక డీఈ, ఐదు వేల ఎకరాలకు జేఈని నియమించి వ్యవసాయ శాఖ తరహాలో రైతులకు అధికారులు నిత్యం అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోనున్నారు.
నల్లగొండ : జిల్లాలో వ్యవసాయరంగానికి సాగునీటిని అందించే మేజర్, మైనర్ శాఖలన్నీ ఇక ఒకే గొడుగు కిందికి రానున్నాయి. రాష్ట్రస్థాయిలో ఒకే శాఖగా ఉండి ఒకే ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యవేక్షణ చేస్తుండగా జిల్లాలో మాత్రం పలు శాఖలుగా విభజింపబడి కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటన్నింటినీ ఒకే శాఖ పరిధిలోకి తీసుకొచ్చి జలవనరుల శాఖగా నామకరణం చేయాలని సర్కారు యోచిస్తున్నది. ప్రస్తుతం మేజర్, మైనర్ ఇరిగేషన్ల కింద ఏఎమ్మార్పీతోపాటు ఎన్నెస్పీ, ఐబీ, లిఫ్ట్ ఇరిగేషన్(ఐడీసీ), డిండి ఎత్తిపోతల పథకం(డీఎల్ఐసీ)లతో పాటు పలు ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే వీటన్నింటినీ పునర్ వ్యవస్థీకరించి ఒకే గొడుగు కిందికి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించి ఈనెల 28న జీఓ 45ను విడుదల చేయటంతోపాటు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. అయితే యాదాద్రి భువనగిరి జిల్లాను గజ్వేల్ సర్కిల్లో విలీనం చేసి నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో రెండు సీఈ పోస్టులు ఏర్పాటు చేయనున్నారు.
2సీఈ, 5ఎస్ఈ పోస్టులు..
జిల్లాలోని నీటి పారుదల శాఖల పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు ఒక్కో చీఫ్ ఇంజినీర్(సీఈ)పోస్టులు రానుండగా నల్లగొండ జిల్లాకు మూడు, సూర్యాపేటకు రెండు సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీర్(ఎస్ఈ) పోస్టులు రానున్నాయి. నల్లగొండలో ఎస్ఈ పోస్టులు నల్లగొండతోపాటు మిర్యాలగూడ, కొండమల్లేపల్లిలో ఏర్పాటు చేయనుండగా, సూర్యాపేట జిల్లాలో సూర్యాపేటతోపాటు హుజూర్‌నగర్‌కు కేటాయించనున్నారు. అదేవిధంగా నల్లగొండకు ఎనిమిది నుంచి పది ఈఈ పోస్టులు, సూర్యాపేటకు ఆరు నుంచి ఏడు ఈఈ పోస్టులు రానున్నాయి. ఇక ఐదు వేల ఎకరాలకు ఒక జేఈని నియమించేలా నివేదికలు రూపొందించాలని ప్రభుత్వం ఆ శాఖ అధికారులను ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా అధికార యంత్రాంగం నివేదికలు తయారు చేస్తున్నది. ప్రస్తుతం ఏఎమ్మార్పీ, ఎన్నెస్పీ, ఐబీ, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌తో పాటు నాగార్జునసాగర్ డ్యామ్‌కు ఎస్ఈ పోస్టులు ఉండగా ఐడీసీకి ఈఈ పోస్టు ఉంది. రెండు జిల్లాల్లో ఐదు ఎస్ఈ పోస్టులు ఇవ్వనున్న నేపథ్యంలో వీరినే రెండు జిల్లాలకు ఎస్ఈలుగా నియమించి నూతనంగా రెండు సీఈ పోస్టులు ఇచ్చే అవకాశం ఉన్నది.
ఐదు వేల ఎకరాలకు ఒక జేఈ..
