మంగళవారం 27 అక్టోబర్ 2020
Nalgonda - Sep 23, 2020 , 03:20:09

రైతు రాజ్యం

రైతు రాజ్యం

  •  కొత్త రెవెన్యూ చట్టంపై అన్నదాత కృతజ్ఞత
  • ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో రోడ్లపై ర్యాలీలు
  • సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు పాలాభిషేకాలు
  • హుజూర్‌నగర్‌, మద్దిరాల, నాగారంలో సంబురాలు
  • రైతు బాగే రాష్ట్రం బాగు : ఎమ్మెల్యే సైదిరెడ్డి

హుజూర్‌నగర్‌/రూరల్‌ : రైతు బాగే.. రాష్ట్రం బాగు అని తలచే ముఖ్యమంత్రి ఉండడం మన అదృష్టమని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ మంగళవారం హుజూర్‌నగర్‌ పట్టణంలోని వెంకటేశ్వరస్వామి దేవాలయం నుంచి ఇందిరాసెంటర్‌ వరకు సుమారు వెయ్యి ట్రాక్టర్లతో రైతులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందిరా సెంటర్‌లో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పాలకులు వ్యవసాయం దండుగ అంటే.. మన ముఖ్యమంత్రి వ్యవసాయం పండుగ కావాలనే లక్ష్యంతో రైతులను అన్ని విధాలా బాగు చేయడానికి కంకణం కట్టుకున్నారన్నారు. ఇందుకోసం ప్రపంచంలో లేని రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను అమలు చేస్తున్నారన్నారు. వ్యవసాయం లాభాల బాట పట్టడంతో గ్రామాల్లో భూములకు రేట్లు పెరిగాయన్నారు. మేనిఫెస్టోలో పెట్టని ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశంలో తెలంగాణ పేరు నలుమూలలా వినిపించేలా చేసిన నాయకుడు సీఎం కేసీఆర్‌ అన్నారు. పాత రెవెన్యూ చట్టంతో రైతు నుంచి ఐఏఎస్‌ ఆఫీసర్‌ వరకు ఇబ్బందులు పడ్డారని, నూతన చట్టంతో భూములు అమ్మాలన్నా, కొనాలన్నా ఎక్కడా రూపాయి లంచం ఇచ్చే పని లేకుండా భూ మార్పిడి జరుగుతుందన్నారు. ఈ చట్టంతో ప్రజలు స్వచ్ఛందంగా సంబురాలు చేసుకుంటున్నారన్నారు. కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే మంత్రి సత్యవతి రాథోడ్‌తో బంజారాభవన్‌, మట్టపల్లి బ్రిడ్జిని త్వరలోనే ప్రారంభించనున్నామన్నారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, ట్రైబల్‌ వెల్ఫేర్‌ పాఠశాల, మేళ్లచెర్వులో ఈఎస్‌ఐ దవాఖాన, చింతలపాలెంలో పాలిటెక్నిక్‌ కళాశాల పనులను త్వరలోనే మొదలు పెట్టనున్నట్లు చెప్పారు. ముత్యాల, జాన్‌పహాడ్‌ మేజర్లకు లైనింగ్‌ ప్రక్రియ చేపట్టనున్నామని,  అమరవరం, గుర్రంపోడు లిఫ్టులకు మరమ్మతులు చేయిస్తున్నామన్నారు. మఠంపల్లిలోని 540 సర్వేనెంబర్‌లో ఉన్న నిజమైన రైతులకు న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గెల్లి అర్చన, ఎంపీపీ గూడెపు శ్రీనివాస్‌, జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ జక్కుల నాగేశ్వర్‌రావు, పట్టణాధ్యక్షుడు చిట్యాల అమర్‌నాథ్‌రెడ్డి, యరగాని శ్రీను, హరిబాబు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.  


logo