శనివారం 23 జనవరి 2021
Nalgonda - Dec 03, 2020 , 02:25:23

దేశానికే రోల్‌మోడల్‌గా తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌

దేశానికే రోల్‌మోడల్‌గా తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌

  • జన అదాలత్‌తో ఎస్సీ, ఎస్టీల గడప వద్దకు న్యాయం 
  • కమిషన్‌ ద్వారా అట్రాసిటీ బాధితులకు రూ.55.64 కోట్ల పరిహారం 
  • రెండేళ్లల్లో 8వేలకు పైగా కేసుల పరిష్కారం
  • విలేకరుల సమావేశంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌

నీలగిరి : సీమాంధ్రుల పాలనలో రాష్ట్ర రాజధానికే పరిమితమైన ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను తెలంగాణ దళిత, గిరిజనుల గడప దగ్గరకు చేర్చి దేశానికే రోల్‌మోడల్‌గా మార్చడం జరిగిందని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం నల్లగొండలోని జిల్లా పరిషత్‌ అతిథిగృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాటారు. సీమాంధ్రుల పాలనలో తెలంగాణ ప్రాంతం ఏవిధంగా వివక్షకు గురైందో దళిత, గిరిజనులు కూడా అదేవిధంగా వివక్షకు గురయ్యారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దళిత, గిరిజనుల వద్దకు వెళ్లి వారి సమస్యల పరిష్కారానికి కమిషన్‌ కృషి చేస్తోందన్నారు. గతంలో 10500 కేసులు పెండింగ్‌లో ఉంటే 8వేల పైచిలుకు కేసులను పరిష్కరించి రూ.55.64 కోట్ల పరిహారాన్ని బాధితులకు అందజేసి వారిలో భరోసా నింపిందన్నారు. జిల్లా విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీలు 29జిల్లాలో నిర్వహించి ఇతర రాష్ర్టాలకు మోడల్‌గా నిలిచిందన్నారు. 57కోర్టు కేసులు హియరింగ్‌ చేసి 85శాతం న్యాయంచేయడం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా దళిత, గిరిజనుల వద్దకే న్యాయం తీసుకెళ్లడం కోసం జన అదాలత్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఖమ్మం, కొత్తగూడెం, గద్వాల, అలంపూర్‌ జిల్లాలకు వెళ్లి అక్కడ ఎస్సీ, ఎస్టీ కేసులను పరిష్కరించినట్లు పేర్కొన్నారు. దళిత, గిరిజనులకు పైసా ఖర్చు లేకుండా ఉచితంగా న్యాయ సహాయం చేస్తున్నామన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వచ్చేనెలలో నల్లగొండ జిల్లాలో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ డ్రైవ్‌లో దళిత, గిరిజనుల సమస్యలు, కోర్టు పరిష్కారాలు తదితర విషయాలను కలెక్టర్‌, ఎస్పీతో చర్చించడం జరుగుతుందన్నారు. అంతకుముందు  ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతికి ఆయన సంతాపం తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడు విద్యాసాగర్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఇరిగి పెద్దులు, నాయకులు తుంగబాలు, మైనంపల్లి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


logo