నమ్మినోళ్లను నట్టేట

- తుర్కపల్లిలో మహిళా సంఘాల డబ్బు కాజేసిన బ్యాంకుమిత్ర
- రూ.50లక్షలకుపైగా స్వాహా!
- మహిళా సంఘాల డబ్బు కాజేసిన బ్యాంకుమిత్ర
కాయకష్టం చేసి బతికే ఈ మహిళలు భవిష్యత్ మీద భరోసా కోసం పొదుపు సంఘాల్లో చేరారు. రూపాయి రూపాయిగా పోగేసిన డబ్బుతో బ్యాంకు లోను తీరుస్తున్నామనుకున్నారు. క్రమశిక్షణతో క్రమం తప్పకుండా బ్యాంకు మిత్రకు వాయిదాలు చెల్లిస్తుంటే.. ఆమె మాత్రం వాటిని బ్యాంకులో డిపాజిట్ చేయకుండా కాజేసింది. కనగల్ మండలంలోని తుర్కపల్లిలో శుక్రవారం ఇది అక్రమం వెలుగుచూసింది. తమ డబ్బు 50లక్షలకుపైగా కాజేసిందంటూ బాధితులు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డితో కలిసి ఎస్పీ రంగనాథ్‌కు వినతిపత్రం ఇచ్చారు.
కనగల్ : కాయకష్టం చేసుకుని సంపాదించిన డబ్బును దాచుకోవాలనుకున్నారు. అందుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మహిళా సంఘాలను ఏర్పాటు చేసుకుని నెలనెలా పొదుపు చేసుకుంటున్నారు. బ్యాంకు నుంచి పొందిన రుణాలను నెలనెలా గ్రామంలోని బ్యాంకుమిత్ర వద్ద చెల్లిస్తున్నారు. కానీ.. సదరు వ్యక్తి ఆ డబ్బును బ్యాంకులో జమ చేయకుండా నొక్కేసింది. మహిళా సంఘాల ఫిర్యాదుతో ఈ విషయం వెలుగుచూసింది. బ్యాంకు, వెలుగు అధికారులు తనిఖీ చేయగా దుర్వినియోగం చేసినట్లు తేలింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా కనగల్ మండలం తుర్కపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
తుర్కపల్లి గ్రామంలో 34 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాలు లక్ష నుంచి రూ.5లక్షల వరకు మండల కేంద్రంలోని ఏపీజీవీబీ నుంచి రుణాలు పొందాయి. తీసుకున్న రుణాలకు ప్రతి నెలా కొంత నగదును బ్యాంకులో జమ చేయాల్సి ఉంది. అయితే.. బ్యాంకుకు వెళ్లకుండా గ్రామంలోని వీబీకే విధులు నిర్వర్తిస్తున్న బ్యాంకుమిత్ర పార్వతమ్మకు చెల్లించారు. సదరు బ్యాంకుమిత్ర ఆ డబ్బును బ్యాంకులో చెల్లించకుండా స్వంతానికి వాడుకుంది. ఈ వ్యవహారం మూడేండ్లుగా కొనసాగుతున్నది. అయితే.. ఓ మహిళా సంఘం సభ్యులు తమ పాసుపుస్తకం ఇవ్వాలని పలుమార్లు కోరినా వీబీకే ఇవ్వలేదు. దీంతో వారికి అనుమానం వచ్చి బలవంతంగా బ్యాంకు ఖాతా పుస్తకం తీసుకెళ్లి స్టేట్మెంట్ తీయడంతో డబ్బులు జమ కాలేదు. ఈ విషయం గ్రామంలో తెలియడంతో అన్ని సంఘాలవాళ్లు పాసుపుస్తకాలు తీసుకెళ్లి బ్యాంకు స్టేట్మెంట్ తీయగా డబ్బులు జమ చేయలేదని, మోసం జరిగిందని గుర్తించారు. మహిళల ఫిర్యాదు మేరకు వెలుగు, బ్యాంకు అధికారులు గ్రామానికి వచ్చి స్టేట్మెంట్ పరిశీలించి సంఘబంధం లోన్లలో రూ.50లక్షలకుపైగా అక్రమాలు చోటుచేసుకున్నాయని గుర్తించారు. ఈ విషయమై అధికారులు వారం రోజుల క్రితం సంబంధిత వీబీకేను ప్రశ్నించగా.. డబ్బులు చెల్లిస్తాను, కొంత గడువు ఇవ్వాలని కోరింది. ఇప్పుడు మాట మార్చి తనకు ఎవరూ డబ్బు కట్టలేదని అంటున్నది.
ఎస్పీకి ఫిర్యాదు..
నల్లగొండ క్రైం : స్వయం సహాయక సంఘాల సభ్యుల పొదుపు, అప్పు వాయిదాల చెల్లింపులో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని తుర్కపల్లి గ్రామస్తులు, మహిళా సంఘాల సభ్యులు శుక్రవారం నల్లగొండలో ఎమ్మెల్యే కంచర్ల భుపాల్రెడ్డికి విన్నవించారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే వెంటనే వారితో కలిసి ఎస్పీ ఏవీ రంగనాథ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ సుమారు కోటి రూపాయల వరకు వీఓఏ స్వాహా చేసిందన్నారు. సెర్ప్ అధికారులు కూడా అమెకు సహకరించారని ఆరోపించారు. అనంతరం ఎస్పీ రంగనాథ్ మాట్లాడుతూ స్వాహా చేసిన సొమ్మును రికవరీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో పాత్ర ఉన్న అధికారులపైనా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎస్పీని కలిసిన వారిలో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కనగల్ ఎంపీపీ కరీంపాషా, జడ్పీటీసీ చిట్ల వెంకటేశం, పీఏసీఎస్ చైర్మన్ వంగాల సహదేవ్‌రెడ్డి, వైస్ ఎంపీపీ రామగిరి శ్రీధర్‌రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐతగోని యాదయ్య, కార్యదర్శి జొన్నలగడ్డ శేఖర్‌రెడ్డి, మహిళా సంఘాల సభ్యులు ఉన్నారు.
తాజావార్తలు
- కూతురితో కమెడియన్ సత్య డ్యాన్స్..వీడియో
- నీరవ్ మోదీ కేసులో యూకే జడ్జి కీలక తీర్పు
- వికెట్లు టపటపా..భారత్ 145 ఆలౌట్
- పారిశుద్ధ్యాన్ని పక్కాగా చేపట్టాలి : డా. యోగితా రాణా
- నియంత్రణ సంస్థ పరిధిలోకి డిజిటల్ న్యూస్!
- రాజ్‌నాథ్‌సింగ్ పంజరంలో పక్షి : రైతు నేత నరేశ్ తికాయత్
- మహేశ్‌బాబుకు పెద్ద చిక్కే వచ్చింది..అదేంటో తెలుసా..?
- భార్య టీ చేయకపోవడం.. భర్తను రెచ్చగొట్టి దాడికి ప్రేరేపించడం కాదు..
- చేనేతకు చేయూతనిద్దాం : మంత్రి నిరంజన్ రెడ్డి
- జీడీపీలో అసోం వాటా పెరిగేవరకూ అలసట లేని పోరు : అమిత్ షా