శనివారం 05 డిసెంబర్ 2020
Nalgonda - Oct 29, 2020 , 02:07:28

జంతు ప్రేమికులూ.. జరభద్రం

జంతు ప్రేమికులూ.. జరభద్రం

 • పొంచి ఉన్న సంక్రమిత వ్యాధుల ముప్పు  
 • అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు 
 • శుభ్రత పాటిస్తేనే మేలు

అందంగా కనిపించే గులాబీ పువ్వు చుట్టూ ముళ్లున్నట్లే.. తీయని తెనేపట్టు నిండా కాటేసే ఈగలున్నట్లు.. జంతు, పక్షుల పెంపకంలోనూ ప్రమాదం పొంచి ఉంది. అప్రమత్తంగా లేకుంటే పలు వ్యాధులు సంక్రమించే అవకాశముంది. పెంపుడు జంతువులతో సన్నిహితంగా ఉండే వారు జాగ్రత్తలు పాటించాలని పశు వైద్యాధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వ్యాధి నిర్ధారణ కేంద్రాలు, పశు వైద్య సిబ్బంది, తోళ్ల పరిశ్రమలు, ధాన్యం గిడ్డంగుల్లో పనిచేసేవారు జూనోటిక్‌ వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

పౌష్టికాహారం తీసుకుంటూ చక్కటి వ్యాయామం చేస్తూ క్రమ శిక్షణతో జీవిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చని చాలా మంది అనుకుంటారు. కానీ, ఇవన్నీ పాటించినా కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే వ్యాధులు సంక్రమిస్తాయి. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాల మీదకు తెస్తాయి. జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరముంది. జూనోసిస్‌ అనే శాస్త్రీయ నామంతో పిలిచే ఈ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పశు సంవర్ధక శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి వ్యాధులపై ప్రణాళిక రూపొందించి అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు. 

అప్రమత్తత అవసరం .. 

పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపంకంతో  కొందరు జీవనోపాధి పొందుతుంటారు. వృత్తిగా కాకపోయినా అవసరం, ఆసక్తి, ఆకర్షణతో మరి కొందరు కొన్ని రకాల జంతువులు, పక్షులను పెంచుతుంటారు. వృత్తిగా చేపట్టినవారు గుడ్లు, మాంసం తదితరాలతో ఆదాయం. ఇష్టంగా పెంచుకునేవారు ఆనందం, వినోదం పొందుతారు. కానీ, జంతు, పక్షుల పెంపకంతో కొన్ని అనారోగ్య సమస్యలు, ప్రమాదకర వ్యాధులు సంక్రమిస్తాయన్న విషయం మరిచిపోతున్నారు. అప్రమత్తంగా ఉంటేనే జూనోసిస్‌ వ్యాధుల నుంచి బయటపడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 

ఈ వ్యాధులు ఎలా వస్తాయంటే.. 

జంతువులు, పక్షులకు సంబంధించిన బ్యాక్టీరియా, వైరస్‌ ప్రోటోజోవా, ఫంగస్‌, క్లామిడే లాంటి వాటితో జూనోసిస్‌ వ్యాధులు సంక్రమిస్తాయి. వ్యక్తుల వయసు, ఆరోగ్య పరిస్థితి, వ్యాధి నిరోధక శక్తి తదితర అంశాలను అనుసరించి ఈ వ్యాధులు సోకుతాయని, వ్యాధి కారకం, తీవ్రత తదితర అంశాలు వాటి జాతిపై ఆధారపడి ఉంటాయని, గాలి, నీరు, ఆహారం, జంతు ఉత్పత్తుల వినియోగం ద్వారా వ్యాధులు సంక్రమిస్తాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. రేబిస్‌, మెదడువాపు, గాలికుంటు వ్యాధి వైరస్‌ వల్ల, బ్రూసెల్లోసిస్‌, క్షయ, సాల్మోనోల్లాసిస్‌, ఆంత్రాక్స్‌, గ్లాండర్స్‌ వంటి బ్యాక్టీరియాతో ఎంకైల్‌, స్టోమియాసిస్‌, హైడాటియోసిస్‌, అలర్జీ, ఎగ్జిమా(గజ్జి) అమీడియాసిస్‌, బాలంటిడియోసిస్‌, టాక్సోప్లాస్మా వంటి పరాన్న జీవుల వల్ల వ్యాధులు సంక్రమించే ప్రమాదముందని చెబుతున్నారు. ఉదాహరణకు పిచ్చికుక్క కాటు వల్ల రేబిస్‌ వ్యాధి వస్తుందని, ఈ వ్యాధితో దేశంలో ఏటా 90 వేల మంది మరణిస్తున్నారని అంచనా. మరో ముఖ్యమైన వ్యాధి మొదడువాపు.. ఈ  వ్యాధి పందుల శరీరంపైన ఉండే దోమలు మనుషులను కాటేస్తే సోకుతుంది. ఇలా ఎందరో పిల్లలు ఈ వ్యాధితో మృత్యువాత పడుతున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు   

