శనివారం 23 జనవరి 2021
Nalgonda - Nov 29, 2020 , 00:55:52

ఎస్సీ, ఎస్టీ చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి

ఎస్సీ, ఎస్టీ చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి

  • సబ్‌ప్లాన్‌ నిధులు పూర్తిగా వినియోగించుకోవాలి
  • ఉద్దేశపూర్వకంగా అట్రాసిటీ కేసులు పెట్టొద్దు..
  • కమిషన్‌ సభ్యుడు చిలకమర్రి నర్సింహ

నల్లగొండ : ఎస్సీ, ఎస్టీ చట్టాలపై దళితులు, గిరిజనులు పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకొని సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడు చిలకమర్రి నర్సింహ సూచించారు. శనివారం కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో ఎస్సీ, ఎస్టీ చట్టాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చి 74 సంవత్సరాలు అవుతున్నా ఇంకా ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరగడం దారుణమన్నారు. ఇప్పటికీ మారుమూల ప్రాంతాలతోపాటు అభివృద్ధి చెందిన పట్టణాల్లోనూ దళితులు, గిరిజనులపై దాడులు చేయటం, వారి భూములు కబ్జా చేయడం జరుగుతుందని ఈ విషయంలో అధికారులు పారదర్శకంగా పనిచేసి ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీల హక్కులను కాలరాస్తే ఉపేక్షించేది లేదని, ఎక్కడైనా అలాంటి సంఘటనలు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అయితే ఎస్సీ, ఎస్టీలు కూడా ఇతరులపై అనవసరంగా కేసులు పెట్టడం సరికాదని, అట్రాసిటీ కేసును దుర్వినియోగం చేయకూడదని అన్నారు. ప్రధానంగా కోర్టుల్లో ఉన్న కేసుల్లో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీలకు సంబంధించివే  ఉన్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీలలో సమన్వయం ఇంకా రావాల్సిన అవసరం ఉందని ఐక్యతతో ఉంటేనే ప్రగతి ఫలాలు అందుతాయన్నారు. అంబేద్కర్‌ చొరవతో నేడు రిజర్వేషన్ల అమలు కొనసాగుతున్నందున చట్టసభల్లోనూ ఎస్సీ, ఎస్టీలు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక అవుతున్నారన్నారు. మహిళలను పూర్తిస్థాయిలో ప్రోత్సహించాలని, ప్రజాప్రతినిధుల స్థానంలో వారి భర్తలు పెత్తనం చేయడం సరికాదన్నారు. బంగారు తెలంగాణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ సబ్‌ప్లాన్‌ కింద పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నందున వీటిని పూర్తిస్థాయిలో అర్హులకు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు. సబ్‌ప్లాన్‌ నిధులను దళితవాడల్లోనే ఖర్చుపెట్టాలని, దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రజాప్రతినిధులు పార్టీలకతీతంగా కృషి చేయాలన్నారు. 

ప్రజాప్రతినిధుల విన్నపాలు.. 

సదస్సుకు హాజరైన ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులు ఆయా ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న పలు సమస్యలపై కమిషన్‌ సభ్యుడు నర్సింహకు విన్నవించారు. నల్లగొండ మండలంలోని దీపకుంటలో సర్పంచ్‌ ఎస్సీ కావటంతో ఉపసర్పంచ్‌, కొందరు వార్డు సభ్యులు ఏకమై సర్పంచిని ఏ పనీ చేయనివ్వడం లేదన్నారు. కనగల్‌ మండలంలోని తేలకంటిగూడెం, నల్లగొండ శివారులోని మర్రిగూడెంలో ఎస్సీల భూములను ఆక్రమించారని విన్నవించారు. వీటిపై వెంటనే స్పందించిన నర్సింహ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సదస్సులో డీఆర్‌ఓ జగదీశ్వర్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ డీడీ రాజ్‌కుమార్‌, డీఎస్‌ఓ రుక్మిణీదేవి, డీఈఓ భిక్షపతి, జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, ఎంపీపీ సుమన్‌, డీపీఆర్‌ఓ శ్రీనివాస్‌, నల్లగొండ మున్సిపల్‌ కమిషనర్‌ శరత్‌చంద్ర, ఎస్టీ డీడీ ఫిరంగి తదితరులు పాల్గొన్నారు. 

జిల్లా కేంద్ర దవాఖాన పరిశీలన..

ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడు నర్సింహ నల్లగొండ జిల్లా కేంద్ర దవాఖానను సందర్శించి పలు వార్డులను పరిశీలించారు. ఆయా వార్డుల్లో రోగులతో మాట్లాడారు. దవాఖానలో సేవలు సక్రమంగా అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట దవాఖాన సూపరింటెండెంట్‌ నర్సింహ, డీసీహెచ్‌ఎస్‌ మాతృ ఉన్నారు.logo