సోమవారం 26 అక్టోబర్ 2020
Nalgonda - Oct 02, 2020 , 00:47:06

కస్టమ్‌ మిల్లింగ్‌లో జిల్లా టాప్‌

కస్టమ్‌ మిల్లింగ్‌లో  జిల్లా టాప్‌

  •  రాష్ట్రంలో నల్లగొండ అగ్రస్థానం... 
  • సీఎంఆర్‌ 86శాతం పూర్తి 
  •  నిరంతర సమీక్షలు, సమన్వయంతో సక్సెస్‌ 
  •  జిల్లా నుంచి ఆరు రాష్ర్టాలకు బియ్యం ఎగుమతులు
  •  వానకాలం ధాన్యం  దిగుమతులకు మార్గం సులువు 
  •  వచ్చే వారం నుంచి  కొనుగోళ్లకు సన్నాహాలు  

వానకాలం సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగాలంటే మిల్లుల్లో నిల్వలను ఖాళీ చేయాల్సిందే. పాత ధాన్యం పేరుకుపోతే స్థలం దొరకక కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని లిఫ్ట్‌ చేయడంలో ఇబ్బందులు తప్పవు. ఫలితంగా ప్రభుత్వ ఉద్దేశం కూడా సరిగ్గా నెరవేరదు. అందుకే నల్లగొండ జిల్లా యంత్రాంగం ముందుచూపుతో వ్యవహరించింది. కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) సేకరణలో 86శాతం టార్గెట్‌ను పూర్తి చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్ర సగటు   46శాతం కాగా.. జిల్లాలో త్వరలోనే వందశాతం పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

 నల్లగొండ ప్రతినిధి,  నమస్తే తెలంగాణ

 కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌)పై జిల్లా యంత్రాంగం పూర్తిగా దృష్టి సారించింది. ప్రణాళికాబద్ధ్దంగా వ్యవహరించి నల్లగొండ జిల్లాను అగ్రస్థానంలో నిలిపారు. జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ మార్గదర్శనంలో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఎప్పటికప్పుడూ సీఎంఆర్‌ను సమీక్షించారు. దీనికి జిల్లా రైస్‌మిల్లర్ల సహకారం కూడా తోడై ఎగుమతులు చేయడం ద్వారా వానకాలం కొనుగోళ్లకు మార్గం సుగమమైంది.  

కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. ఆ మేరకు జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ నేతృత్వంలో అధికారులు కొనుగోళ్లను ప్రారంభించారు. అకాలవర్షాలతో తలెత్తిన చిన్నచిన్న ఆటంకాలు మినహా ఒక్కో ఇబ్బందిని అధిగమిస్తూ విజయవంతంగా పూర్తి చేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కూడా ఎప్పటికప్పుడు మిల్లులకు చేరవేయడంలోనూ జాప్యం లేకుండా చర్యలు తీసుకున్నారు. యాసంగి సీజన్‌లో 275 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 649059మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మొత్తం 102712 మంది రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు అధికారుల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ధాన్యానికి గానూ మొత్తం రూ.1191కోట్లు రైతులకు ప్రభుత్వం చెల్లించింది. చెల్లింపుల్లోనూ ఎక్కడా జాప్యం లేకు ండా వందశాతం పూర్తి చేశారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచే ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించారు. జిల్లాలో మొత్తం 107 రైస్‌మిల్లులను గుర్తించి వాటి సామర్థ్యాన్ని బట్టి కేటాయింపులు చేశారు. మొత్తం 649059మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. తిరిగి వారి నుంచి రారైస్‌ లేదా బాయిల్డ్‌ రైస్‌గా 4.41లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌గా తీసుకోవాల్సి ఉంది. ఇందులో సెప్టెంబర్‌ 30నాటికి మొత్తం 3.45లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యా న్ని మిల్లర్ల నుంచి సీఎంఆర్‌గా సేకరించారు. ఇలా తీసుకున్న బియ్యంలో ఈ సారి 90శాతం బాయిల్డ్‌ రైస్‌గా 10శాతం రారైస్‌గా వెనక్కి తీసుకున్నారు. దీన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎఫ్‌సీఐ ద్వారా ఆరు రాష్ర్టాలకు విక్రయించారు. మిల్లర్ల వద్ద మిగిలిన మరో 96వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని తీసుకోగలిగితే వందశాతం టార్గెట్‌ పూర్తి కానుంది. సెప్టెంబర్‌ 30నాటికి జిల్లా సీఎంఆర్‌లో 86శాతం పూర్తి చేసింది. అయితే ఈ విషయంలో సూర్యాపేట జిల్లా వెనకబడింది. రాష్ట్ర సగటును కూడా అందుకోలేకపోయింది. కేవలం 42శాతమే సీఎంఆర్‌ పూర్తి చేశారు. 