ఇప్పటికే వ్యవసాయ శాఖలో ఐదు వేల ఎకరాలకు ఒక ఏఈఓను నియమించిన ప్రభుత్వం వ్యవసాయానికి సాగునీటిని అందించటానికి జిల్లాలో ఉన్న సాగునీటి వనరులను దృష్టిలో పెట్టుకొని నూతనంగా పురుడుపోసుకోనున్న జలవనరుల శాఖలోనూ ఐదు వేల ఎకరాలకు ఒక జేఈని నియమించాలని భావిస్తున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం జిల్లాలో ఉన్న ఆయకట్టు ఎంత, అధికారుల సంఖ్య ఎంత అనే కోణంలో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీని ప్రకారం నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో మేజర్, మైనర్ ఇరిగేషన్ కింద 17.26 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. నల్లగొండ జిల్లాలో మొత్తం 11.08లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా అందులో ఎన్నెస్పీ కింద 1.46 లక్షలు, ఏఎమ్మార్పీ కింద 2.85 లక్షలు, ఉదయ సముద్రం బ్రాహ్మణ వెల్లంల కింద లక్ష, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి, ఆసిఫ్నెహర్ల కింద 56వేలు, మూసీ కింద తొమ్మిది వేలు, డిండి లిఫ్ట్ఇరిగేషన్ కింద 3.61లక్షలు, డిండి ప్రాజెక్టు కింద 15వేలు, ఐడీసీ(లిఫ్ట్ ఇరిగేషన్) కింద 14వేలు, చిన్న నీటి పారుదల చెరువుల కింద 1.22లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక సూర్యాపేట జిల్లాలో మొత్తం 6.18 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా ఇందులో ఎన్నెస్పీ కింద 2.30లక్షలు, కాకతీయ కెనాల్ కింద 2.20లక్షలు, మూసీ కింద 21వేలు, ఐడీసీ కింద 55వేలు, చెరువుల కింద 92వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టును బట్టి ఒక్కో జేఈ పరిధిలో ఐదు వేలు, డీఈ పరిధిలో 20వేలు, ఈఈ పరిధిలో లక్ష, ఎస్ఈ పరిధిలో మూడు లక్షల ఎకరాల ఆయకట్టు ఉండేలా వారిని పోస్టింగ్ చేయనున్నారు.
నీటి ఇబ్బందులు ఉండొద్దనే..
ప్రస్తుతం జిల్లాలో ఉన్న మేజర్, మైనర్ ఇరిగేషన్లను కలిపి ఒకే గొడుగు కిందికి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకు సంబంధించిన జీఓ సైతం ఈనెల 28న వచ్చింది. దీన్ని బట్టి నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు ఒక్కో సీఈ పోస్టుతోపాటు నల్లగొండకు మూడు ఎస్ఈ, సూర్యాపేటకు రెండు ఎస్ఈ పోస్టులు వచ్చే అవకాశం ఉన్నది. నీటి విడుదల విషయంలో రైతులకు ఇబ్బందులు కలుగొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ఐదు వేల ఎకరాల బాధ్యత ఒక జేఈ చూసుకునేలా చర్యలు చేపడుతున్నది.
-రమేశ్, ఎస్ఈఐబీ
తాజావార్తలు
- ఆంక్షలతో విసిగి : ఇండ్ల నుంచి పారిపోయిన నలుగురు బాలికలు!
- కూతురితో కమెడియన్ సత్య డ్యాన్స్..వీడియో
- నీరవ్ మోదీ కేసులో యూకే జడ్జి కీలక తీర్పు
- వికెట్లు టపటపా..భారత్ 145 ఆలౌట్
- పారిశుద్ధ్యాన్ని పక్కాగా చేపట్టాలి : డా. యోగితా రాణా
- నియంత్రణ సంస్థ పరిధిలోకి డిజిటల్ న్యూస్!
- రాజ్‌నాథ్‌సింగ్ పంజరంలో పక్షి : రైతు నేత నరేశ్ తికాయత్
- మహేశ్‌బాబుకు పెద్ద చిక్కే వచ్చింది..అదేంటో తెలుసా..?
- భార్య టీ చేయకపోవడం.. భర్తను రెచ్చగొట్టి దాడికి ప్రేరేపించడం కాదు..
- చేనేతకు చేయూతనిద్దాం : మంత్రి నిరంజన్ రెడ్డి