గురువారం 25 ఫిబ్రవరి 2021
Nalgonda - Dec 28, 2020 , 01:21:05

ధనాధన్‌ ధరణి రిజిస్ట్రేషన్లు

ధనాధన్‌ ధరణి రిజిస్ట్రేషన్లు

  • హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు 
  • గుర్రంపోడులో అత్యధికం

రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్‌ ద్వారా  నవంబర్‌ 2న ప్రారంభించిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతున్నది. నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియ పూర్తవడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

- మునుగోడు/గుర్రంపోడు

రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రైతులకు సత్వర సేవలందించే లక్ష్యంతో టీఆర్‌ఎస్‌ సర్కారు ధరణి పోర్టల్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. దీనిద్వారా తాసీల్దార్‌ కార్యాలయాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇప్పటివరకు మునుగోడు నియోజకవర్గంలోని మునుగోడులో 170, నాంపల్లిలో 232, చండూరులో 135, మర్రిగూడలో 129 కలిపి 603రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి.  

సులభంగా రిజిస్ట్రేషన్‌...

భూ రిజిస్ట్రేషన్‌ కోసం స్లాట్‌ బుక్‌ చేసుకునేటప్పుడే తమకు అనుకూలంగా ఉండే రోజు, సమయాన్ని ఎంపిక చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. దీంతో రైతులకు బోలెడంత సమయం కలిసి వస్తున్నది. రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియను కేవలం 10నిమిషాల్లోనే పూర్తిచేసి పట్టాదారు పాసుబుక్‌, రిజిస్ట్రేషన్‌ పత్రాలను అందజేస్తుండడంతో ఆఫీసుల చుట్టూ తిరిగే బాధ తప్పింది. ఆన్‌లైన్‌లో సంబంధిత భూ యజమాని కుటుంబసభ్యుల వివరాలను పొందుపర్చడంతో పంపకాల విషయంలో ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండాపోయింది. 

బుకింగ్‌ సమయానికి ముందే రావాలి.. 

ధరణి పోర్టల్‌కు రైతుల నుంచి మంచి స్పందన వస్తున్నది. ఖర్చుల భారం తప్పడంతోపాటు నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ పూర్తవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చేవారు స్లాట్‌ బుకింగ్‌ సమయం కంటే 30నిమిషాల ముందు కార్యాలయానికి వస్తే ప్రక్రియ తొందరగా పూర్తవుతుంది. 

- దేశ్యానాయక్‌, తాసీల్దార్‌, మునుగోడు

అవగాహన కల్పిస్తున్నాం..

రైతులకు సర్పంచుల సహకారంతో అవగాహన కల్పిస్తున్నాం. దీంతో సులభంగా, వేగంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. మీ సేవ కేంద్రాల నిర్వాహకుల ద్వారా కూడా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. 

- అంబటి ఆంజనేయులు, తాసీల్దార్‌, గుర్రంపోడు

గుర్రంపోడులో రికార్డు స్థాయిలో..

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జిల్లాలోనే గుర్రంపోడు తాసీల్దార్‌ కార్యాలయంలో అత్యధికంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు 284 రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్లు తాసీల్దార్‌ అంబటి ఆంజనేయులు తెలిపారు. దేవరకొండ డివిజన్‌లోని 10మండలాల్లో  1481 రిజిస్ట్రేషన్లు పూర్తికాగా 284 రిజిస్ట్రేషన్లు గుర్రంపోడులో పూర్తి కావడం విశేషం.

VIDEOS

logo