బుధవారం 27 జనవరి 2021
Nalgonda - Dec 04, 2020 , 03:06:24

అభివృద్ధి కమిటీ సమావేశాలకు జడ్పీటీసీలను ఆహ్వానించాలి

 అభివృద్ధి కమిటీ సమావేశాలకు జడ్పీటీసీలను ఆహ్వానించాలి

  • జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి

నల్లగొండ : మండలాల్లో నిర్వహించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి కమిటీల సమావేశానికి జడ్పీటీసీలను ఆహ్వానించాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి అధికారులకు సూచించారు. స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో గురువారం గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, ఆర్థిక స్థాయీ సంఘాల సమావేశాలకు హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందని, ఈ నిధులు  దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్‌ అధికారులకు సూచించారు. భారీ వర్షాలకు మర్రిగూడలో రోడ్లు తెగిపోయాయని, నాంపల్లిలో రోడ్లు, కల్వర్టులు బాగా దెబ్బతిన్నాయని, వీటి మరమ్మతులకు నిధులు కేటాయించాలని ఆయా మండలాల జడ్పీటీసీలు కోరారు. గుండ్లపల్లిలోని మంచినీటి ట్యాంకుల్లోకి నీటి సరఫరా కావడం లేదని,  మిర్యాలగూడలో ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంకుల లీకేజీతో నీటి వృథా జరుగుతుందని, మాడ్గులపల్లిలో కూలిపోయిన, ధ్వంసమైన విద్యుత్‌ స్తంభాల స్థానంలో కొత్తవి వేయాలని సభ్యులు అధికారులకు సూచించారు. గుండ్లపల్లిలో నిధులు మంజూరైనప్పటికీ ఎందుకు గోదాములు నిర్మించడం లేదని ప్రశ్నించారు. నల్లగొండ పీహెచ్‌సీ చుట్టూ ప్రహరీ నిర్మించాలని  కోరారు. సమావేశంలో జడ్పీ సీఈఓ వీరబ్రహ్మచారి,  అధికారులు పాల్గొన్నారు.

ఉద్యమ వీరుడికి ఘన నివాళి  

నల్లగొండ కల్చరల్‌ : మలి దశ ఉద్యమ వీరుడు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతిని పురస్కరించుకొని గురువారం ఆయనకు  ఘన నివాళి అర్పించారు. నల్లగొండలోని గడియారం సెంటర్‌లోని శ్రీకాంతాచారి విగ్రహానికి జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి పూలమాల వేసి నివాళుల్పరించారు. విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం నాయకుడు గుంటోజు వెంకటాచారి, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు కట్టె శివ, దుడుకు లక్ష్మీనారాయణ, విశ్వబ్రాహ్మణ నాయకులు కృష్ణామాచారి, పర్వతం నరేంద్రబాబు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అలాగే విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ, విశ్వకర్మ తేజస్విని సంస్థల ఆధ్వర్యంలో  నివాళులర్పించారు. కార్యక్రమంలో పెందోట సోము, రవీంద్రాచారి, లక్ష్మాణాచారి తదితరులు పాల్గొన్నారు. logo