శుక్రవారం 04 డిసెంబర్ 2020
Nalgonda - Oct 27, 2020 , 00:42:27

తీరిన లిఫ్టు రైతు కష్టాలు

తీరిన లిఫ్టు రైతు కష్టాలు

కొత్త మోటర్లు, పంపులు, పైపులైన్ల ఏర్పాటు

శిథిలమైన కాల్వల పునరుద్ధరణ

లిఫ్టుల ఆధునీకరణతో పెరిగిన సాగు విస్తీర్ణం 

ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు

వేములపల్లి :తెలంగాణ ప్రభుత్వం లిఫ్టులను ఆధునీకరించగా.. వాటికింద ఉన్న భూములకు సరిపోను సాగునీరు లభిస్తోంది. సమైక్య పాలనలో సాగర్‌ ఎడమ కాల్వపై ఉన్న ఎత్తిపోతల పథకాలను రైతులే నిర్వహించుకోవాల్సిన దుస్థితి ఉండేది. ఒక్కో లిఫ్టులో ఉన్న మోటర్లు తరచూ కాలిపోతుండడంతో పాటు ఆరు గంటలు మాత్రమే విద్యుత్‌ సరఫరా ఉండడంతో మోటర్లు సరిగా నడవక, వాటికింద ఉన్న భూములకు నీరందేది కాదు. తెలంగాణ ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రభుత్వం లిఫ్టులను ఆధునీకరించింది. అన్ని ఎత్తిపోతల పథకాలకు నూతన మోటర్లు బిగించారు. దీంతో పాటు 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. శిథిలావస్థకు చేరిన కాల్వలను పునరుద్ధరించారు. మండలంలోని తిమ్మారెడిగూడెం, మొల్కపట్నం, సల్కునూరు గ్రామాల్లో ఉన్న లిఫ్టుల కింద సుమారు 4500 ఎకరాలకు సాగునీరందుతోంది. గతంతో పోలిస్తే 1700 ఎకరాల భూమి అదనంగా సాగులోకి వచ్చినట్లు రైతులు తెలిపారు. 


పుష్కలంగా సాగునీరు

మిర్యాలగూడ మండలంలోని దొండవారిగూడెం గ్రామంలో ఉన్న లిఫ్టు ద్వారా వేములపల్లి మండలంలోని తిమ్మారెడ్డిగూడెంలో 1150 ఎకారాల భూమి సాగవుతోంది. దీంతో పాటు గ్రామ చెరువులోకి కూడా సమృద్ధిగా నీరు చేరుతోంది. దీంతో పాటు జగ్గం చెరువు కూడా పూర్తిస్థాయిలో నిండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువు కింద సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో రైతులు వరి సాగు చేస్తున్నారు. సల్కునూరు లిప్టు ఎల్‌-18,19 కింద సుమారుగా 2100 ఎకరాలు సాగవుతోంది. మెల్కపట్నం శివారులో ఉన్న ఎల్‌-17 లిప్టు ద్వారా మరో 1050 ఎకరాలు సాగవుతున్నాయి. ప్రస్తుతం ఆయా లిఫ్టుల కింద సరిపోను నిరందుతుండగా.. రైతులు ఉత్సాహంగా వరిసాగు చేస్తున్నారు.


లిఫ్టుల ఆధునీకరణతో మా బతుకులు మారినయి.. 

గతంలో లిఫ్టులు సరిగా లేక రాత్రిళ్లు మొత్తం పొలం వద్దే ఉండి నీరు పెట్టుకోవాల్సి వచ్చేది. తెలంగాణ ప్రభుత్వం లిఫ్టులకు కొత్త మోటర్లు పెట్టింది. 24 గంటల కరెంటు ఇస్తుండడంతో ఇప్పుడు సరిపోను నీరందుతుంది. అదికూడా పొద్దటిపూటే పెట్టుకొని రాత్రి ఇంటికాడ హాయిగా ఉంటున్నం. ప్రస్తుతం వరిపండిస్తున్న. 

- శేఖర్‌రెడ్డి, రైతు, మంగాపురం