శనివారం 05 డిసెంబర్ 2020
Nalgonda - Sep 21, 2020 , 03:52:41

జిల్లా వ్యాప్తంగా వర్షం

జిల్లా వ్యాప్తంగా వర్షం

 అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వానలు

1913ఎకరాల్లో వరి,  693ఎకరాల్లో పత్తికి నష్టం 

రామగిరి/నల్లగొండ రూరల్‌ : ఉపరితల ఆవర్తన ద్రోణికితోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావానికి నల్లగొండ జిల్లాలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దీంతో పొలాలకు మేలు జరుగనుండగా, మెట్టపంటలకు తీవ్ర నష్టం కలుగనుంది. భారీ వర్షాలతో వాగులు, వంకలు, చెరువులు, కుంటలు అలుగుపోస్తూ జలకళను సంతరించుకున్నాయి. ఆదివారం సైతం నల్లగొండ, హాలియా, మాడ్గులపల్లి, పెద్దవూర, మునుగోడు, నార్కట్‌పల్లి, కనగల్‌, చండూర్‌, నాంపల్లి, మర్రిగూడ మండలాల్లో వర్షం కురిసింది.  

2606 ఎకరాల్లో పంట నష్టం..   

జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట నష్టం జరిగింది. 11మండలాల్లోని 42 గ్రామాల పరిధిలో వరి, పత్తిచేలల్లో నీరు చేరి పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయాధికారులు ప్రాథమిక అంచనా వేశారు.

ఈ గ్రామాల పరిధిలోని 426మంది రైతులకు చెందిన 1913 ఎకరాల్లో వరి, 693ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లినట్లు డీఏఓ శ్రీధర్‌రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం వరి పొట్టకొచ్చే దశలో ఉండగా, పత్తి పూతకు వచ్చాయి. వర్షానికి పత్తి గూడలు రాలి పోతుండడంతో నష్టం వాటిల్లుతుందని రైతులు పేర్కొంటున్నారు. సాధరణంగా 33శాతం కంటే ఎక్కువ నష్టం జరిగితే వ్యవసాయ శాఖ జరిగిన నష్టాన్ని అంచానా వేస్తుంది. ప్రభుత్వ సూచన మేరకు 33శాతం నష్టం జరిగినా ప్రస్తుతం ప్రాథమిక అంచనా వేశారు. తొలిదశ ప్రాథమికంగా జరిగినప్పటికీ, రేపు, ఎల్లుండికి పంటచేలు పూర్తిస్థాయిలో తేరుకునే అవకాశం ఉందని  అధికారులు పేర్కొన్నారు.