శనివారం 23 జనవరి 2021
Nalgonda - Nov 21, 2020 , 00:53:17

జిల్లాలో గణనీయంగా పెరిగిన సన్నరకం వరి

జిల్లాలో గణనీయంగా పెరిగిన సన్నరకం వరి

  • ఆయకట్టులో 80శాతానికి పైగా సన్నాలే సాగు 
  • మార్కెట్లోకి నూతన వరి వంగడాలు.. 
  • అతివృష్టిలోనూ భారీగా ధాన్యం దిగుబడి
  • జీనెక్స్‌ ‘చంద్రముఖి’ విత్తన వెరైటీతో సత్ఫలితాలు
  • పచ్చిధాన్యం కొనుగోళ్లతో అన్నదాతలకు మేలు

నల్లగొండ నెట్‌వర్క్‌: నల్లగొండ ఉమ్మడి జిల్లాలో వరిసాగు భారీగా పెరిగింది. ఓ వైపు నాగార్జునసాగర్‌ ఆయకట్టులో కృష్ణా జలాలు, మరోవైపు ఎస్సారెస్పీ కాల్వల ద్వారా గోదావరి నీళ్లు.. అదనంగా మూసీ ఆయకట్టులోనూ వరి పెద్ద ఎత్తున సాగైంది. రైతులు స్వల్ప కాలిక పంటలపై దృష్టి సారించడంతో పాటు సన్నాలు ఎక్కువగా సాగుచేశారు. సన్న రకం తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి ఇవ్వడంతో పాటు వ్యాపారులు పచ్చిధాన్యమే కొనుగోలు చేయడం వల్ల రైతులకు మేలు జరుగుతోంది. సర్కారు సూచన మేరకు వ్యవసాయ శాస్త్రవేత్తలు స్వల్ప కాలిక సన్నరకం వెరైటీలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో పలు ప్రైవేటు కంపెనీలు సైతం తక్కువ సమయంలోనే ఎక్కువ దిగుబడి వచ్చేలా విత్తనాలను బ్రీడింగ్‌ చేశాయి. జీనెక్స్‌ సీడ్స్‌ కంపెనీకి  చెందిన చంద్రముఖి వరి 130రోజుల్లోనే చేతికి వస్తుండటంతో గత యాసంగి, తాజా వానకాలం సీజన్లలో సాగు పెరిగింది. సాధారణంగా సన్న రకం వెరైటీలు బీపీటీ 5204, నెల్లూరు సాంబ లాంటి రకం విత్తనాల పంటకాలం 140నుంచి 150రోజులు ఉంటుంది. గతంలో నీటి సౌకర్యం ఎక్కవ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే సాగయ్యేవి. పంట కాలం ఎక్కువగా ఉండటంతో తెగుళ్ల బెడద అధికంగా ఉండేది. పురుగు మందులు స్ప్రే చేయాల్సి రావటంతో అదనంగా ఖర్చయ్యేది. దిగుబడి సైతం ఎకరాకు సగటున 30నుంచి 35బస్తాలు చేతికందేది. ఈ నేపథ్యంలో కుటుంబ అవసరాలు పోను రైతులు 120రోజుల్లో చేతికి వచ్చేటువంటి దొడ్డు రకాలపై ఆధారపడ్డారు. అయితే సన్నాల అవసరం ఎక్కువగా ఉండటంతో వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సన్నాల పంట కాలాన్ని తగ్గించే విధంగా బ్రీడింగ్‌ చేశారు. ప్రైవేట్‌ కంపెనీలు సైతం ప్రభుత్వ వెరైటీలకు అనుగుణంగా విత్తనాలను బ్రీడింగ్‌ చేసి పంటకాలం తగ్గించాయి. ఇటీవల జీనెక్స్‌ సీడ్స్‌ కంపెనీకి చెందిన చంద్రముఖి వెరైటీ సత్ఫలితాలు ఇస్తుండడంతో ఆయకట్టు రైతులు పెద్ద ఎత్తున సాగు చేశారు. ధాన్యం పచ్చిగా ఉన్నప్పుడే మిల్లర్లు కొనుగోలు చేయడంతో టన్నేజీ కూడా బాగా వచ్చిందని చెప్తున్నారు. 