 • వ్యాధి సోకిన జంతువులు, కోళ్ల మాంసం తినవద్దు
 • పూర్తిగా ఉడికిన మాంసాన్నే తినాలి
 • సరిగ్గా ఉడకని గుడ్లను తినరాదు
 • వ్యాధి సోకిన పశువుల పాలను తాగవద్దు.
 • కుళ్లిపోయిన మాంసం, గుడ్లు, పాలు తీసుకోవద్దు
 • పాడి పశువులు, జంతువులను నిత్యం శుభ్రంగా ఉంచాలి. 
 • పాలను బాగా మరిగించి తాగాలి.  
 • పశువులు, జంతువులు, పక్షులు, కోళ్లకు కాలానుగుణంగా వ్యాధి నిరోధక   టీకాలు వేయించాలి
 • పాలను క్షేత్ర స్థ్ధాయిలో తప్పని సరిగా పరీక్షించాలి.
 • పశువులు, జంతువుల, పక్షుల కొనుగోలు, అమ్మకాల కేంద్రాల్లో డాక్టర్‌ ధ్రువీకరణ పత్రం తీసుకునే విధానాన్ని సక్రమంగా అమలు చేయాలి. 
 • పోస్టుమార్టం పరీక్షలు విధిగా నిర్వహించాలి. 
 • పశువుల పాక వద్ద శుభ్రత, జంతువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. 
 • రేబిస్‌, ఆంత్రాక్స్‌, గ్లాండర్స్‌ వంటి వ్యాధులపై అవగాహన కల్పించాలి. 
 • పెంపుడు కుక్కలకు యాంటీరేబిస్‌ టీకాలు వేయించాలి. 
 • కుక్కలను పెంచేవారు, పశువైద్య సిబ్బంది ముందుగానే యాంటీ రేబిస్‌ టీకా వేయించుకోవాలి. 
 • పశువులు, జంతువులకు విధిగా నట్టల నివారణ మందులు వేయించాలి. 
 • పందులు గ్రామ శివారుల్లోనే ఉండేలా ఏర్పాట్లు చేయాలి. 
 • పౌల్ట్రీ ఫారాలు, జంతు ప్రదర్శనశాల, డెయిరీలలో పనిచేసేవారు. పశు పోషకాలు, జంతు ప్రేమికులు వ్యక్తిగత పరిశుభ్రతపై శ్రద్ధ చూపాలి. మాస్కులు ధరించడం మంచిది. 
 • జంతు కళేబరాలు లోతైన గోతిలో సున్నం చల్లి పాతిపెట్టాలి. 
 • జంతు ఆవాసాలను శుభ్రం చేయాలి. 
 • పశు సంవర్ధక, ఆరోగ్య శాఖ, పంచాయతీ, మున్సిపల్‌ అధికారులు రేబిస్‌ నివారణకు సంయుక్త కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలి. 
 • జూనోటిక్‌ వ్యాధుల నివారణకు స్వచ్ఛంద సంస్థలు క్రియాశీలక పాత్ర పోషించాలి. 

జంతువుల ద్వారా సంక్రమించే వ్యాధుల ఈవిధంగా ఉంటాయి..

కారకం : సంక్రమించే వ్యాధులు

పిచ్చి కుక్క కాటుతో : రేబిస్‌

కుక్క పిల్లలతో ఆడే వారికి                   : టాక్సోకారియాసిస్‌

కుక్కలు, లేగ దూడలను తాకితే : గజ్జి, చర్మ వ్యాధులు

పందులు, దోమలతో : మెదడు వాపు

అపరిశుభ్ర గుడ్లు, పాలు, మాంసంతో : బ్రూసెల్లోసిస్‌

ఎలుకలతో : ప్లేగు

పశువులతో సన్నిహితంగా ఉంటే : క్షయ

ఉన్ని, తోళ్ల పరిశ్రమల్లో పనిచేసేవారికి : అంత్రాక్స్‌

సరిగ్గా ఉడకని గుడ్లు, మాంసంతో : సాల్మోనెల్లోసిస్‌

పంది మాంసంతో : టీనియా సోలియం

కర్ర కోత పనిచేసే వారికి : గజ్జి, దురద

గొర్రెలు, మేకల కాపరులకు : రాణికెట్‌, సిట్టకోసిస్‌

మాంసం పరిశ్రమల్లో పనిచేసే కూలీలకు : క్యూఫీవర్‌

1885లో తొలిసారిగా యాంటీ రేబిస్‌ టీకా ప్రయోగం 

నిమ్న శ్రేణి జీవుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి నిమ్నశ్రేణి జీవులకు సహజ సిద్ధంగా సంక్రమించే వ్యాధులను ‘జూనోసిస్‌' అంటారు. ఇలాంటి వ్యాధులు దాదాపు 200 రకాలు ఉన్నాయి. ఇందులో రేబిస్‌ అత్యంత ప్రమాదకర ప్రాణాంతక వ్యాధి. లూయీ పాశ్చర్‌ అనే ప్రఖ్యాత శాస్త్రవేత్త పిచ్చికుక్క కాటుకు గురైన వ్యక్తిపై 1885 సంవత్సరం జూలై 6న తొలిసారి యాంటీ రేబిస్‌ టీకాను విజయవంతంగా ప్రయోగించారు.