గురువారం 25 ఫిబ్రవరి 2021
Nalgonda - Dec 26, 2020 , 00:17:15

భక్తిశ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి

భక్తిశ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి

ఉత్తర ద్వార దర్శనానికి బారులుదీరిన భక్తులు

మిర్యాలగూడ/హాలియా/మిర్యాలగూడ రూరల్‌/అడవిదేవులపల్లి/దామరచర్ల/గుర్రంపోడు/నందికొండ :  ముక్కోటి ఏకాదశిని ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఉదయం నుంచే భక్తులు వైష్ణవ ఆలయాలకు వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్‌బోర్డు వేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో వచ్చారు.  మిర్యాలగూడ మండలంలోని అవంతీపురం కొండపై వెలిసిన వేంకటేశ్వర స్వామి, అడవిదేవులపల్లి మండల కేంద్రం సమీపంలోని బౌద్ధమ దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించారు. కృష్ణానదిలో స్నానాలాచరించి చెన్నకేశవ స్వామికి పూజలు చేశారు. దామరచర్ల మండలంలోని..వాడపల్లి లక్ష్మీనర్సింహస్వామి, దామరచర్ల కోదండ రామాలయాల్లో శుక్రవారం ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. హాలియా సీతారామాంజనేయస్వామి, వేంకటేశ్వర స్వామి.. గుర్రంపోడు మండలంలోని కొప్పోలు, పాల్వాయి, నందికొండలోని పైలాన్‌కాలనీ కోదండ రామస్వామి, హిల్‌కాలనీలోని సత్యనారాయణ స్వామి దేవాలయాల్లో ఏకాదశి వేడుకలను నిర్వహించారు. కోదండ రామస్వామి దేవాలయంలో లక్ష కుంకుమార్చనను జరిపించారు. 

దైవ చింతన కలిగి ఉండాలి : మండలి చైర్మన్‌ గుత్తా

దేవరకొండ : ప్రతి ఒక్కరూ దైవ చింతనతో కలిగి ఉండాలని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ అన్నారు. శుక్రవారం దేవరకొండ పట్టణంలోని గరుడాద్రి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. 

ఘనంగా కోదండ రామాలయానికి భూమి పూజ 

పెద్దఅడిశర్లపల్లి : మండలంలోని దుగ్యాలలో కోదండ రామాలయానికి ఘనంగా భూమి పూజ నిర్వహించారు. ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంపీపీ వంగాల ప్రతాప్‌రెడ్డి, సర్పంచ్‌ నర్రావుల జయమ్మ పాల్గొన్నారు.


VIDEOS

logo