ఆన్ & ఆఫ్ సక్సెస్

- సాగర్ ఆయకట్టులో సత్ఫలితాలు
- సీఎం కేసీఆర్ ఆలోచనతో
- ఆరేండ్ల నుంచి అమలు
- భారీగా నీటి పొదుపు..
- చివరి భూములకూ సాగునీరు
- నేల ఆరుతుండడంతో
- తగ్గిన చీడపీడలు
- దిగుబడి పెరిగిందంటున్న రైతులు
- ఆరేండ్ల కింద డెడ్‌స్టోరేజీలో సాగర్
ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసేందుకు తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్ సత్ఫలితాలను ఇస్తున్నది. అప్పటివరకూ ఉమ్మడి రాష్ట్రంలో నీటి కేటాయింపుల్లో అన్యాయాలు, నీళ్లున్నా ఇవ్వక ఎండిన పంటలను చూసిన రైతులు మొదట్లో కొంత ఆందోళన చెందినా.. ఇప్పుడు వారబందీ ఫలితాలను చూసి భేష్ అంటున్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనతో
ప్రయోగాత్మకంగా తీసుకొచ్చిన విధానం నీటి వృథాను అడ్డుకుని అన్నదాతకు వచ్చే సీజన్‌పైనా ఆశలు కల్పిస్తున్నది. కాల్వల ఆధునీకరణ మొదలు ప్రణాళికాబద్ధంగా నీటి విడుదల షెడ్యూల్ ఉండడంతో చివరి భూములకూ
నీరందుతున్నది. వారంపాటు నేల ఆరుతుండడం వల్ల పైరు ఆరోగ్యంగా ఉండి, చీడపీడలు తగ్గి.. దిగుబడి కూడా పెరుగుతున్నది.
నీటి పొదుపుపై ఆలోచన పెరిగింది
వారబందీ పద్ధతిలో పొలాలకు నీళ్లు మంచిగ సరిపోతున్నయి. చివరి భూములకు కూడా అందుతున్నయి. మేంగూడ నీళ్లు పొదుపుగా వాడుకుంటున్నం. జాగ్రత్తగ వాడుకుంటే మళ్ల కారుకు మనకే ఉంటయనే ఆలోచన రైతుల్లో పెరిగింది. పొలాలకు రోగాలు కూడా తగ్గినయి. పంటలు ఆరి, పారడం వలన మంచి దిగుబడి వస్తున్నది.
తెగుళ్ల బెడద తగ్గింది
సాధారణంగా ఎకరం వరి పండించడానికి ఆయకట్టులో దాదాపు కోటిన్నర లీటర్ల నీటిని ఉయోగిస్తుంటారు. తడి, పొడి విధానంలో అయితే 40 శాతం నీరు ఆదా అవుతుంది. నిజానికి వరి నీటి మొక్క కాదు. నీటిలోనూ పెరుగగల మొక్క. అలాంటి పంటను ఎప్పుడూ నీటిలో ఉంచితే శ్వాసక్రియ సరిగ్గా ఉండదు. దాంతో పిలకలు బాగా రాక దిగుబడి తగ్గుతుంది. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది వరి గంట దృఢంగా తయారవుతుంది. గాలులు వీచినా పంట పడిపోదు. పురుగులు, తెగుళ్ల తాకిడి తగ్గుతుంది. దిగుబడి పెరుగుతుంది.
- దొంగరి నరేశ్, కేవీకే శాస్త్రవేత్త
ఆన్ అండ్ ఆఫ్ పద్ధతి నాగార్జునసాగర్ ఆయకట్టు రైతాంగానికి వరంలా మారింది. నీటి వృథాను అరికట్టడంతో పాటు వరిలో తెగుళ్ల సమస్యకు అడ్డుకట్ట పడింది. సీఎం కేసీఆర్ ఆలోచన ఫలితంగా ప్రాజెక్టు డెడ్ స్టోరేజీలోనూ వానకాలం పంటకు ఏటా ముందస్తుగా నీటిని విడుదలకు ‘ఆన్ అండ్ ఆఫ్' పద్ధతి కలిసివస్తోంది. గతంలో సాగునీటికి అష్టకష్టాలు పడిన రైతాంగం.. నీటి పొదుపు ఫలితంగా రెండు పంటలు పండిస్తోంది.
నీటి పొదుపుపై అవగాహన...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాదే సీఎం కేసీఆర్ ఆలోచన ఫలితంగా ఆన్ అండ్ ఆఫ్ పద్ధతి ప్రారంభమైంది. ప్రయోగాత్మకంగా 2014-15 వానకాలం సీజన్లో చేపట్టిన ఈ పద్ధతితో ఎడమకాల్వ పరిధిలో భారీగా నీటిని పొదుపు చేయగలిగారు. ఈ విధానంపై ప్రభుత్వం, ఎన్ఎస్పీ అధికారులు ఆయకట్టు రైతులకు అవగాహన కల్పించారు. ప్రతి సీజన్లో తొమ్మిది రోజుల పాటు నీటిని విడుదల చేస్తూ మరో ఆరు రోజులు నిలిపేస్తారు. ఈ పద్ధతి వల్ల తెగుళ్లు తగ్గిపోయి దిగుబడి బాగా వస్తుందని రైతులు అనందం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు మొట్టమొదటి సారిగా సాగర్ ఎడమకాల్వ ఆయకట్టుకు 2014వానకాలం సీజన్లో ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో సాగునీటిని విడుదల చేశారు. డెడ్ స్టోరేజీలోనూ పంటలు కాపాడి నీటి దుబారాను అరికట్టారు. గత పాలకులు లెక్కలు పక్కనపెట్టి మూస ధోరణిలో నీటిని విడుదల చేసేవారు. దీంతో టెయిల్ ఎండ్ భూములకు నీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కానీ, సీఎం కేసీఆర్ ఎడమకాల్వపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఏటా ప్రణాళికాబద్ధంగా షెడ్యూల్ ప్రకటించి నీటి విడుదల కొనసాగిస్తున్నారు. ఈ పద్ధతిని రైతులు సైతం స్వాగతిస్తున్నారు.
