మంగళవారం 01 డిసెంబర్ 2020
Nalgonda - Oct 31, 2020 , 02:36:38

ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్న రైతులు

ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్న రైతులు

కొనుగోళ్లు చేపట్టేందుకు సన్నద్ధమైన అధికారులు 

కట్టంగూర్‌: నకిరేకల్‌ నియోజకవర్గ వ్యాప్తంగా వానకాలం వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. చిట్యాల, నార్కట్‌పల్లి, కట్టంగూర్‌, నకిరేకల్‌, కేతేపల్లి మండలాల్లో 20 రోజుల క్రితమే వరికోతలు మొదలయ్యాయి. ఇప్పటికే రైతులు ధాన్యాన్ని ట్రాక్టర్ల ద్వారా నేరుగా కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 66,339 ఎకరాల్లో వరిసాగు చేశారు. పత్తి సీజన్‌ కావడంతో కూలీల కొరత కారణంగా రైతులు అధికశాతం యంత్రాల ద్వారా వరిపైరు కోయిస్తున్నారు. సుమారు 400పైగా వరికోత మిషన్లు పనిచేస్తున్నాయి. వరికోత చైన్‌ యంత్రానికి గంటకు రూ.2800, టైర్‌ యంత్రానికి రూ.2 వేల వరకు ధర నిర్ణయించారు. రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోకుండా ప్రభుత్వమే ఐకేపీ ఆధ్వర్యంలో 26, ఏఎంసీ ద్వారా ఒకటి, పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో 23 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఏగ్రేడ్‌కు రూ.1888, సాధారణ రకానికి రూ.1868 మద్దతు ధర నిర్ణయించారు. రైతులు సాగు చేసిన సన్నరకం వడ్లను కూడా మండల కేంద్రాల్లో కొనుగోలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్ని మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అధికారులు కేంద్రాల్లో సౌకర్యాలను సమకూర్చి కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. 

తిప్పర్తి మండలంలో..

తిప్పర్తి : మండలవ్యాప్తంగా 9 ఐకేపీ, 4 పీఏసీఎస్‌, ఒక ఏఎంసీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఈ కేంద్రాలు ఇప్పటికే ధాన్యంతో నిండిపోయింది. త్వరలోనే కొనుగోళ్లను ప్రారంభించనున్నారు. 

అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. 

వానకాలం ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. వర్షాల వల్ల ఆలస్యమైన కొనుగోళ్లను త్వరలో ప్రారంభిస్తాం. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 

- సన్నిరాజు, తిప్పర్తి ఏఓ

రెండురోజుల్లో పూర్తిస్థాయిలో కొనుగోలు

 రైతులు 20రోజుల నుంచే కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చి ఆరబెడుతున్నారు. మండలంలో పీఏసీఎస్‌ ద్వారా 6, ఐకేపీ ద్వారా 8కేంద్రాలను ఏర్పాటుచేశాం. రెండురోజుల్లో పూర్తిస్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. సన్నరకం వడ్లను కూడా పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో కేంద్రం ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తాం.

- శ్రీనివాస్‌, కట్టంగూర్‌ ఏఓ