బుధవారం 02 డిసెంబర్ 2020
Nalgonda - Oct 29, 2020 , 02:07:31

ఎడ్‌సెట్‌లో ర్యాంకుల పంట

ఎడ్‌సెట్‌లో ర్యాంకుల పంట

  • ఫిజికల్‌ సైన్స్‌లో శ్రీను స్టేట్‌ ఫస్ట్‌ 
  • టాప్‌ టెన్‌లో మరో ఏడుగురు

ఎడ్‌సెట్‌ ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. ఫిజికల్‌ సైన్స్‌ విభాగంలో సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌కు చెందిన ఏసురాజు శ్రీను రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు కైవసం చేసుకున్నాడు. గణితం, బయోసైన్స్‌, సోషల్‌, ఇంగ్లిష్‌, తెలుగు విభాగాల్లో మరో ఏడుగురు టాప్‌టెన్‌లో నిలిచారు.

నల్లగొండ విద్యావిభాగం : బీఈడీ రెండేళ్ల కోర్సులో ప్రవేశానికి సెప్టెంబర్‌ 30, ఈనెల 1, 3వ తేదీన ఆన్‌లైన్‌లో నిర్వహించిన ‘టీఎస్‌ ఎడ్‌సెట్‌'-2020 పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన విద్యార్థులు రాష్ర్టస్థాయి ర్యాంకులు సాధించి జిల్లా ఖ్యాతిని చాటారు. ఎడ్‌సెట్‌ ఫిజికల్‌ సైన్‌ విభాగంలో సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌కు చెందిన ఏసురాజు శ్రీను స్టేట్‌ మొదటి ర్యాంక్‌ కైవసం చేసుకోవడం విశేషం. అదే విధంగా గణితం, బయోసైన్స్‌, సాంఘిక, ఇంగ్లిష్‌, ఓరియంటల్‌ తెలుగు విభాగాల్లో టాప్‌టెన్‌లో మన విద్యార్థులు ఉండటంతో ఉమ్మడిజిల్లాకు గౌరవం దక్కింది.

కష్టానికి ప్రతిఫలం వచ్చింది..

నాన్న మరణించాడు. అమ్మ పనిచేస్తూ నన్ను, తమ్ముడిని చెల్లిని చదివిస్తోంది. ఉపాధ్యాయుడు కావాలన్నదే నా సంకల్పం. దీంతో టీఎస్‌ ఎడ్‌సెట్‌ ఫిజికల్‌ సైన్స్‌ ప్రవేశ పరీక్ష రాశాను. ఎంట్రెన్స్‌లో రాష్ట్రంలో ప్రథమ ర్యాంకు సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. నా కష్టానికి ఫలితం వచ్చింది. బీఈడీ పూర్తిచేసి టెట్‌ అర్హత సాధించి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పేదపిల్లలకు సేవలందిస్తాను. ప్రణాళికాయుతంగా చదువడంతోనే రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించాను. 

- ఏసురాజు శ్రీను, ఫిజికల్‌ సైన్స్‌ తొలి ర్యాంకర్‌ 

ఆటోడ్రైవర్‌ కూతురు సౌమ్యకు 7వ ర్యాంకు 

నల్లగొండలోని బీటీఎస్‌లో నివాసం ఉండే గోరటి కృష్ణయ్య-ఇందిర దంతుల కుమార్తె గోరటి సౌమ్య టీఎస్‌ ఎడ్‌సెట్‌ జీవశాస్త్ర విభాగంలో రాష్ట్రస్థాయి 7వ ర్యాంకు సాధించడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. సౌమ్య తల్లి ఇందిర ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేస్తుండగా తండ్రి ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నారు. సౌమ్య నల్లగొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. తాను టీచర్‌గా ఉద్యోగం సాధించి పేద పిల్లలకు విద్యనందించడమే ధ్యేయమని చెబుతోంది.

నాన్న ప్రోత్సాహమే నడిపించింది..

  చాలామందికి ఇంగ్లిష్‌ అంటే భయం. కానీ మా నాన్న ప్రోత్సహమే నన్ను ఇంగ్లిష్‌ వైపు నడిపించింది. బీఈడీ ఇంగ్లిష్‌ మెథడాలజీలో  4వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు సేవలందిస్తా. మా నాన్న నల్లగొండలోని ఆల్ఫా కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు.                    

- సోల్లెటి సాయిదీప్‌, ఇంగ్లిష్‌ 4వ ర్యాంకు