సోమవారం 26 అక్టోబర్ 2020
Nalgonda - Oct 02, 2020 , 00:47:01

రాజస్తాన్‌ కేంద్రంగా ఫేస్‌బుక్‌ ముఠా దందా!

రాజస్తాన్‌ కేంద్రంగా  ఫేస్‌బుక్‌ ముఠా దందా!

  • పోలీసుల అదుపులో ఐదుగురు 
  • నేడు నల్లగొండకు నిందితులు

నల్లగొండ ప్రతినిధి, నమస్తే తెలంగాణ  కొంతకాలంగా పోలీసుల పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలు సృష్టించి డబ్బు  పాల్పడుతున్న ముఠాను నల్లగొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా ఏకంగా నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్‌ ఫేస్‌బుక్‌ ఖాతాకే ఎసరు పెట్టిన విషయం తెలిసిందే. ఎస్పీతోపాటు రాష్ట్రంలోని పలువురి పోలీసు ఉన్నతాధికారుల ఖాతాలకు కూడా నకిలీ అకౌంట్లు సృష్టించారు. వారి పేరుతో మెసెంజర్‌లో డబ్బులు డిమాండ్‌ చేస్తూ బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు. తన పేరుతోనే నకిలీ అకౌంట్‌ సృష్టించడంతో ఎస్పీ రంగనాథ్‌ సీరియస్‌గా తీసుకున్నారు. ఈ ముఠా గుట్టురట్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

నిష్ణాతులైన సైబర్‌ బృందంతో ఈ కేసును మానిటర్‌ చేశారు. పలు రకాల అకౌంట్ల సృష్టితోపాటు వారు ఇస్తున్న ఫోన్‌ నెంబర్ల ఆధారంగా కేసు దర్యాప్తును మొదలు పెట్టారు. ఒక్కో నెంబర్‌ను విశ్లేషిస్తూ వెళ్తుంటే రాజస్తాన్‌ నుంచి ఇలా అకౌంట్లను అపరేట్‌ చేస్తున్నట్లుగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణతోపాటు మరో ఐదు రాష్ర్టాలకు చెందిన 230మందికి పైగా పోలీసు అధికారుల పేరుతో అకౌంట్లు సృష్టించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించి పక్కాగా నిర్ధారించుకున్నాక ప్రత్యేక పోలీసు బృందం రాజస్తాన్‌కు బయలుదేరింది. నాలుగు రోజుల కిందటే రాజస్తాన్‌కు చేరుకుని ఓ కుగ్రామంలో ముఠా సభ్యులు ఉంటున్నట్లు గుర్తించింది.

అక్కడి పోలీసుల సహకారంతో చాకచాక్యంగా మొత్తం ఐదుగురిలో ముగ్గురిని అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టినట్లు సమాచారం. వారిని కూడా అదుపులోకి తీసుకుని ఐదుగురిని నల్లగొండకు తరలించాలన్న యోచనలో పోలీసులు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎస్పీ రంగనాథ్‌ ఇక్కడి నుంచే ఎప్పటికప్పుడు వారిని గైడ్‌ చేస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

అయితే వీరిని నల్లగొండకు తీసుకొచ్చిన అనంతరం ఎస్పీ రంగనాథ్‌ స్వయంగా విచారించనున్నట్లు తెలిసింది. విచారణ అనంతరం కేసు నమోదు చేసి ఒకటి, రెండ్రోజుల్లో అరెస్టు చూపించనున్నట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది.


logo