శుక్రవారం 05 మార్చి 2021
Nalgonda - Dec 22, 2020 , 00:16:13

బిర్యానీ రేడీ

బిర్యానీ రేడీ

పురవీధుల్లో బిర్యానీ పాయింట్స్‌పేద, మధ్యతరగతికి అందుబాటు ధరల్లో.. ఉపాధి పొందుతున్న యువతరెస్టారెంట్లలో 20శాతం పెరిగిన ధరలు హోటళ్లు, రెస్టారెంట్లకే పరిమితమైన బిర్యానీ వంటకం నేడు విరివిగా లభిస్తున్నది. నిరుద్యోగ యువత పురవీధుల్లో ప్రత్యేకంగా బిర్యానీ విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. పేద, మధ్య తరగతికి అందుబాటు ధరల్లో లభిస్తుండడంతో వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతున్నది. జీఎస్టీ కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లలో ధరలు పెరగడంతో చాలామంది రోడ్ల వెంట వెలిసిన బిర్యానీ పాయింట్లలో కొనుగోలు చేస్తున్నారు. వీకెండ్స్‌లో బిర్యానీ పార్సిళ్లు అత్యధికంగా అమ్ముడుతుపోతున్నట్లు నిర్వాహకులు చెప్తున్నారు.

నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, కోదాడ సహా పలు పట్టణాల్లో ఘుమఘుమలాడే ధమ్‌ బిర్యానీ పాయింట్లు ఇటీవల పెద్ద ఎత్తున ఏర్పాటయ్యాయి. రూ.100కే ఒక్కరికి సరిపోయే ప్యాకింగ్‌ ఇస్తుండగా.. చికెన్‌ ధరలు తగ్గిన సందర్భాల్లో రూ.90కే లభ్యమవుతున్నది. ఓ వైపు జీఎస్టీ కారణంగా రెస్టారెంట్లు, హోటళ్లలో చికెన్‌ బిర్యానీ పార్సిల్‌ రేట్లు 18శాతం పెరిగాయి. ఈ నేపథ్యంలో బిర్యానీ పాయింట్ల వద్ద రద్దీ పెరిగింది. ఒక్క నల్లగొండ పట్టణంలోనే సుమారు 30కి పైగా బిర్యానీ పాయింట్లు వెలిశాయి. 

సాయంత్రం నుంచే అందుబాటులో... 

బిర్యానీ పాయింట్లను యువత ఉపాధి మార్గంలా ఎంచుకున్నది. మరికొందరు రోజువారీ కూలి తీసుకుని విక్రయిస్తున్నారు. ఇంటి వద్ద వంట చేయించి సాయంత్రం 6నుంచి రాత్రి విక్రయాలు ప్రారంభిస్తున్నారు. రెస్టారెంట్లలో సింగిల్‌ బిర్యానీ పార్సిల్‌ ధర రూ.270కాగా, ఫ్యామిలీ ప్యాక్‌ రూ.520బిల్‌ అవుతున్నది. పేద, మధ్య తరగతి ప్రజలకు రెస్టారెంట్ల ధరలు భారం కాగా బిర్యానీ పాయింట్లలో అందుబాటులో ఉంటున్నాయి. 

రోజూ 70ప్యాకెట్లు అమ్ముతాం...

మాకు రామగిరి, ప్రకాశంబజార్‌లో బిర్యానీ పాయింట్లున్నాయి. ప్రతి రోజూ 70పార్సిళ్లకు పైగా అమ్ముతున్నాం. ఒక్కో ప్యాకెట్‌కు వంద రూపాయలు తీసుకుంటున్నాం. సాయంత్రం ఆరు గంటల తర్వాత ఏర్పాటు చేస్తే రాత్రి 11గంటలకు మొత్తం అయిపోతుంది. ఒక్కోసారి ఎనిమిది, తొమ్మిది గంటలకే సేల్‌ అవుతుంది. 

- నందకుమార్‌, వీటీ కాలనీ, నల్లగొండ 

వంద రూపాయలకే సరపడా వస్తుంది..

రెస్టారెంట్లల్లో బిర్యానీ ధరలు బాగా పెరిగాయి. ఒక్కరే తినాలనుకుంటే రెస్టారెంటుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడే వంద రూపాయలకే రెండు పీసులు, ఒకరికి సరిపోయే రైస్‌ ఇస్తున్నరు. ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు కదా.!. అని ఇక్కడే కొంటాను. ఒకవేళ ఇద్దరికి అవసరమైతే రెండొందలు పెట్టి కొంటే సరిపోతుంది. 

- నాగరాజు, నల్లగొండ

VIDEOS

logo