పచ్చి ధాన్యం కొనుగోలు చేస్తున్నందునే మరింత డిమాండ్‌...

ఆయకట్టు పరిధిలోని నాగార్జునసాగర్‌, మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌, కోదాడ నియోజకవర్గాల్లో సన్న వెరైటీలే 80శాతం మేరకు సాగు చేసినట్లు వ్యవసాయ యంత్రాంగం చెబుతోంది. పంట కోసిన వెంటనే ఈ వెరైటీలకు సంబంధించిన ధాన్యం నేరుగా మిల్లులకు చేరవేస్తున్నారు. 25శాతానికి పైగా తేమ ఉన్నప్పటికీ మిల్లర్లు కొనుగోలు చేశారు. క్వింటాల్‌కు రూ.1800నుంచి రూ.2,000వరకు ధర లభించిందని, గత రెండు సీజన్లలో పూజిత, సోనాలి వెరైటీతో పాటు చంద్రముఖి 45నుంచి 50బస్తాలకు పైగా దిగుబడి వచ్చిందని రైతులు తెలిపారు. 

అతివృష్టిలోనూ ఆశించిన ఫలితాలు... 

జిల్లా వ్యాప్తంగా ఈ వానకాలం సీజన్‌లో అదనపు వర్షపాతం నమోదైంది. అక్టోబర్‌లో కురిసిన వర్షాలకు వరి నేలవాలింది. కోతకొచ్చిన పొలాలు చేతికందని పరిస్థితి ఏర్పడింది. అయితే, పచ్చి ధాన్యమే విక్రయించే వెసులుబాటు ఉండడంతో చైన్‌ మిషన్లతో కోసిన వెంటనే మిల్లులకు తరలించారు. ఆయకట్టుతో పాటు నాన్‌ ఆయకట్టులోనూ అంచనాకు మించి సన్నాలు ఉత్పత్తి కావడంతో కొనుగోళ్లలో మిల్లర్ల నుంచి కొర్రీలు ఎదురయ్యాయి.

పది ఎకరాల్లో 450బస్తాల సన్నధాన్యం దిగుబడి

ఈ సీజన్‌లో నేను జీనెక్స్‌ కంపెనీకి చెందిన చంద్రముఖి సన్న రకం వెరైటీ సాగు చేశాను. ఎకరానికి 45బస్తాల చొప్పున దిగుబడి వచ్చింది. పంట వేసిన తర్వాత 130రోజుల్లోనే చేతికి రావడంతో తెగుళ్ల సమస్య కూడా లేదు. పచ్చి ధాన్యమే కొనుగోలు చేయడంతో పాటు క్వింటాల్‌కు రూ.1900చెల్లించారు. యాసంగిలో నాలుగు ఎకరాల్లో మళ్లీ సాగు చేస్తున్నాను. 

- పుట్టల శ్యాంసన్‌, వేములపల్లి, నల్లగొండ జిల్లా

పచ్చి ధాన్యం కొనుగోలు చేయడం వల్లనే మంచి జరిగింది..

ఇంతకు ముందు సన్న రకాలు సాగు చేస్తే ఐదు నెలల తర్వాత పంట చేతికొచ్చేది. ఈ సారి జీనెక్స్‌ సీడ్స్‌ చంద్రముఖి విత్తనాలు రెండు ఎకరాల్లో సాగు చేశాను. 130రోజుల్లోనే దిగుబడి వచ్చింది. పచ్చిగా ఉన్నా క్వింటాల్‌కు రూ.1900 పెట్టినరు. నేను గత యాసంగిలో రెండు ఎకరాల్లో పూజిత, సోనాలి సన్న రకం విత్తనాలు సాగు చేస్తే మంచి పంట పండింది. ఈ సారి ఎకరాకు 46బస్తాల చొప్పున దిగుబడి వచ్చింది. 

- కుర్ర శ్రీనివాస్‌, మొల్కచర్ల, అడవిదేవులపల్లి


logo