సోమవారం 26 అక్టోబర్ 2020
Nalgonda - Oct 02, 2020 , 00:47:06

పట్టభద్రుల ఓట్ల నమోదు షురూ..!

పట్టభద్రుల  ఓట్ల నమోదు షురూ..!

  • తొలిరోజు వీఐపీల సందడి
  • సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి దంపతుల దరఖాస్తు
  • పలుచోట్ల ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు సైతం.. 
  • సరైన నాయకుడిని ఎన్నుకునేందుకు సిద్ధం కావాలి 
  • విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పిలుపు 

వచ్చే ఏడాది మార్చిలో జరుగనున్న నల్లగొండ-వరంగల్‌- ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సందడి మొదలైంది. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఓటర్ల నమోదు కార్యక్రమం  గురువారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభమైంది. జిల్లాలోని అన్ని తాసిల్దార్‌ కార్యాలయాల్లో నమోదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తన సతీమణి సునీతతో కలిసి సూర్యాపేట రెవెన్యూ కార్యాలయంలో ఓటు నమోదు దరఖాస్తు పత్రాలను సమర్పించారు. ‘ప్రతి పట్టభద్రుడు విధిగా ఓటు నమోదు చేసుకోవాలని, సరైన అర్హతలు, సేవాభావం కల్గిన సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకునేందుకు అంతా సన్నద్ధం కావాలి’ అని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. పలుచోట్ల ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు, పట్టభద్రులు ఓటుహక్కు నమోదు కోసం దరఖాస్తులు సమర్పించారు.

- నల్లగొండ ప్రతినిధి, నమస్తే తెలంగాణ 

నల్లగొండ- వరంగల్‌-ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్ల నమోదు కోలాహలం మొదలైంది. ఈ ఎన్నికల్లో ఓటు వేయాలంటే అర్హులైన ప్రతి ఒక్క పట్టభద్రుడు తాజాగా దరఖాస్తు చేయాల్సిందే. ఈ నేపథ్యంలో పోటీ చేయాలనుకునే పార్టీలు, ఆశావహులు, స్వతంత్ర అభ్యర్థులంతా ఓటర్ల చేర్పింపు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఈ విషయంలో అందరికంటే ముందే ఉంది.

పార్టీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపుతో తొలిరోజే ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు, శ్రేణులు ఓటర్ల నమోదు కోసం దరఖాస్తులు సమర్పించారు. సూర్యాపేట తాసిల్దార్‌ కార్యాలయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి తన సతీమణి సునీతతో కలిసి దరఖాస్తును స్వయంగా సమర్పించారు. ఆయనతో పాటు పలువురు పార్టీ నేతలు కూడా దరఖాస్తు చేశారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటుహక్కు పొందాలని సూచించారు. అర్హులందరికీ అవగాహన కల్పించి ఓటుకు దరఖాస్తు చేయించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు ఎంతో విలువైందని, అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.

ఇక హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి మఠంపల్లిలో ఓటు నమోదు చేయించుకున్నారు. తిరుమలగిరి తాసిల్దార్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌, కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య, దేవరకొండలో రవీంద్రకుమార్‌, మిర్యాలగూడలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ఓటు నమోదు దరఖాస్తు పత్రాలను సమర్పించారు. నకిరేకల్‌లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఓటర్ల నమోదును ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఓటు నమోదు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. logo