శుక్రవారం 04 డిసెంబర్ 2020
Nalgonda - Oct 27, 2020 , 00:39:50

ప్రజాప్రతినిధి పొలంబాట

ప్రజాప్రతినిధి పొలంబాట

తీగజాతి పంటలతో అధిక లాభాలు

వ్యవసాయ క్షేత్రంలోనే నాటుకోళ్ల పెంపకం

ఆదర్శంగా నిలుస్తున్న బుడుమర్లపల్లి సర్పంచ్‌ పార్వతమ్మాజానయ్య దంపతులు

కనగల్‌ : సేంద్రియ పద్ధతుల్లో తీగజాతి కూరగాయలు సాగు చేస్తూ.. నాణ్యమైన అధిక దిగుబడి సాధిస్తున్నారు. వ్యవసాయంతో పాటు నాటుకోళ్ల పెంపకం ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు బుడుమర్లపల్లి సర్పంచ్‌ కారింగు పార్వతమ్మాజానయ్యగౌడ్‌ దంపతులు. 

నల్లగొండ జిల్లా కనగల్‌ మండలం బుడుమర్లపల్లి గ్రామానికి చెందిన కారింగు పార్వతమ్మాజానయ్య దంపతులు అటు ప్రజాప్రతినిధులుగా ప్రజలకు సేవలందిస్తూనే తమకున్న ఐదెకరాల వ్యవసాయ క్షేత్రంలో అందరికంటే విభిన్నంగా సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. తీగజాతి కూరగాయాలనే అధికంగా సాగు చేస్తున్నారు. రసాయనిక ఎరువులు వేసిన వాటికంటే సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసినవి తినడం ఆరోగ్యానికి ఎంతో మేలని వైద్యులు సూచిస్తుండడంతో ఈ రైతు దంపతులు ఈ విధానాన్ని ఎంచుకున్నారు. దీంతో పాటు తమ వ్యవసాయ క్షేంద్రంలోనే కొద్దిపాటి స్థలాన్ని ఎంపిక చేసుకొని దానికి ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసి 200 వరకు కడక్‌నాథ్‌, టర్కీ కోళ్లను పెంచుతున్నారు.  పండించిన  కూరగాయలను నల్లగొండ మార్కెట్‌కు తరలిస్తున్నారు. దీంతో పాటు అనాథ, వృద్ధాశ్రమాలకు ఉచితంగా అందిస్తున్నారు.


సేంద్రియ పద్ధతుల్లోనే..

పంటలపై రసాయన ఎరువులు, పురుగుల మందులు పిచికారీ చేయడం వల్ల వాటి అవశేషాలు పంట ఉత్పత్తుల్లో ఉండిపోతున్నాయి. వాటిని మనం తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో సేంద్రియ పద్ధతిలో సాగుచేసిన వాటినే తినాలని వైద్యులు సూచిస్తున్నారు. అందుకే తాము కూడా సేంద్రియ పద్ధతిలోనే సాగు చేసి ప్రజలకు ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తులు అందించాలని నిర్ణయించుకున్నారు పార్వతమ్మాజానయ్య దంపతులు. తాము సేంద్రియ పద్ధతిలో సాగు చేయడంతో పాటు ఇతర రైతులను కూడా ఈ విధానంపై అవగాహన కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నారు.

పందిరి 

కూరగాయల సాగు

 పార్వతమ్మాజానయ్య దంపతులు తమ వ్యవసాయ క్షేంత్రంలో తీగజాతికి చెందిన పలురకాల కూరగాయలను పండిస్తున్నారు. మొదట ఐదు ఎకరాల్లో రూ.2లక్షల వ్యయంతో 65ట్రిప్పుల పెంట, 30 టన్నుల వర్మీకంపోస్టు వేయించారు. ఆవుమూత్రం, బెల్లంతో జీవామృతం తయారు చేసి పంటలకు వినియోగిస్తున్నారు. పండించిన కూరగాయలను నిల్వ చేసేందుకు రూ.2.5 లక్షలతో మూడు గదులను  ఏర్పాటుచేశారు. ముఖ్యంగా దొండ, బీర, కాకర, సొర వంటి తీగజాతులను సాగు చేస్తున్నారు. నిత్యం 30 మంది కూలీలకు సంవత్సరం పొడవునా ఉపాధి కల్పిస్తున్నారు. కూరగాయలను నల్లగొండ మార్కెట్‌కు తరలించడం ద్వారా నెలకు సుమారు రూ. లక్షల వరకు ఆదాయం పొందుతున్నారు.