సోమవారం 01 మార్చి 2021
Nalgonda - Dec 19, 2020 , 01:13:34

నల్లమల రక్షణకు ప్రత్యేక చర్యలు

 నల్లమల రక్షణకు ప్రత్యేక చర్యలు

  • అభివృద్ధికి నిధులు కేటాయించిన ప్రభుత్వం 
  • రాష్ట్ర చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ లోకేశ్‌ జైస్వాల్‌ 
  • చిత్రియాల అటవీ ప్రాంతంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

చందంపేట : రాష్ట్రంలో అటవీ ప్రాంతాన్ని సంరక్షించి, అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ లోకేశ్‌ జైస్వాల్‌ తెలిపారు. శుక్రవారం మండలంలోని చిత్రియాల, పెద్దమునిగల్‌ గ్రామాల సమీపంలో వివిధ అభివృద్ధి పనులకు అటవీశాఖ అధికారులతో కలిసి  శంకుస్థాపన చేశారు. నేరేడుగొమ్ము మండలంలోని పెద్దమునిగల్‌ సమీపంలోని సర్వే నెంబర్‌ 169లో ప్రభుత్వ భూమిని అటవీశాఖకు అప్పగించడంతో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం చిత్రియాల సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి పాలపడ్యకు ఏర్పాటు చేసిన సుమారు 8 కిలోమీటర్ల రోడ్డు మార్గాన్ని, సోలార్‌ లైట్లను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆ ప్రాంతంలో మొక్కలు నాటి, నిర్మించిన చెక్‌డ్యామ్‌ను పరిశీలించారు. కాంపా నిధులతో సుమారు రూ.40 లక్షలతో ఏర్పాటు చేసిన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చందంపేట, నేరేడుగొమ్ము మండలాల్లో నల్లమల అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందన్నారు. అటవీ సంపదను సంరక్షించేందుకు అధిక సంఖ్యలో  సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. అటవీ ప్రాంతంలో చెక్‌డ్యామ్‌లు ఏర్పాటు చేయడంతో వన్యప్రాణులను పెంచడంతోపాటు అటవీ వృక్షాలను సైతం అభివృద్ధి చేయవచ్చని తెలిపారు. గతంలో అటవీ ప్రాంతంలో ఉన్న కలపను అక్రమంగా తరలించడంతో అటవీ ప్రాంతం అంతరించిపోయిందని, ప్రస్తుతం అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మండలంలోని కంబాలపల్లి, రేకుల వలయం అటవీ ప్రాంతంలో రూ. 26 లక్షలతో రెండు చెక్‌డ్యామ్‌లు ఏర్పాటు చేశామని, వేసవికాలంలో సైతం నీరు ఎండిపోకుండా ప్రత్యేక బోర్లను ఏర్పాటు చేసి చెక్‌డ్యామ్‌లు నింపేలా  చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో వాచ్‌టవర్లు సైతం ఏర్పాటు చేయాలని అటవీశాఖ అధికారులకు సూచించారు. 100 హెక్టార్ల అటవీ ప్రాంతంలో హరితహారం మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ సర్కిల్‌ ఫీల్డ్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఏకే సిన్హా, డీఎఫ్‌ఓ సివల రాంబాబు, ఎఫ్‌డీఓ సర్వేశ్వర్‌, ఎఫ్‌ఆర్‌ఓ రాజేందర్‌, నాగర్‌కర్నూల్‌, నల్లగొండ జిల్లాల అటవీ శాఖ ఫ్లయింగ్‌ స్కాడ్‌ అధికారి శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ ఎంపీపీ ఏర్పుల గోవింద్‌యాదవ్‌, ట్రైనింగ్‌ ఎఫ్‌ఆర్‌ఓ రమేశ్‌ నాయక్‌, సెక్షన్‌ ఆఫీసర్లు శ్రీదేవి, రాగ్యానాయక్‌, బీట్‌ ఆఫీసర్‌ చంద్రకళ, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. 


VIDEOS

logo