సోమవారం 08 మార్చి 2021
Nalgonda - Dec 03, 2020 , 02:18:13

నేడు ఎమ్మెల్యే నోముల అంతిమ యాత్ర

నేడు ఎమ్మెల్యే నోముల అంతిమ యాత్ర

 • సీఎం కేసీఆర్‌
 • లాంఛనాలతోనిర్వహణకు ఏర్పాట్లు
 • వ్యవసాయ క్షేత్రంలో నిర్వహణ
 • నుంచి పాలెం వరకుఅంతిమయాత్ర
 • మంత్రులు, ఎమ్మెల్యేలు
 • పోలీసు బందోబస్తు
 • పరామర్శల వెల్లువ
 • ఘన నివాళి 

నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలు గురువారం ఆయన స్వగ్రామమైన నకిరేకల్‌  పాలెంలో జరుగనున్నాయి. తన వ్యవసాయ క్షేత్రంలో జరిగే దహన సంస్కారాలను ఉదయం 11గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నర్సింహయ్యకు నివాళులర్పించి కడసారి వీడ్కోలు పలికేందుకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు రానున్నారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరానున్నారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, ఎస్పీ రంగనాథ్‌, నర్సింహయ్య కుమారుడు భగత్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీఎం రాక కోసం ప్రత్యేకంగా హెలీప్యాడ్‌ను, వాహనాల పార్కింగ్‌కు స్థలం కేటాయించారు. భారీగా తరలివచ్చే పార్టీ కార్యకర్తలు, అభిమానులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు.  బుధవారం జిల్లా వ్యాప్తంగా నోముల నర్సింహయ్య చిత్రపటానికి టీఆర్‌ఎస్‌ శ్రేణులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. నకిరేకల్‌లోని ఆయన నివాసంలో కుటుంబ సభ్యులను పలువురు పరామర్శించారు. 

నోముల వాయిస్‌తో ఫేక్‌ ఆడియో!

 • సోషల్‌ మీడియాలో వైరల్‌
 • ఎస్పీకి ఫిర్యాదు చేసినకుమారుడు భగత్‌
 • అభిమానంతో తానే మిమిక్రీ చేశానంటూ పీఎన్‌ఎం కళాకారుడు కొండల్‌ వివరణ
 • దర్యాప్తు జరుపుతున్న నకిరేకల్‌ పోలీసులు

ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణ వాంగ్మూలం పేరిట రెండు ఆడియో టేపులు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. బుధవారం ఉదయం నుంచి ఈ ఆడియో క్లిప్పింగ్‌లు వాట్సాప్‌ గ్రూపులతో పాటు ఇతర సోషల్‌ మీడియా వేదికలపైనా చక్కర్లు కొట్టడం సర్వత్రా  చర్చనీయాంశమైంది. వివాదాస్పదం అవుతున్న తరుణంలో ఈ వాయిస్‌కు తానే కారణమంటూ కోదాడకు చెందిన ప్రజానాట్యమండలి మిమిక్రీ కళాకారుడు ఏడుకొండలు అంగీకరించాడు. నర్సింహయ్య మీద ఉన్న ప్రేమతోనే ఆడియో చేశానని.. దీని వల్ల ఎవరికైనా బాధ కలిగి ఉంటే క్షమించాలని విజ్ఞప్తి చేశాడు.  

- నల్లగొండ ప్రతినిధి, నమస్తే తెలంగాణ 

 • హాజరుకానున్న సీఎం కేసీఆర్‌ 
 • అధికార లాంఛనాలతో నిర్వహణకు ఏర్పాట్లు 
 • పాలెంలలోని వ్యవసాయ క్షేత్రంలో నిర్వహణ 
 • నకిరేకల్‌ నుంచి అంతిమయాత్ర ప్రారంభం 

