శనివారం 05 డిసెంబర్ 2020
Nalgonda - Sep 30, 2020 , 02:05:26

ఆస్తుల భద్రతకు ఆన్‌లైన్‌

ఆస్తుల భద్రతకు ఆన్‌లైన్‌

భూముల ధరలు పెరగడం.. రికార్డుల నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల గ్రామాలు, పట్టణాల్లో వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. హద్దులు, ఆస్తి పంపకాల్లో ఘర్షణలు సర్వసాధారణంగా మారాయి. ఈ నేపథ్యంలో శాశ్వత పరిష్కారం దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే భూ రికార్డుల ఆధునీకరణ విజయవంతంగా పూర్తిచేయగా... తాజాగా వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, స్థిరాస్తులపై ప్రజల హక్కులకు మరింత రక్షణ కల్పించేలా ‘ధరణి’ వెబ్‌సైట్‌కు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు గ్రామాలు, పట్టణాల్లో ఆస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియ ఇప్పటికే పూర్తికావస్తున్నది. ప్రభుత్వ సిబ్బంది బృందాలుగా ఏర్పడి వివరాలను సేకరించి ఉచితంగా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. సమగ్ర వివరాలతో కూడిన ‘ధరణి’ పోర్టల్‌ దసరా నాటికి ప్రజలకు అందుబాటులోకి రానుంది.

నల్లగొండ ప్రతినిధి, నమస్తే తెలంగాణ :  గ్రామాలు, పట్టణాల్లో ఆస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు ప్రజల నుంచి చక్కని స్పందన లభిస్తోంది. స్వచ్ఛందంగా వచ్చి వివరాలు నమోదు చేయించుకుంటున్నారు. మున్సిపాలిటీల్లో వార్డుకు ఒక ప్రత్యేక అధికారి నేతృత్వంలో బృందాన్ని ఏర్పాటు చేశారు. గ్రామాల్లో కార్యదర్శులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. 

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 40నుంచి 50శాతం ఆస్తులు ఇంతకు ముందే ఆన్‌లైన్‌ అయ్యాయి. ప్రజల అవసరాల రీత్యా లేదంటే ప్రభుత్వ అవసరాల కోసం వీటిని సేకరించారు. కానీ ఇప్పుడు ఆస్తుల వివరాలను నూరుశాతం ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియను చేపట్టారు. ఈ మేరకు దసరా నాటికి ధరణి పోర్టల్‌ను ప్రజలకు ముందుకు తేనున్నారు.

97శాతానికి పైగా నిర్మాణాలు ఆన్‌లైన్‌లోకి...

ఉమ్మడి నల్లగొండ పంచాయతీల్లో 97శాతం నిర్మాణాలను ఆన్‌లైన్‌ చేశారు. ఇండ్లు, ప్రైవేటు, ప్రభుత్వ భవనాలు, అపార్ట్‌మెంట్లు, ఫాంహౌస్‌లు ఇక ఇతర అన్ని రకాల నిర్మాణాలు ఇందులో ఉన్నాయి. వీటికి సంబంధించిన తాజా కొలతల వివరాలు, యజమానుల వివరాలు సమగ్రంగా సేకరిస్తున్నారు. ముందుగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కేవలం వివిధ రకాల నిర్మాణాలకు సంబంధించిన వివరాలనే సేకరించే పని తుదిదశకు చేరుకుంది. ఈ నెల 29(మంగళవారం)నాటికి నల్లగొండ జిల్లాలో 96.5శాతం, సూర్యాపేటలో 98.07శాతం, యాదాద్రి జిల్లాలో 98.85శాతం నిర్మాణాలను ఆన్‌లైన్‌ రికార్డులోకి చేర్చారు. బుధవారంతో వందశాతం పూర్తి చేయాలన్న లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. నిర్మాణాల వివరాలు పూర్తిగా సేకరించాక ఇళ్లు, స్థలాల వివరాలను ప్రత్యేకంగా సేకరించనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారులు చెబుతున్నారు. అక్టోబర్‌ 10నాటికి అన్ని రకాల ఆస్తుల వివరాలను సేకరించాలని ప్రభుత్వం దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్‌, చెరువుశిఖం, ఆక్రమిత భూముల వివరాలను కూడా పక్కాగా నమోదు చేయనున్నారు. రానున్న కాలంలో ప్రభుత్వ ఆస్తులకు, భూములకు రక్షణ కల్పించాలన్నది కూడా ప్రభుత్వ ఉద్దేశం. 

మున్సిపాలిటీల్లోనూ ముమ్మరంగా..

ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లోనూ వార్డుల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌ ప్రక్రియను వేగవంతం చేశారు. ఇప్పటికే 70నుంచి 80శాతం నిర్మాణాలు ఆన్‌లైన్‌లో నమోదై ఉన్నాయి. గతంలోనే జీపీఎస్‌ ద్వారా ఆయా నిర్మాణాల కొలతను సైతం సేకరించారు. ఆస్తిపన్ను అసెస్‌మెంట్‌ను కూడా చేశారు. దీంతో మిగిలిన నిర్మాణాల వివరాలను సేకరించే పని ముమ్మరంగా సాగుతోంది. నల్లగొండ జిల్లాలో ఏడు, సూర్యాపేట జిల్లాలో ఐదు, యాదాద్రి జిల్లాలో ఆరు మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిన్నింటిలోనూ ఖాళీ స్థలాలు, ప్లాట్లు, ఫాంహౌస్‌లు, ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు, అపార్ట్‌మెంట్లు ఇలా ప్రతీ నిర్మాణం వివరాలు ఆన్‌లైన్‌ చేయనున్నారు. ఆన్‌లైన్‌లో నమోదు చేశాక జాబితాను విడుదల చేశారు. వాటిల్లో అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తారు. వాటిని పరిష్కరించిన అనంతరం తుదిజాబితాను విడుదల చేయనున్నారు. ఈ తుదిజాబితాలోని అంశాలే రానున్న కాలంలో ధరణి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయనున్నారు. 

ముందుగా నిర్మాణాల వివరాలు ఆన్‌లైన్‌...

ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందుగా గ్రామాల్లోని అన్ని రకాల నిర్మాణాలను తాజా కొలతలతో ఆన్‌లైన్‌ చేస్తున్నాం. జిల్లాలో ఈ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. నేటితో వందశాతం నిర్మాణాల ఆన్‌లైన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నాం. తర్వాత వీటిపై ప్రజల నుంచి ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తాం. అనంతరం తుది జాబితాను రూపొందిస్తాం. ఇక ఖాళీ స్థలాలు, వ్యవసాయేతర భూములు తదితర వివరాలను కూడా ఆన్‌లైన్‌ చేయాల్సి ఉంది. దీని విషయంలో తదుపరి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకుంటాం. - విష్ణువర్ధన్‌రెడ్డి,  జిల్లా పంచాయతీ అధికారి, నల్లగొండ