ఆమె కోసం హెల్ప్‌డెస్క్

- ప్రతి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు
- నేడో, రేపో ప్రారంభం
నల్లగొండ క్రైం : మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల సేవలను మరింత దగ్గర చేస్తున్నది. పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు సత్వర న్యాయం జరిగేలా, వారికి భరోసా కల్పించే దిశగా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే మహిళల రక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిన పోలీస్ శాఖ జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లలో వారి కోసం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయనున్నది. వీటితో మహిళలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినప్పుడు పురుషులతో కాకుండా మహిళా పోలీసులతో తమ బాధలు చెప్పుకుని రక్షణ పొందేలా చర్యలు చేపట్టింది.
ఇప్పటికే జిల్లాలో షీటీమ్స్, మహిళలకు ప్రత్యేక పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం తాజాగా వారి కోసం ప్రతి పోలీస్ స్టేషన్లో హెల్ప్‌డెస్క్‌ను ప్రారంభించింది. ఎక్కడైనా వేధింపులు, లైంగికదాడులు జరిగితే తమ బాధను పురుష పోలీసులకు చెప్పుకోలేని వారు ఈ హెల్ప్‌డెస్క్‌ల ద్వారా విన్నవించుకునే అవకాశం ఉంటుంది.
మహిళా పోలీసులకే ఫిర్యాదులు..
జిల్లావ్యాప్తంగా ఉన్న పోలీస్స్టేషన్లలో ఇప్పటికే రిసెప్షన్లు ఉన్నప్పటికీ వాటిలో పురుషులు, మహిళలు ఫిర్యాదులు చేసే వెసులుబాటు కల్పించారు. రిసెప్షన్ కేంద్రాల్లో పురుషులు కూడా ఉంటుండడంతో గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఆత్మగౌరవం, అత్మాభిమానం దెబ్బతింటుందన్న ఆలోచనతో వారి బాధలు చెప్పుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారని గ్రహించిన పోలీస్ శాఖ హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేస్తున్నది. ఇందులో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను ఏర్పాటు చేసి మహిళల నుంచి ఫిర్యాదులు స్వీకరించే వీలు కల్పించనున్నది.
బాధితులు ముందుకు రావాలి : ఏఎస్పీ
నల్లగొండ క్రైం : మహిళల భద్రతే లక్ష్యంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రత్యేకంగా మహిళా హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయనున్నట్లు ఏఎస్పీ నర్మద తెలిపారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన మహిళలు, విద్యార్థినులకు ఆన్లైన్ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. ఆన్లైన్ వేధింపుల పట్ల మహిళలుల ఫిర్యాదు చేయడానికి ధైర్యంగా బయటకు రావాలని అప్పుడే వారికి తగిన న్యాయం చేసే అవకాశం కలుగుతుందన్నారు. మహిళలు నేరుగా పోలీస్ స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేకుండా షీ టీమ్స్ ఫోన్ నెంబర్ల ద్వారా మేసేజ్, వాట్సాప్ రూపంలో సైతం ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. సామాజిక మాధ్యమాల వినియోగంలోసెక్యూరిటీ ఫీచర్స్ వినియోగించుకోవాలని సూచించారు. ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా ఇప్పటివరకు 300మందికి న్యాయం అందించగలిగామని చెప్పారు. మహిళల రక్షణే ధ్యేయంగా నిర్వహించబడుతున్న హాక్ఐ యాప్ వచ్చే ఏడాది నుంచి జిల్లాలో అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. సైబర్ క్రైమ్స్ పట్ల మరింత అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉన్నదని, ముఖ్యంగా అన్లైన్ మోసాల వలలో పడకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలు, హాక్ఐ యాప్, షీటీమ్స్ పనితీరు గురించి ఐటీ సెల్ గోపి సమగ్రంగా వివరించారు. మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ రాజశేఖర్‌గౌడ్, ఏఎస్ఐలు విజయలక్ష్మి, కృష్ణ, హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాస్‌రెడ్డి, కానిస్టేబుళ్లు రమేశ్, నర్సింహ, పాషా పాల్గొన్నారు.
హెల్ప్‌డెస్క్‌ల ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి
జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకున్నాం. ఇందుకు కావాల్సిన స్టేషనరీ ఇతరత్రా వస్తువులను జిల్లా ఎప్పీ ఆదేశాల మేరకు సమకూర్చాం. నేడు లేదా రేపు హెల్ప్‌డెస్క్‌లను డీఐజీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశాం.
-రాజశేఖర్‌గౌడ్. సీఐ, మహిళా పోలీస్‌స్టేషన్, నల్లగొండ
తాజావార్తలు
- ఎమ్మెల్యే అభ్యర్థిగా అసోం సీఎం నామినేషన్ దాఖలు
- ఆదా చేయండి.. సీదా వెళ్లండి
- రూ.5.85 లక్షల కోట్ల రుణాల రద్దు!
- టీఎస్ ఈసెట్-2021 పరీక్ష షెడ్యూల్ విడుదల
- ఈ ఏడాదంతా రీమేక్లదే హవా
- అన్నాడీఎంకేతో పొత్తుకు విజయ్‌కాంత్ గుడ్‌బై
- ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా అశ్విన్
- పుచ్చకాయలను తింటే హైబీపీ సులభంగా తగ్గుతుందట..!
- పూజాహెగ్డే షాకింగ్ రెమ్యునరేషన్..?
- మోటోరోలా నుంచి రెండు కొత్త బడ్జెట్ ఫోన్లు