శనివారం 24 అక్టోబర్ 2020
Nalgonda - Sep 24, 2020 , 06:49:49

నిర్లక్ష్యంపై సస్పెన్షన్‌ వేటు

నిర్లక్ష్యంపై సస్పెన్షన్‌ వేటు

  • జాబితాలో ఐదుగురు సర్పంచులు, ఐదుగురు ఉప సర్పంచులు ఆరుగురు 
  • పంచాయతీ కార్యదర్శులు, ఇద్దరు ఎంపీఓలపైనా చర్యలు
  • పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యంపై సీరియస్‌
  • ఉత్తర్వులు జారీచేసిన కలెక్టర్‌ పీజే పాటిల్‌ 

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు పడింది. ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయని పలువురు సర్పంచులు, ఉపసర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మండల పంచాయతీ అధికారులపైనా కఠిన చర్యలు తీసుకున్నారు. నల్లగొండ జిల్లాలో విధుల పట్ల అలసత్వం వహిస్తున్న ఆరుగురు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ పీజే పాటిల్‌ బుధవారం ఉత్వర్వులు జారీ చేశారు. రెండు మండలాల పంచాయతీ అధికారులను సరెండర్‌ చేస్తూ చర్యలు తీసుకున్నారు. ఇక పంచాయతీ పాలనలో నిబంధనలు ఉల్లంఘించిన ఐదుగురు సర్పంచులు, ఐదుగురు ఉపసర్పంచులను సైతం వదిలిపెట్టలేదు. నివేదికల ఆధారంగా వారిపై చర్యలు తీసుకున్నారు. 

నల్లగొండ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : హరితహారంలో మొక్కల పెంపకం, సంరక్షణ, పల్లె ప్రగతి పనులు, గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వహించిన పలువురు సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులపై వేటు వేస్తూ బుధవారం నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కేతేపల్లి మండలం ఉప్పలపహాడ్‌, పెద్దవూర మండలం పాల్తితండా సర్పంచులు, తిరుమలగిరి(సాగర్‌)మండలం అల్వాల, గుండ్లపల్లి మండలం సింగరాజుపల్లి పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్‌ చేశారు. కేతేపల్లి మండలం ఉప్పలపహాడ్‌ సర్పంచ్‌ గ్రామపంచాయతీలో చేపట్టిన అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనకుండా నిర్లక్ష్యం వహించడం, పెద్దవూర మండం పాల్తితండా సర్పంచ్‌ గ్రామంలో ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ కూల్చివేత పనులపై డివిజనల్‌ పంచాయతీ అధికారి నివేదిక మేరకు సస్పెండ్‌ చేశారు. తిరుమలగిరి(సాగర్‌)మండలంలోని అల్వాల కార్యదర్శి, పల్లెప్రగతి, పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యం, గుండ్లపల్లి మండలం సింగరాజుపల్లి కార్యదర్శి గ్రామపంచాయతీ ఆస్తి పన్నును సకాలంలో జమచేయకపోవడం కారణంగా సస్పెండ్‌ చేశారు. అదేవిధంగా మార్చి నుంచి సెప్టెంబర్‌ వరకు తిప్పర్తి మండలం ఏ.దుప్పలపల్లి, కట్టంగూర్‌ మండలం పామనగుండ్ల, గుర్రంపోడు మండంలోని జూనూతుల, చింతపల్లి మండలంలోని గడియగౌరారం, చిట్యాల మండంలోని ఏపూరు పంచాయతీ కార్యదర్శులను హరితహారం, పల్లెప్రగతి పనులు, పారిశుధ్యం, ఆస్తిపన్ను జమ చేయకపోవడం, అక్రమ లేఅవుట్లకు అనుమతి మంజూరు కారణాలతో సస్పెండ్‌ చేశారు. చండూరు మండలం చామలపల్లి సర్పంచ్‌ గ్రామంలో అందుబాటులో లేకపోవడం కారణంతో అధికారుల నివేదికను అనుసరించి సస్పెండ్‌ చేశారు. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు చందంపేట మండలం యాపలబావితండా, నార్కట్‌పల్లి మండలం చౌడంపల్లి, గుండ్లపల్లి మండలం పెద్దతండా, కొండమల్లేపల్లి మండలం గన్యానాయక్‌తండా, తిరుమలగిరి(సాగర్‌)మండలం ఎర్రచెర్వుతండా ఉప సర్పంచులను చెక్కులపై సంతకాలు పెట్టని కారణంగా సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.  

మండల పంచాయతీ అధికారులపై చర్యలు.. 

కట్టంగూర్‌ మండల పంచాయతీ అధికారి పారిశుధ్య పనుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం కారణంగా జూలై 13న సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా నాంపల్లి మండలం పంచాయతీ అధికారి పల్లె ప్రగతి పనులు, పారిశుధ్య పనుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం కారణంగా సెప్టెంబర్‌ 21న పంచాయతీరాజ్‌ కమిషనర్‌కు కలెక్టర్‌ సరెండర్‌ చేశారు. హరితహారం, పల్లెప్రగతి, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు. 


logo