నల్లగొండ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. నోముల మృతితో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. ఆయన చిన్న కుమార్తె అమెరికాలో ఉండడంతో ఆమె వచ్చాకే అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు భావించారు. మంగళవారం హైదరాబాద్‌లోని కొత్తపేట నివాసం, అక్కడి నుంచి హాలియాలోని నివాసానికి నర్సింహయ్య మృతదేహాన్ని తరలించారు. కొత్తపేటలో మండలి చైర్మన్‌ గుత్తా, మంత్రి కేటీఆర్‌, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నోముల పార్థివదేహానికి నివాళులర్పించారు. హాలియాలో జిల్లా ప్రముఖులతోపాటు పార్టీ శ్రేణులు, అభిమానులు, వివిధ పార్టీల నేతలు కడసారిచూపునకు తరలివచ్చారు. అనంతరం రాత్రి హాలియా నుంచి ప్రత్యేక వాహనంలో మృతదేహాన్ని నార్కట్‌పల్లిలోని కామినేని దవాఖానకు తరలించారు. చిన్న కూతురు బుధవారం రాత్రి నకిరేకల్‌ చేరుకోనుండడంతో అప్పటివరకు మృతదేహాన్ని కామినేనిలో భద్రపరిచారు. నేడు ఉదయం నర్సింహయ్య మృతదేహాన్ని నకిరేకల్‌లోని స్వగృహానికి తరలించనున్నారు. అక్కడే ఉదయం 8గంటల వరకు స్థానికుల సందర్శనార్దం ఉంచనున్నారు. అక్కడి నుంచి అంతిమయాత్రగా స్వగ్రామం పాలెంకు తరలించనున్నారు. సుమారు ఏడు కిలోమీటర్ల మేర అంతిమయాత్ర కొనసాగనుంది. దారి పొడవునా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. పాలెంలోని సొంత వ్యవసాయ క్షేత్రం పక్కనే నర్సింహయ్య కుటుంబం ప్రత్యేకంగా స్మృతివనం ఏర్పాటు చేయగా, అందులోనే అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తిచేశారు. 

సీఎం కేసీఆర్‌ రాక..

అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలెం రానున్నారు. హైదరాబాద్‌ నుంచి హెలిక్యాప్టర్‌లో పాలెం చేరుకోనున్నట్లు జిల్లా ఎస్పీ రంగనాథ్‌ తెలిపారు. అంత్యక్రియలు జరిగే ప్రాంతానికి కొద్దిదూరంలోనే హెలిప్యాడ్‌ ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్‌ నర్సింహయ్య మృతదేహానికి నివాళులర్పించి అంత్యక్రియలు ముగిసే వరకు ఉంటారని భావిస్తున్నారు. సీఎం రానుండడంతో జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌, ఎస్పీ రంగనాథ్‌, స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కుమారుడు భగత్‌లతో కలిసి బుధవారం ఏర్పాట్లను పరిశీలించారు. నకిరేకల్‌ నుంచి పాలెం వరకు దారి పొడవునా పర్యటించి తీసుకోవాల్సిన చర్యలను అధికారులకు ఆదేశించారు. సీఎంతోపాటు మంత్రులు, ఇతర ప్రముఖులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులు, బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. 500మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.   

విశ్వసనీయతకు 

మారు పేరు నోముల : నేతి  

కట్టంగూర్‌(నకిరేకల్‌)/నార్కట్‌పల్లి : అకాల మరణం చెందిన నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం నిత్యం తపించే గొప్ప విశ్వసనీయత గల నాయకుడని శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ అన్నారు. బుధవారం మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి నకిరేకల్‌ మండలం పాలెంలో నర్సింహయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం నర్సింహయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నర్సింహయ్య మృతి బాధాకరమని, ఆయన మరణం టీఆర్‌ఎస్‌ పార్టీకి తీరని లోటన్నారు. అనంతరం నార్కట్‌పల్లిలోని కామినేని వైద్యశాలలో భద్రపర్చిన నోముల పార్థివదేహాన్ని నేతి సందర్శించారు. నోముల కుమారుడు భగత్‌ను పరామర్శించారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, ఎంపీటీసీ పుల్లెంల ముత్తయ్య, మల్గ బాలకృష్ణ, శ్రీధర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు.  


VIDEOS

logo