శనివారం 16 జనవరి 2021
Nalgonda - Dec 01, 2020 , 02:41:57

నేడు ‘పట్టభద్రుల’ ఓటర్ల జాబితా ప్రదర్శన

నేడు ‘పట్టభద్రుల’ ఓటర్ల జాబితా ప్రదర్శన

  • మూడు జిల్లాల్లోని 546కేంద్రాల్లో అందుబాటులో..
  • నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌లో 5.17లక్షల దరఖాస్తులు
  • పరిశీలన అనంతరం 50వేలకుపైగా తిరస్కరణ
  • డిసెంబర్‌ 31వరకు మరోసారి దరఖాస్తుకు అవకాశం
  • జనవరి 1వరకు పరిష్కారం.. 18న తుది జాబితా

నల్లగొండ: నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం పట్టభద్రుల శాసన మండలి స్థ్దానానికి పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి 21తో ముగియనుంది. దీంతో ఎన్నికల యంత్రాంగం పట్టభద్రుల ఓటు హక్కు కోసం అక్టోబర్‌ ఒకటి నుంచి నవంబర్‌ 6 వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఆయా జిల్లాల్లో మొత్తం గ్రాడ్యూయేట్ల నుంచి 5.17 లక్షల దరఖాస్తులు వచ్చాయి.ఈ దరఖాస్తులను ఎన్నికల యంత్రాంగం బీఎల్‌ఓల ద్వారా ఈ నెల 25 వరకు విచారణ చేసి పలు కారణాలతో 50 వేల దరఖాస్తులను తిరస్కరించగా 4.67 లక్షల దరఖాస్తు దారులకు ఓటు హక్కు కల్పించారు. దీనికి సంబంధించిన ఓటరు ముసాయిదా జాబితాను నేడు 546 పోలింగ్‌ కేంద్రాలతో పాటు మండల కేంద్రాల్లో, ఆర్డీఓ కార్యాలయాల్లో, కలెక్టరేట్‌లో ప్రచురించనున్నారు. ఇందుకు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్‌, డివిజన్ల వారీగా ఆర్డీఓలు, మండలాల వారీగా తాసీల్దార్లు ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్నారు. 

546 కేంద్రాల్లో ఓటరు ముసాయిదా జాబితా ..

శాసన మండలి పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన ఎన్నికల యంత్రాంగం ఉమ్మడి మూడు జిల్లాల్లో నేడు ఓటరు ముసాయిదా జాబితాను ప్రచురించనుంది. మూడు జిల్లాల పరిధిలో ఉన్న నూతన 12 జిల్లాల్లో 546 పోలింగ్‌ కేంద్రాలతో పాటు   తాసీల్దార్లు, ఆర్డీఓ, కలెక్టరేట్‌ కార్యాలయాల్లో ఈ ముసాయిదా జాబితాను ప్రచురించనున్నారు. ఈ ఓటరు జాబితాపై ఎలాంటి అభ్యంతరాలున్నా ఈ నెల 31 వరకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదులు సమర్పించవచ్చు.  ఈ నెల 31 వరకు మరో దఫా ఓటు దరఖాస్తుకు అవకాశం..

శాసన మండలి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఆధారంగా నవంబర్‌ ఆరుతో ఓటు కోసం దరఖాస్తులు పూర్తయినప్పటికీ నేటి నుంచి ఈ నెల 31 వరకు మరో దఫా చేసుకునే అవకాశం ఎన్నికల సంఘం ఇచ్చింది. ప్రస్తుతం చేసుకున్న దరఖాస్తులను ఎలక్టోరల్‌ అధికారులుగా నియమించిన డీఆర్వో, ఆర్డీఓలు, తాసీల్దార్లు ఈ నెల 25 వరకు పరిశీలించి నేడు ముసాయిదా ఓటరు జాబితాను ఆయా తాసీల్దార్‌, ఆర్డీఓ కార్యాలయాలతో పాటు 546 పోలింగ్‌ కేంద్రాల్లో ప్రచురించనున్నారు. ఈ జాబితా పై డిసెంబర్‌ 31 వరకు ఫారం 7, 8,8(ఏ) ల ద్వారా అభ్యంతరాలు, మార్పులు, చేర్పుల దరఖాస్తులు తీసుకోవడంతో పాటు నూతనంగా ఓటు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఫామ్‌ 18 ద్వారా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో చేసుకోవచ్చు. వీటిని తిరిగి జనవరి 12వ తేదీ లోగా పరిష్కారాలు చూపి 18 వ తేదీన తుది జాబితా విడుదల చేయనున్నారు.