బుధవారం 24 ఫిబ్రవరి 2021
Nalgonda - Dec 22, 2020 , 00:16:15

నీలగిరిపై డేగ కన్ను

నీలగిరిపై డేగ కన్ను

నేరాల నియంత్రణ, ప్రజా భద్రతే లక్ష్యంమహిళలకు మరింత రక్షణఒక్కసారి రిజిస్టర్‌ చేసుకుంటే పోలీసులు మీ వెన్నంటి ఉన్నట్టే..అత్యవసర పరిస్థితుల్లో క్షణాల్లో చేరుకునేలా సాంకేతికతపౌర సమస్యలు, పోలీసులపైనా ఫిర్యాదు చేయొచ్చుప్రజా భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర సేవలను మరింత చేరువ చేస్తున్నది. పౌరులను పోలీస్‌ విధుల్లో భాగస్వాములను చేసి, నేరాలను అదుపులో ఉంచేలా రూపొందించిన హాక్‌ ఐ యాప్‌ సేవలను విస్తరిస్తున్నది. హైదరాబాద్‌ నగరంలో సత్ఫలితాలు ఇవ్వడంతో కొత్త సంవత్సరం నుంచి నల్లగొండ జిల్లాలో అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. షీటీమ్స్‌కు అనుసంధానంగా పనిచేయనున్న ఈ మొబైల్‌ అప్లికేషన్‌తో మహిళలకు మరింత రక్షణ లభించనున్నది. ఆఫీసులు, ప్రయాణం, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న మహిళలు, విద్యార్థినులకు ఇదెంతగానో ఉపయోగపడనున్నది. నేడు ప్రతిఒక్కరి చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉన్నందున ఒక్కసారి హాక్‌ఐలో రిజిస్టర్‌ చేసుకుంటే జిల్లా పోలీస్‌ యంత్రాంగం మొత్తం మీ వెన్నంటి ఉన్నట్టే!

  • కొత్తఏడాదిలో హాక్‌ ఐ సేవలు
  • ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కితే చాలు..

అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సాయం పొందేందుకు హాక్‌ ఐ యాప్‌లోని ఎస్‌ఓఎస్‌ నొక్కితే ముందుగా నమోదు చేసిన ఐదుగురు ఫ్రెండ్స్‌ లేదా బంధువుల మొబైల్‌ నంబర్లకు అలర్ట్‌ మెసేజ్‌ వెళ్తుంది. అదే సమయంలో మీ లొకేషన్‌ను షేర్‌ చేస్తూ సమీప పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌, డీఎస్‌పీ, పెట్రోలింగ్‌ సిబ్బందితోపాటు కంట్రోల్‌ రూమ్‌కు కూడా సందేశం వెళ్తుంది. అలా క్షణాల్లో పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు తీసుకుంటారు.

జనవరి నుంచి జిల్లాలో హాక్‌ ఐ సేవలు... 

‘హాక్‌ ఐ’ సేవలు జిల్లాలో అందించేందుకు ఎస్పీ ఏవీ రంగనాథ్‌ సారథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. టెక్నికల్‌ సమస్యల వల్ల కొంత ఇబ్బంది వచ్చింది. జనవరి నుంచి పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. దీనిపై విస్తృతంగా ప్రచారం కూడా చేపట్టనున్నాం. మహిళలు, విద్యార్థినులకు ఈ యాప్‌ సేవలు ప్రతి మహిళ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేలా ప్రచారం నిర్వహిస్తాం.

- రాజశేఖర్‌, సీఐ, షీ టీమ్‌ 

కండ్ల ముందు జరిగే నేరాలు, ట్రాఫిక్‌ ఉల్లంఘనలతోపాటు పోలీసుల బాధ్యతా రాహిత్యాన్ని కూడా స్టేషన్‌ దాకా వెళ్లకుండానే హాక్‌ఐ ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. మెరుగైన సేవల కోసం సూచనలు కూడా ఇవ్వవచ్చు.కొత్తగా ఇంట్లోకి కిరాయి దిగేవారు, పని మనుషుల వివరాలనూ హాక్‌ ఐ యాప్‌లో పోలీస్‌ యంత్రాంగానికి పంపి వారి గతం క్లీన్‌గా ఉందో, లేదో కూడా చెక్‌ చేసుకోవచ్చు.నేరాల నియంత్రణలో పౌరులను భాగస్వామ్యం చేసేలా పోలీస్‌ శాఖ రూపొందించిన ‘హాక్‌ ఐ’ యాప్‌ సేవలు అతి త్వరలో జిల్లాలోనూ ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్‌ మహానగరంలో అందుతున్న హాక్‌ ఐ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎంపిక చేసిన జిల్లాల్లో నల్లగొండ కూడా ఉన్నది. పోలీసులకు పౌరులు తమవంతు సహకరించేందుకు హాక్‌ ఐ ఎంతో ఉపకరిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలకు తోడుగా ఉంటుంది. ఫోన్‌లో యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుని దరఖాస్తు చేస్తే చాలు.. ప్రయాణ మహిళ రక్షణతోపాటు మరో నాలుగు రకాల సేవలు లభిస్తాయి. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగింది. మారుమూలకు సైతం ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావడంతో సెకన్లలో పోలీసుల సాయం కోరేలా యాప్‌ ఉపయోగపడనున్నది. 

