శనివారం 05 డిసెంబర్ 2020
Nalgonda - Oct 24, 2020 , 00:37:15

గొలుసుకట్టు.. కనికట్టు!

గొలుసుకట్టు.. కనికట్టు!

మిర్యాలగూడ కేంద్రంగా గొలుసుకట్టు వ్యాపారం జోరుగా సాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండానే కోట్లలో డబ్బు చేతులు మారుతోంది. అందం, ఆరోగ్యం, ఆదాయం పేరిట సాగుతున్న ఈ దందాలో అమాయక యువత, గృహిణులు చిక్కుకుని చేతులు కాల్చుకుంటున్నారు. ముందుగా రూ.12వేలు చెల్లిస్తే పలు రకాల సిరప్‌లు, క్రీములు అందజేస్తున్నారు. చేర్పించిన వారికి కూడా ఆదాయం ఉంటుందని ఆశచూపిస్తున్నారు. ఆకర్షణీయమైన బహుమతులు, కమీషన్లు ఎరవేస్తూ చాపకింద నీరులా విస్తరిస్తున్న గొలుసుకట్టు వ్యాపారంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల సలహాలు, సూచనలు పాటించకుండా మందులు వాడితే అవయవాలు చెడిపోయి ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉన్నదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మిర్యాలగూడ  కేరళకు చెందిన ఓ మార్కెటింగ్‌ కంపెనీ తాము ఇచ్చే టానిక్‌  అన్నిరకాల రోగాలు మటుమాయం అవుతాయని నమ్మబలుకుతూ గొలుసుకట్టు వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఈ అక్రమదందా జోరుగా సాగిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు షుగర్‌, బీపీ, పక్షవాతం వంటి రోగాలు, అధిక బరువుతో ఉన్న యువత ఈ మందు వాడితే రెండునెలల్లోనే బరువు తగ్గుతారని చెబుతున్నారు.. ఇక ఇతర అన్నిరకాల రోగాలు తగ్గించే ఈ అద్భుత ఔషధం రక్తశుద్ధి చేస్తుందని,  నల్లగా ఉన్నవారు టానిక్‌ వాడితే తెలుపుగా మారుతారని మాయమాటలు చెబుతూ గొలుసుకట్టు రీతిలో వ్యాపారాన్ని  విస్తరిస్తున్నారు. 

రూ.12 వేలు సభ్యత్వం...

 ఈ మందులు కావాల్సినవారు ముందుగా రూ.12 వేలు చెల్లించి సభ్యత్వం తీసుకుంటారు వీరికి ఎటువంటి రశీదు ఇవ్వరు. ఈ సభ్యత్వం తీసుకున్న వ్యక్తి నెలరోజుల్లో మరో ఇద్దరిని చేర్పించాలి. ఈ ఇద్దరు మరో నెలరోజుల్లో చెరో ఇద్దరిని చేర్పించాలి. ఇలా ఒక్కొక్కరూ ప్రతి మనిషి నుంచి రూ.12 వేలు తీసుకుని నాలుగురకాల టానిక్‌లు ఇస్తారు. దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారిని, అధిక బరువు ఉన్నవారిని, మహిళలు, యువత ఎంచుకుని ఈ టానిక్‌లు అంటగడుతున్నారు. సభ్యత్వం తీసుకున్న ప్రతిఒక్కరికి అధిక మొత్తంలో ఇతరులను గొలుసుకట్టు రీతిలో చేర్పించినప్పుడు కమీషన్‌ ఉంటుంది. దీంతో అంచలంచెలుగా ధనాపేక్షతో వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. 

మహిళలు, నిరుద్యోగులే టార్గెట్‌...

ఈ వ్యాపారాన్ని విస్తరించటానికి ముందుగా కంపెనీవారు సభ్యత్వం తీసుకున్న వారికి సమావేశాలు నిర్వహించి కొంతమంది ఇతర జిల్లాల వారిని తీసుకొచ్చి తాము గత రెండేళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్నాము. తమకు ప్రతినెలా మంచి ఆదాయం వస్తుందని చెప్పిస్తారు. ఈ టానిక్‌ల వలన ఎటువంటి జబ్బులు అయినా తగ్గుతాయని తాము ఎంతోమందికి ఈ టానిక్‌లు ఇచ్చామని మంచి ఫలితాలు వచ్చాయని ఉపన్యాసాలతో ఊదరగొడతారు. తాము ఎక్కువమందిని చేర్పించడం వలన తమకు ఖరీదైన బహుమతులు వచ్చాయని చెప్తారు. దీంతో చదువుకున్న యువత సైతం ఈ వ్యాపారం వైపు ఆకర్షితులవుతున్నారు. 

వైద్యుడి సిఫారసు లేకుండానే..

ఆయుర్వేదిక్‌, అల్లోపతి, హోమియోపతి ఏ మందులైనా డాక్టర్లు రోగి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఇస్తారు. ఇవేమీ లేకుండా గొలుసుకట్టు రీతిలో ఎక్కడో తయారుచేసిన మందులను(టానిక్‌లను) గత 30ఏళ్లుగా దీర్ఘకాలిక రోగాలకు మందులు వాడుతున్నవారు వాడితే వారి ఆరోగ్యంపై పెనుప్రభావం పడుతుంది. ఈ టానిక్‌లు వాడి కొత్తరకం రోగాలతో నరకయాతన పడుతున్నవారు చాలామంది ఉన్నారు.  

పట్టించుకోని అధికారులు..

వైద్య ఆరోగ్యశాఖ నుంచి అనుమతులు లేకుండా ఈ మందులు జోరుగా జిల్లా అంతటా విక్రయిస్తున్నారు. అధికారులు ఈ విషయాన్ని చూసి చూడనట్లుగా వదిలేయడం వలన ఈ కంపెనీ ప్రతినిధులు చెప్తున్న మాయమాటలు నమ్మి ఎంతోమంది మోసపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి  చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.