గురువారం 03 డిసెంబర్ 2020
Nalgonda - Oct 22, 2020 , 00:27:14

పోలీస్‌ అమరుల త్యాగం అజరామరం

పోలీస్‌ అమరుల త్యాగం అజరామరం

  • పోలీస్‌ వ్యవస్థ లేకుండా సమాజ మనుగడ లేదు 
  • ‘ఫ్లాగ్‌ డే’ వారోత్సవాల్లో మంత్రి జగదీశ్‌రెడ్డి

దేశ రక్షణ, శాంతి భద్రతలు కాపాడడంలో పోలీస్‌ అమరవీరుల త్యాగం అజరామరంగా నిలిచిపోతుందని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలో జరిగిన ‘ఫ్లాగ్‌ డే’ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై పోలీస్‌ అమరవీరులకు నివాళులర్పించారు.

నల్లగొండ క్రైం : శాంతి భద్రతలు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణే లక్ష్యంగా నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ  ప్రజారక్షణలో ప్రాణాలను అర్పించిన పోలీస్‌ అమరవీరుల త్యాగం అజరామరంగా నిలిచిపోతుందని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలో జరిగిన పోలీస్‌ అమరుల సంస్మరణ దినోత్సవం ఫ్లాగ్‌డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పోలీస్‌ అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలీస్‌ అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు.  పోలీస్‌ వ్యవస్థ లేకుండా సమాజం మనుగడ కష్టమని, సమాజం కోసం ప్రాణత్యాగం చేసిన వారిని గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. 

ఏ చిన్న సమస్య వచ్చినా పోలీస్‌ పాత్ర అనివార్యమని, ఇటీవల వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు అప్రమత్తంగా పని చేస్తున్నా పోలీసుల అవసరం ప్రత్యేకమన్నారు. అనేక సమయాల్లో తమ ప్రాణాలు లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలను కాపాడిన ఘనత పోలీసులకే దక్కిందన్నారు. రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థను సమర్థవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆధునిక, సాంకేతిక వసతులు కల్పిస్తూ దేశంలోనే అగ్రగామిగా నిలిపేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పోలీస్‌ అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలువడంతోపాటు వారి సంక్షేమానికి పాటుపడుతుందన్నారు. జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ మాట్లాడుతూ సమాజాభివృద్ధిలో పోలీసుల పాత్ర ఎంతో గొప్పదని, నిబద్ధతతో పనిచేస్తూ ప్రజల కోసం పనిచేసే అవకాశం పోలీస్‌ శాఖకే సాధ్యమన్నారు.

శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్‌ అమరులందించిన సేవలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. డీఐజీ రంగనాథ్‌ మాట్లాడుతూ  1960 నుంచి ప్రతి అక్టోబరు 21న పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. ఫ్లాగ్‌ డేను పురస్కరించుకొని ఈనెల 31వరకు పోలీస్‌ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పోలీస్‌ అమరుల కుటుంబ సభ్యులతో రంగనాథ్‌ ప్రత్యేకంగా చర్చించి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భుపాల్‌రెడ్డి, గాదరి కిశోర్‌కుమార్‌, నల్లమోతు భాస్కర్‌రావు, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, ఏఎస్పీ నర్మద, డీఎస్పీలు, సీఐ బాషా, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.  

 12వ బెటాలియన్‌లో..   

నల్లగొండసిటీ : శాంతిభద్రతల పరిరక్షణలో బెటాలియన్‌ పోలీసుల పాత్ర కీలకమని అడిషనల్‌ కమాండెంట్‌ బి.రామృష్ణ అన్నారు. బుధవారం ఫ్లాగ్‌డే సందర్భంగా 12వ బెటాలియన్‌లో ఏర్పాటు చేసిన పోలీస్‌ అమరవీరుల స్తూపానికి ఆయన నివాళులర్పించారు. ఈ సంవత్సరం 264 మంది పోలీసులు వివిధ సందర్భాల్లో మృత్యువాత పడ్డారని, వారి త్యాగాలు  మరువలేనివన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమాండెంట్‌ అంజయ్య, ఎం.పార్థసారథి, నర్సింగ్‌ వెంకన్న, ఆర్‌ఐలు శ్రీరాముల నాగేశ్వర్‌రావు, శివ, యుగంధర్‌, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.