మహిళల ప్రయాణం ఇక సురక్షితం...

ఒంటరి మహిళలు, అమ్మాయిలు అఘాయిత్యాలకు గురవుతున్నారు. ప్రయాణ సమయాల్లో, ఉద్యోగాలు చేసే ప్రాంతాల్లో అభద్రతకు లోనవుతున్నారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఉమెన్‌ ట్రావెల్‌ మేడ్‌ సేఫ్‌ అనే ఆప్షన్‌, మహిళల సురక్షిత ప్రయాణానికి తోడ్పాటునిస్తుంది. మహిళలు తాము ప్రయాణిస్తున్న కారు, క్యాబ్‌, ఆటో, బస్‌, రైలు లేదా మరే ఇతర వాహనమైన ఎక్కే ముందు వాహనం ఫొటో లేదా వీడియో తీసి అప్‌లోడ్‌ చేయాలి. లేదా వాహనం రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, బయల్దేరిన, గమ్యస్థానానికి సంబంధించిన వివరాలను నమోదు చేయాలి. 

ఎస్‌ఓఎస్‌ బటన్‌...

ఆపద లేదా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు బటన్‌ నొక్కితే ముందుగా నమోదు చేసిన ఐదుగురు మిత్రులు లేదా బంధువులకు ప్రీరికార్డెడ్‌ మెసేజ్‌ వెళ్తుంది. అదే సమయంలో మీరున్న ప్రదేశాన్ని బట్టి సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ ఇన్స్‌పెక్టర్‌, ఏసీపీ, డీసీపీ, పెట్రోలింగ్‌ వాహనాలు, కంట్రోల్‌ రూమ్‌కు కూడా సందేశం వెళ్తుంది. ఈ మెసేజ్‌లో పేరు, ఫోన్‌ నెంబర్‌, చిరునామాతో పాటుగా ఆ సమయంలో వ్యక్తి ఉన్న ప్రదేశం వివరాలుంటాయి. దీని సహాయంతో ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడేందుకు తక్షణమే చర్యలు చేపట్టేందుకు వీలవుతుంది. 

ఫిర్యాదు ఇలా చేయాలి.. 

పౌరులు తమ దృష్టికి వచ్చే ఎలాంటి నేర పూరిత సంఘటనలనైనా పోలీసుల దృష్టికి తెచ్చేందుకు ఈ యాప్‌ ఉపయోగపడుతుంది. చాలా మంది చిన్న చిన్న ఘటనలు కండ్ల ముందే జరుగుతున్నా పట్టించుకోరు. ‘మనకు ఎందుకొచ్చిన తలనొప్పి’ అని వదిలేస్తుంటారు. పోలీసులకు సమాచారం ఇవ్వడానికి ఇష్టపడరు. అయితే హాక్‌ ఐ ద్వారా ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండ కేవలం మొబైల్‌ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వొచ్చు. యాప్‌ సాయంతో ఒక్క క్లిక్‌ ద్వారా చిటికెలో పని జరిగిపోతుంది. 

యాప్‌లో మరిన్ని సేవలు... 

ట్రాఫిక్‌ ఉల్లంఘనలు : ట్రాపిక్‌ సమస్యలను నివారించడానికి ఉపయోగపడుతుంది. వాహనాలు రోడ్డు మధ్య నిలిచిపోవడం, తప్పుడు పార్కింగ్‌, రోడ్డు మీద వ్యర్థాలు పడేయడం, ఆక్రమణలు, మూతలేని మ్యాన్‌ హోల్స్‌, వర్షాకాలంలో డ్రైనేజీ పొంగడం లాంటివి నిత్యం ట్రాఫిక్‌కు అడ్డంకులను సృష్టిస్తాయి. ఈ సమస్యలను సంబంధిత అదికారికి చేరవేయడానికి ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. 

