శుక్రవారం 04 డిసెంబర్ 2020
Nalgonda - Oct 29, 2020 , 02:07:01

రెవెన్యూలో ధరణీ శకం

రెవెన్యూలో ధరణీ శకం

  • దేశంలోనే గొప్ప కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ శ్రీకారం
  • అన్ని తాసిల్దార్‌ కార్యాలయాల్లో ఏర్పాట్లు సిద్ధం
  • ట్రయల్‌ రన్‌ పూర్తి చేసిన రెవెన్యూ యంత్రాంగం
  • ధరణి వెబ్‌సైట్‌లో భూముల వివరాలన్నీ నిక్షిప్తం
  • ఒక్క రోజులోనే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, పాస్‌బుక్‌

రైతుల సమస్యలకు శాశ్వతంగా చెక్‌ పెట్టేలా.. భూ వివాదాలకు అడ్డుకట్ట వేసేలా.. భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో జాప్యాన్ని నివారించేలా సీఎం కేసీఆర్‌ తీసుకువస్తున్న ‘ధరణి’ పోర్టల్‌ నేడు ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ భూమి హక్కులు పట్టాదారు పాస్‌పుస్తకం చట్టం’ ఈ నెల 29న అమలులోకి వస్తుందని బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రెవెన్యూ చరిత్రలోనే సరికొత్తగా తాసిల్దార్‌ కార్యాలయాలే రిజిస్ట్రేషన్లకు వేదిక కాగా.. అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేగవంతమైన ఇంటర్నెట్‌ సౌకర్యంతోపాటు అవసరమైన కంప్యూటర్లు, పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం ప్రతి కార్యాలయంలో సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే భూముల వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేయగా.. ఆస్తుల నమోదు సైతం త్వరలో నూరుశాతం పూర్తికానున్నది. క్రయ, విక్రయాలు పూర్తయిన నిమిషాల వ్యవధిలోనే భూమి హక్కుల మార్పిడి జరుగనుంది. ఒక్క రోజులోనే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌తో పాటు కొత్తపాస్‌ బుక్‌ చేతికందనుంది. పదిరోజులుగా ట్రయల్స్‌ పూర్తి చేసిన తాసిల్దార్లు.. ప్రత్యేక శిక్షణతో సమాయత్తమయ్యారు.

సూర్యాపేట, నమస్తే తెలంగాణ : వ్యవసాయ భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ తాసిల్దార్‌ కార్యాలయాల్లో చేపట్టేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 29నుంచి అన్ని కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించాలని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించటంతో ఆ దిశగా అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందించి ధరణి కో ఆర్డినేటర్లకు హైదరాబాద్‌లో మూడు రోజుల శిక్షణ ఇచ్చింది. వీరు జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి సైతం శిక్షణ ఇచ్చి ఈనెల 18నుంచి  వారంపాటు అన్ని కార్యాలయాల్లో ఫేక్‌   డాక్యుమెంట్లతో ట్రయల్స్‌ నిర్వహించారు. స్లాట్‌   బుకింగ్‌   నుంచి పాస్‌ బుక్‌ల అందచేత వరకు అన్ని కార్యక్రమాల్లో ఈ ట్రయల్స్‌ చేపట్టారు. ఇప్పటికే పైలెట్‌ ప్రాజెక్టు కింద నల్లగొండ జిల్లాలో కట్టంగూర్‌, సూర్యాపేట జిల్లాలో చివ్వెంల, యాదాద్రి భువనగిరి జిల్లాలో తుర్కపల్లి మండలాలను ఎంపిక చేసి అమలు చేస్తున్నందున అక్కడి తాసిల్దార్ల సలహాలు సైతం తీసుకున్నారు. 

తాసిల్దార్‌ కార్యాలయాల్లో ఏర్పాట్లు పూర్తి..

ధరణి పోర్టలను గురువారం సీఎం ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్న నేపథ్యంలో అన్ని తాసిల్దార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు కావాల్సిన సామగ్రిని అందుబాటులోకి తీసుకొచ్చారు. సీసీ కెమెరాలతోపాటు బయోమెట్రిక్‌ సిస్టమ్‌, మూడు కంప్యూటర్లు, స్కానర్లు, ప్రింటర్లు సరఫరా చేయగా.. ఇంటర్నెట్‌ సౌకర్యం సైతం పునరుద్ధరించారు. 

ఒకేరోజులో చేతికందనున్న పాస్‌ పుస్తకాలు

గతంలో భూమి క్రయ విక్రయాలు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో జరిగిన వారం తర్వాత డాక్యుమెంట్‌ చేతికందితే దాని ద్వారా రెవెన్యూ అధికారులతో మ్యూటేషన్‌ చేయించి పాస్‌బుక్‌ తీసుకోవడానికి రోజలు, నెలల సమయం పట్టేది. ఇక ఆ పరిస్థితి లేకుండా తాసిల్దార్‌ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరుగనున్నందున వెనువెంటనే పాస్‌బుక్‌లు చేతికందనున్నాయి. స్లాట్‌ బుక్‌ చేసుకున్న తర్వాత భూమి రిజిస్ట్రేషన్‌ పూర్తి కాగానే వెంటనే తాసిల్దార్‌ నేతృత్వంలో అక్కడే మ్యుటేషన్‌ చేసి పాస్‌ బుక్‌ అందజేస్తారు. ఇప్పటికే ధరణి వెబ్‌ సైట్‌లో అన్ని భూములకు సంబంధించిన వివరాలు అప్‌లోడ్‌ చేసినందున వాటి ఆధారంగా భూమి విక్రయించిన వ్యక్తి పాస్‌ బుక్‌ నుంచి సదరు భూమిని తొలగొంచి కొనుగోలు చేసిన వ్యక్తి పాస్‌ పుస్తకంలో నమోదు చేయనున్నారు. అయితే వ్యవసాయేతర ఆస్తులు మాత్రమే ఇక రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ చేయనున్నారు.

రైతులకు ఎంతో మేలు 

తాసిల్దార్‌ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు చేయడం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగనుంది. జిల్లాలోని చివ్వెంల మండలం పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక కావడంతో అక్కడ రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా జిల్లాలోని మిగిలిన 22 మండలాల్లో ధరణికి ఏర్పాట్లు చేశాం.  

- వినయ్‌కృష్ణారెడ్డి, సూర్యాపేట కలెక్టర్‌