ఏఎమ్మార్పీ పరిధిలో 2.5లక్షల ఎకరాలు
నల్లగొండ : ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ) ఆయకట్టుకు సైతం ఆన్‌అండ్‌ఆఫ్ పద్ధతిలో సాగు నీటిని విడుదల చేస్తున్నారు. ఏఎమ్మార్పీ హైలెవల్ ప్రాజెక్టు పరిధిలో 2.20లక్షల ఎకరాలు, లోలెవల్ ప్రాజెక్టు పరిధిలో 50వేల ఎకరాల ఆయకట్టుంది. ప్రతి సీజన్లో ఈ రెండు ప్రాజెక్టులకు 20టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రతి సీజన్లో నాలుగు నెలల పాటు నీటి విడుదల కొనసాగుతుంది. వారం రోజులు ఆన్, మరో వారం రోజులు ఆఫ్ పద్ధతిని కొనసాగిస్తున్నారు. భూమి పూర్తిగా ఆరడంతోపాటు ఆ తర్వాత కొత్త నీరు వచ్చి చేరడంతో దిగుబడి పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
యాసంగిలోనే అధిక దిగుబడి...
ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో వానకాలం కంటే యాసంగి సీజన్లో ఎక్కువగా మేలు జరుగుతుంది. వానకాలంలో అధిక వర్షాలు, తక్కువ ఉష్ణోగ్రత కారణంగా పైరు ఆరక దిగుబడి తగ్గుతుంది. ఎకరానికి 20-25క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తుండగా యాసంగిలో 30-35క్వింటాళ్ల దిగుబడి వస్తున్నది. యాసంగి సీజన్లో వర్ష ప్రభావం లేకపోవడం, అధిక ఉష్ణోగ్రత కారణంగా ఈ పరిస్థితి ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
చివరి భూములకూ నీరు...
ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో చివరి భూములకు సైతం నీరు పుష్కలంగా అందుతున్నది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం సాగర్ కాల్వల ఆధునీకరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించడంతో మేజర్లకు సాఫీగా నీరు విడుదలవుతున్నది. వేలాది ఎకరాల బీడు భూములు సేద్యంలోకి వచ్చాయి.
ఆన్ అండ్ ఆఫ్‌తో చీడపీడలు తక్కువ...
ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చేయడం వల్ల పొలాలకు చీడపీడల తాకిడి తక్కువగా ఉంటుంది. పొలాల్లో నీరు అధికంగా నిల్వ ఉండడం వల్ల దోమపోటుతో పాటు, అనేక రకాల చీడపీడలు సోకుతున్నాయి. ఆరుతడి పద్ధతిలో నీటిని ఉపయోగించడం వల్ల చీడపీడలు రాకుండా పంట ఏపుగా పెరుగుతుంది. ఆశించినస్థాయిలో దిగుబడులు వస్తాయి.
- పోరెడ్డి నాగమణి, మిర్యాలగూడ ఏడీఏ
పంటలు బాగ పండుతున్నయి...
వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేయడం వల్ల పొలాలకు రోగాలు తక్కువ వస్తున్నయి. ఆరేండ్లుగా వారబందీ పద్ధతిలో నీళ్లిస్తున్నరు. రైతులకు కూడా నీళ్లు పొదుపు చేయాలన్న ఆలోచన వచ్చింది. పొదుపు చేస్తేనే మళ్ల తర్వాత కారుకు నీళ్లొస్తయని రైతులకు అర్థమైంది. పొలాలు ఆరుకుంట పారుతుండటం వలన మంచి దిగుబడులు వస్తున్నయి.
- రామచంద్రు, రాయినిపాలెం, మిర్యాలగూడ
నీళ్లకు ఎన్నడు ఇబ్బంది కాలేదు...
తెలంగాణ వచ్చినంక ప్రభుత్వం వారబందీ పద్ధతిలో నీళ్లు ఇడుస్తున్నది. పొలాలకు నీళ్లు మంచిగనే అందుతున్నయి. మా పొలాలు కాల్వ చివరనే ఉన్నా ఎన్నడూ ఇబ్బంది కాలేదు. పొలాలు ఆరుకుంట పారడం వల్ల చీడపీడల బాధలేదు కాబట్టి పంటలు మంచిగ పండుతున్నయి. ఆరేండ్లుగా వారబందీ పద్ధతిలో వరి సాగు చేస్తున్నాం.
- ఎన్.రామయ్య, తక్కెళ్లపాడ్, మిర్యాలగూడ
తాజావార్తలు
- పాక్ క్రికెటర్ అక్మల్‌కు లైన్ క్లియర్..
- మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ
- శీతాకాలం పోతే పెట్రో ధరలు దిగివస్తాయి: పెట్రోలియం మంత్రి
- గవర్నర్ దత్తాత్రేయను తోసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
- గుజరాత్‌కు కాషాయ పార్టీ చేసిందేమీ లేదు : సూరత్ రోడ్‌షోలో కేజ్రీవాల్
- నల్లటి పెదవులు అందంగా మారాలా? ఇవి ట్రై చేయండి
- కుమార్తె ప్రియుడితో పారిపోయిన తల్లి
- టికెట్ డబ్బులు రిఫండ్ ఇవ్వండి..
- రోడ్ షోలో స్కూటీ నడిపిన స్మృతి ఇరానీ.. వీడియో
- నిర్మల్ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు