ప్రజల చెంతకే కరోనా పరీక్షలు

- సెకండ్ వేవ్ నేపథ్యంలో విస్తృత
- రంగంలోకి మొబైల్ టెస్టింగ్ వాహనాలు
- వివాహాలు, శుభకార్యాల వద్ద పరీక్షలకు సిద్ధం
- అపార్ట్మెంట్లు, జనసమూహాల వద్దకు..
- నిత్యం ఐదు వేల టెస్టుల కోసం ప్రణాళిక
నల్లగొండ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కరోనా వ్యాప్తి కట్టడికి జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీగా వ్యవహరించింది. ఈ ఏడాది ఏప్రిల్ 2న ఒకేరోజు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో తొలి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా చర్యలు చేపడుతూ వచ్చారు. ఇప్పటివరకు నల్లగొండ జిల్లాలో 19,722 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 19,023 మంది ప్రభుత్వ వైద్య సేవలతో సురక్షితంగా ఇంటికి చేరారు. 70 మంది మృతిచెందగా.. ప్రస్తుతం 629 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జూలైలో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఆగస్టులో ఇంకా పెరిగి సెప్టెంబర్‌లో తారాస్థాయికి చేరింది. అక్టోబర్‌లో కొంత తగ్గుముఖం పట్టగా.. నవంబర్‌లో కేసుల సంఖ్య భారీగా తగ్గిపోయింది.
సూర్యాపేట జిల్లాలో శనివారం నాటికి మొత్తం 1,14,341 టెస్టులు చేయగా.. అందులో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక్కడ కూడా ఒక్క సెప్టెంబర్‌లోనే 7,166 కేసులు రాగా.. నవంబర్‌లో ఇప్పటివరకు 1360 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే.. రెండు నెలలుగా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రజల్లోనూ అజాగ్రత్త, అలసత్వం ఏర్పడింది. ఇదే కొనసాగితే సెకండ్ వేవ్ వస్తే ఇబ్బందికరంగా మారనుంది. ప్రపంచ వ్యాప్తంగా సెకండ్ వేవ్‌గా కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటించింది. దేశంలోని ఢిల్లీ, కేరళ లాంటి రాష్ర్టాల్లోనూ తాజాగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. దీంతో అన్ని రాష్ర్టాలను ఐసీఎంఆర్ అప్రమత్తం చేసింది. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమైంది. నిత్యం ఐదు వేల టెస్టులు ఒక్క నల్లగొండ జిల్లాలోనే నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం దవాఖానలతోపాటు 24 వాహనాలను సిద్ధం చేశారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు వాహనాలతోపాటు ఇప్పటికే ఉన్న ‘104’ వాహనాలను కూడా పరీక్షల కోసం వినియోగించనున్నారు. అంటే నియోజకవర్గానికి నాలుగు వాహనాలు అందుబాటులోకి రానున్నాయి.
నిత్యం ఐదు వేల టెస్టులు...
జిల్లాలో నిత్యం ఐదు వేల పరీక్షలకు తగ్గకుండా చేయాలని నిర్ణయించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని జనరల్ దవాఖానలో 200 ర్యాపిడ్ పరీక్షలతోపాటు మరో 200 ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్ణయించారు. నల్లగొండలోని మూడు అర్బన్ హెల్త్ సెంటర్లు, మిర్యాలగూడలోని రెండు అర్బన్ హెల్త్ సెంటర్లు, దేవరకొండ, మిర్యాలగూడ, సాగర్‌లోని ఏరియా దవాఖానలు, మర్రిగూడ, నకిరేకల్‌లోని ఒక్కో కమ్యూనిటీ హెల్త్సెంటర్తోపాటు 31 పీహెచ్‌సీల్లోనూ ఇప్పటికే పరీక్ష కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటిలో కలిపి ప్రతిరోజూ 2,350 మందికి పరీక్షలు చేయాలని నిర్దేశించారు. అదనంగా 24 పరీక్ష కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. వీటి ద్వారా కనీసం మరో 2500 పరీక్షలు నిర్వహించాలని సన్నాహాలు చేశారు. ఇదే రకమైన ప్రణాళికతో సూర్యాపేట జిల్లా యంత్రాంగం కూడా సన్నద్ధమవుతున్నది. పూర్తి స్థాయి ఏర్పాట్లతో రెండు, మూడ్రోజుల్లో ప్రజలకు విస్తృతంగా పరీక్షలను అందుబాటులోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే సూర్యాపేటలోని మెడికల్ కళాశాల దవాఖానలో ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నారు. వీటికితోడు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ పరీక్షలు చేస్తున్నారు. ఇక్కడ 16 మొబైల్ పరీక్షా కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేస్తున్నారు. ఆదివారం కరోనా పరీక్షలపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో కరోనా టెస్టులపై పూర్తిస్థాయి ప్రణాళికను నిర్ణయించనున్నారు. 24మొబైల్ వాహనాలకు ప్రత్యేక ఫోన్ నెంబర్‌ను కేటాయించారు. ఈ నెంబర్లను ప్రజలకు తెలిపేందుకు ప్రచారం చేపడుతున్నారు. కనీసం 20మంది పరీక్షలకు సిద్ధంగా ఉంటే చాలు.. అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, జనసమూహ ప్రాంతాలు, ఫంక్షన్ హాళ్లు... ఇలా ఎక్కడికి పిలిచినా వెంటనే వస్తారు. అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించి వెంటనే ఫలితం కూడా తెలియజేయనున్నారు.
విస్తృతంగా పరీక్షలు..
సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాం. అందుకోసం పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాలని నిర్ణయించాం. రోజుకు ఐదు వేలు లక్ష్యంగా ముందుకు సాగుతాం. ఇప్పటికే ఉన్న పరీక్షా కేంద్రాలతోపాటు మొబైల్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. 24 ప్రజల వద్దకే వెళ్లి పరీక్షలు చేస్తాయి. ఈ అవకాశాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.
- డాక్టర్ ఎ.కొండల్రావు,
డీఎంహెచ్ఓ, నల్లగొండ