నిరంతర సమీక్షలతో ముందంజ...

సాధారణంగా సీఎంఆర్‌ పూర్తి చేయడంలో మిల్లర్ల సహకారం కీలకం. కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ వనమాల చంద్రశేఖర్‌కు పూర్తి బాధ్యత అప్పగించి మార్గదర్శనం చేశారు. దీంతో చంద్రశేఖర్‌ సివిల్‌ సప్లయ్‌, వ్యవసాయ, రవాణా, మార్కెటింగ్‌ ఇతర శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పురోగతి సాధించారు. దీనికి తోడు సీఎంఆర్‌ సేకరణలో రైస్‌మిల్లర్ల పాత్ర చాలా కీలకం. తమకు వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లింగ్‌ చేస్తూ తిరిగి అప్పగించడం అం తా వారి చేతుల్లోనే ఉంటుంది. అయితే నల్లగొండ జిల్లా రైస్‌మిల్లర్ల సహకారంతోనే సీఎంఆర్‌ లక్ష్యం సాధ్యమైందని అదనపు కలెక్టర్‌  వివరించారు.  

వానకాలం కొనుగోళ్లకు మార్గం సుగమం 

సీఎంఆర్‌ సేకరణతో వానకాలం ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బంది లేకుండా పోయింది. ఈ సీజన్‌లో 275కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనాలని ఇప్పటికే జిల్లా అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఈ నెల 7వ తేదీ తర్వాత ఎప్పుడైనా కొనుగోళ్లకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. కొనుగోళ్లు ప్రారంభించిన వెంటనే ఎప్పటికప్పుడు ధాన్యాన్ని తరలించాల్సి ఉం టుంది. దీంతో తర్వాత వచ్చే రైతులకు కూడా ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు సజావుగా జరుగనున్నాయి. ఈ సారి కూడా జిల్లాలో 3.05లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా 4.22లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడులు రావచ్చని అంచనా వేస్తున్నా రు. ఇలా వచ్చిన ధాన్యంలో సింహభాగం కొనుగోలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 

త్వరలోనే వందశాతం పూర్తి...


సీఎంఆర్‌ సేకరణలో ఇప్పటివరకు 86శాతం లక్ష్యాన్ని చేరుకున్నాం. త్వరలోనే సీఎంఆర్‌లో వందశాతం లక్ష్యాన్ని చేరుకుంటామనే నమ్మకం ఉంది. సీఎంఆర్‌ సేకరణపై కలెక్టర్‌ మార్గదర్శనంలో ప్రత్యేక వ్యూహంతో వ్యవహరించాం. మిల్లర్ల సహకారం కూడా మరువలేనిది. సీఎంఆర్‌ సేకరణతో ప్రస్తుతం ధాన్యం దిగుమతులకు ఇబ్బందులు ఉం డవు. సరిపడా స్థలం అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్దేశానికి అనుగుణంగా అంతిమంగా రైతుకు మేలు చేయడమే అందరి లక్ష్యం. 

 - వనమాల చంద్రశేఖర్‌, అదనపు కలెక్టర్‌ 

logo