శుక్రవారం 04 డిసెంబర్ 2020
Nalgonda - Oct 27, 2020 , 00:39:49

పట్టభద్రుల చైతన్యం

పట్టభద్రుల చైతన్యం

ఇప్పటికే 2,81,670దరఖాస్తులు

ఆన్‌లైన్‌లో 2,29,736, ఆఫ్‌లైన్‌లో 51,934

అధికంగా ఆన్‌లైన్‌పైనే పట్టభద్రుల దృష్టి

నవంబర్‌ ఆరు దరఖాస్తుకు తుది గడువు

ఓటరు నమోదు సన్నాహక సమావేశాల్లో ఆయా పార్టీలు

నల్లగొండ : నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలు 2015 మార్చి 22న ఎన్నికలు జరుగగా ప్రస్తుత ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పదవీ కాలం మార్చి 21, 2021 నాటికి ముగుస్తుండటంతో ఈ ఎన్నికలు ఆ లోపు నిర్వహించాల్సి ఉంది. అంతేగాక  2017 నవంబర్‌ నాటికి డిగ్రీ పూర్తి చేసి మూడేండ్లు నిండిన పట్టభద్రులకు మాత్రమే ఓటు హక్కు అవకాశం కల్పించటంతో ఆ అర్హత కలిగిన వారు ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. దరఖాస్తుల అనంతరం ముసాయిదా జాబితా విడుదల, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం చేపట్టి వచ్చే ఏడాది జనవరి 18న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల ఎలక్టోరల్‌ అధికారులు ఏర్పాట్ల ప్రక్రియను ఇప్పటికే మండల, డివిజన్‌, జిల్లా వ్యాప్తంగా ముగించగా ఆయా పార్టీలు మాత్రం ఓటరు నమోదులో బిజీగా మారాయి.

ఆన్‌లైన్‌ దరఖాస్తుపైనే పట్టభద్రుల దృష్టి..

పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రులు తమ ఓటు హక్కు నమోదుపై ఆన్‌లైన్‌ పైనే దృష్టి సారించారు. గతంలో ఉన్న ఓట్లు చెల్లవని ఎన్నికల సంఘం ప్రకటించటంతో మళ్లీ అందరూ నమోదు చేసుకోవాల్సి ఉంది. దీంతో ఓటు హక్కు కావాలనుకునే వారు సంబంధిత ధ్రువపత్రాలతో స్థానిక తాసిల్దార్‌ లేదంటే మున్సిపల్‌ కార్యాలయాల్లో ఫారం 18 నింపి దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. ఆన్‌లైన్‌లోనైనా వీటిని అప్‌లో డ్‌ చేసినప్పటికీ ఓటుహక్కు పొందవచ్చు. అయితే నియోజకవర్గ వ్యాప్తంగా పట్టభద్రులు ఎక్కువగా ఆన్‌లైన్‌ పైన దృష్టి సారించి దరఖాస్తు చేసుకుంటున్నారు. అక్టోబర్‌ ఒక టి నుంచి ఈ దరఖాస్తుల ప్రక్రియ షురూ కాగా ఇప్పటి వరకు 2,81,670 దరఖాస్తులు వచ్చాయి. అందులో ఆన్‌లైన్‌లో 2,29,736 మంది దరఖాస్తు చేసుకోగా.ఆఫ్‌ లైన్‌లో 51,934 మంది దరఖాస్తు చేసుకున్నారు.  

నవంబర్‌ ఆరు వరకు తుది గడువు..

ఓటు హక్కు కోసం నవంబర్‌ ఆరు వరకు దరఖాస్తుకు తుది గడువు ఉంది. 2015లో 2,81,138 ఓట్లు ఉండగా ప్రస్తుతం ఇప్పటి వరకు 2,81,670 మంది దరఖాస్తు చేసుకున్నారు. తుది గడువుకు మరో 10 రోజులుంది. ఆరున ఓటరు నమోదు పూర్తి కాగానే డిసెంబర్‌ ఒకటిన ఓటరు ముసాయిదా జాబితాను విడుదల చేసి అదే నెల 31 వరకు అభ్యంతరాలు స్వీకరించి వచ్చే ఏడాది జనవరి 12 వరకు నాటికి వాటిని పరిష్కరించనున్నారు. చివరగా అదే నెల 18న నియోజవర్గ వ్యాప్తంగా పట్ట భద్రుల ఓటర్లకు సంబంధించిన తుది జాబితాను విడుదల చేయనున్నారు. మార్చి 21 నాటికి ప్రస్తుత ఎమ్మెల్సీ పల్లా రాజే శ్వర్‌రెడ్డి పదవీ కాలం పూర్తి కానుండటంతో ఆలోపు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా అధికార యంత్రాంగం ఇప్పటికే డీఆర్వోను ఎలక్టోరల్‌ అధికారిగా నియమించి డివిజన్ల వారీగా ఆర్డీఓలను, మండలాల వారీగా తాసిల్దార్లను నియమించారు.  

ఓటు నమోదులో నిమగ్నమైన పార్టీలు..

నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలకు ఓటు నమోదు చేయించడంలో ఆయా రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయి. మూడు జిల్లాల్లోనూ టీఆర్‌ఎస్‌ పార్టీ దూకుడు పెంచి ఎక్కువ సంఖ్యలో ఓటర్లను నమోదు చేయిస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంత్రి జగదీశ్‌రెడ్డి ఇప్పటికే ఆయా నియోజక వర్గాల్లో ఓటరు నమోదు సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం ఉత్సాహంగా నడిపిస్తుండగా...ఖమ్మంలో మంత్రి పువ్వాడ నాగేశ్వర్‌ రావు, వరంగల్‌లో ఎర్రబెల్లి దయాకర్‌ రావులు సైతం సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా కాంగ్రెస్‌, బీజేపీలు సైతం ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఓటర్లకు పిలుపునిస్తున్నాయి.