జరుగుతున్న నేరాలు : అనేక చిన్న పెద్ద నేరాలు మన దృష్టికి వస్తాయి. కానీ మనం వాటిని చూసీ చూడనట్లు పోతాం. ఇలాంటి వాటిని ఫొటో లేదా వీడియో తీసి పంపితే సత్వర చర్యకు వీలవుతుంది. భారీ ఘటనలకు నివారించే అవకాశం ఉంటుంది.

మహిళలపై నేరాలు : మన చుట్టూ జరిగే నేరాల్లో మహిళలపై జరిగే నేరాలు చాలా ఆందోళన కలిగించే అంశం. దీనికి సంబంధించిన ఫీచర్‌ను క్లిక్‌ చేస్తే షీటీమ్స్‌కు, పెట్రోలింగ్‌ మొబైల్స్‌కు మెసేజ్‌ చేరుతుంది. సకాలంలో చర్య తీసుకుని సమస్య నివారించేందుకు వీలు కలుగుతుంది.

పోలీస్‌ ఉల్లంఘనలు : చట్టం ముందు అందరు సమానమే. పోలీసులు ఏవైనా ఉల్లంఘనలకు పాల్పడితే వారిపై ఫిర్యాదు చేయడం చాలా సులభం. 

పోలీసింగ్‌ పెరుగుదలకు సూచనలు : ప్రజానుకూల వైఖరితో పోలీసు సేవల నాణ్యత మెరుగు పరిచేందుకు పౌరులు తమ విలువైన సలహాలు, సూచనలు తెలియజేసేందుకు కూడా ఈ యాప్‌ ఉపయోగపడుతుంది.

పోలీసులు చేసే మంచి పనులు రిపోర్టు చేయడం : పోలీసులు చేస్తున్న మంచి పనులు మన దృష్టికి వస్తే ఆ యాప్‌ ద్వారా తెలియజేయవచ్చు. ఇలా చేయడం వల్ల పోలీస్‌ సిబ్బందికి మరింత ఉత్సాహం లభిస్తుంది. ప్రోత్సాహం కలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

పని మనుషులు, కార్మికులు, రెంటల్స్‌ సమాచారం నమోదు..

ఇంట్లో పని మనుషులు, ఇతర పని వారు, అద్దెకు ఉండే వ్యక్తుల వివరాలను పోలీసులకు తెలియజేసేందుకు ఈ యాప్‌ ఉపకరిస్తుంది. అవసరమైన సందర్భాల్లో ఈ సమాచారాన్ని పోలీసులు, యజమానులు ఉపయోగించుకునే వీలుంటుంది. అందించిన సమాచారం పోలీసుల డేటాబేస్‌లో రికార్డవుతుంది. అసలు పోలీసుల దగ్గర నమోదు చేసుకోవాల్సిన అవసరం ఏమిటి..? అని చాలా మంది సందేహం. ఇంట్లో పనికి కుదిరే అపరిచితులు నేరాలు చేసి పరారవుతుంటారు. అప్పుడు వారి వివరాల కోసం వెతికితే ఏమి దొరకవు. మరికొందరు డ్రైవర్‌ను పనిలో పెట్టుకుంటారు. కనీసం డ్రైవింగ్‌ లైసెన్స్‌ వివరాలు కూడా తీసుకోరు. అలాంటప్పుడు వారు వాహనాన్ని అపహరిస్తుంటారు. లేదంటే మరో నేరం జరిగితే దర్యాప్తు చేసేందుకు వివరాలు అందుబాటులో ఉండవు. కొన్నిసార్లు నేరస్తులు ఇళ్లు అద్దెకు తీసుకుంటారు. వారి వివరాలు ముందే సేకరించుకోకపోతే నష్టమే. అందువల్ల పోలీసుల దగ్గర వివరాలు నమోదు చేయడం ముఖ్యం. ఈ డేటా పోలీస్‌స్టేషన్ల వారీగా సెంట్రల్‌ సర్వర్‌లో నమోదవుతుంది. ఫొటోలు, ఇతర వివరాల డేటా సేకరణ వల్ల నేరాలకు పాల్పడేవారు కూడా ఒకటికి, రెండుసార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఈ విధంగా ఇది నేర నిరోధకంగా పని చేస్తుంది. పౌరుల భద్రత, ఆస్తుల రక్షణకే ఇది ఉద్దేశించబడిందని అర్థం చేసుకోవాలి. నేరాల దర్యాప్తులో కీలకంగా మారుతుంది.

VIDEOS

logo