మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Nalgonda - Sep 16, 2020 , 02:21:11

ధరణి ధీమ

ధరణి ధీమ

  • కార్యాలయాల్లో ముప్పుతిప్పలకు చెల్లుచీటీ!
  • అవినీతి రహిత, నాణ్యమైన సేవలే లక్ష్యం 
  • కొత్త మున్సిపల్‌, పంచాయతీ చట్టాలతో ఎంతో మేలు
  • అన్ని సేవలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలోనే..
  • కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం రాదు
  • ఆస్తుల కొనుగోలుదారులకు తప్పనున్న కష్టాలు
  • క్రయవిక్రయాల్లో అక్రమాలకు అడ్డుకట్ట 
  • ‘ధరణి’లోనే ప్రత్యేక పోర్టల్‌ ద్వారా సేవలు

‘నల్లగొండలోని వీటీకాలనీలో రమేశ్‌ అనే వ్యక్తి రెండంతస్తుల భవనం కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకుని మున్సిపల్‌ కార్యాలయంలో మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. నిర్ణీత గడువు ముగిసినా తిరిగి తిరిగి వేసారిపోయాడు తప్ప పనికాలేదు. చివరకు ఓ ఉద్యోగి ద్వారా పైరవీ చేసి కొంత డబ్బు చేతిలో పెట్టాక పనయ్యింది. కానీ, నల్లా కనెక్షన్‌, ఆస్తి పన్ను బదలాయింపు, కరెంటు కనెక్షన్‌ లాంటివన్నీ పాత ఓనర్‌ పేరుమీదనే వస్తున్నాయి. వాటి కోసం మరోసారి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు తప్పలేదు. పైగా పన్ను బకాయి చెల్లించాల్సిందేనని అధికారులు చెప్పారు. దీంతో అతడికి ఆర్థికంగా అదనపు భారం కాగా ఎంతో సమయం కూడా వృథా అయ్యింది.’ ఇదీ ప్రస్తుతం మున్సిపాలిటీల్లో ఆస్తుల క్రయవిక్రయాల్లో జరుగుతున్న తంతు. దాదాపు గ్రామ పంచాయతీల్లోనూ ఇదే రకమైన పరిస్థితి. ఇక ముందు ఇలాంటి ఇబ్బందులు ఉండవు. చాలా సరళమైన రీతిలో సేవలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్త మున్సిపల్‌, గ్రామపంచాయతీ చట్టాలను రూపొందించింది. అసెంబ్లీ ఆమోదం పొందడంతో ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

తగ్గనున్న పనిభారం...

కొత్త చట్టాల వల్ల మున్సిపల్‌, పంచాయతీ అధికారులు, సిబ్బందిపై పనిభారం తగ్గనుంది. మ్యుటేషన్‌ పనులు ఇక ముందు ఉండబోవు. ఆస్తి పన్ను, నల్లా కనెక్షన్లలో పేర్ల మార్పుల అవసరం ఉండదు. పైగా బకాయి వసూళ్ల కోసం సిబ్బంది తిరిగే పని కూడా తగ్గిపోనుంది. వీటి స్థానంలో ప్రజలకు అవసరమైన మరిన్ని సేవలను అందించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. సిబ్బందిపై అవినీతి మరకలు కూడా తొలగిపోయే అవకాశం ఉంది.

నల్లగొండ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పట్టణాలు, గ్రామాల్లో ఇళ్లు, స్థలాలు, భవనాలు, ఇతర ఆస్తుల క్రయవిక్రయాలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనే జరుగనున్నాయి. ఒక్క సేల్‌డీడ్‌నే కాకుండా మిగతా సేవలన్నీ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అందనున్నాయి. రిజిస్ట్రేషన్‌ కోసం ముందుగా స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. ఇచ్చిన సమయం ప్రకారం ఇరువర్గాలు నిర్ణీత సమయానికి వచ్చి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో పాల్గొనాలి. ఆ తర్వాత అక్కడి నుంచే మున్సిపాలిటీ రికార్డుల్లోనూ ఆస్తి పన్ను రికార్డు, నల్లా కనెక్షన్ల బదలాయింపు జరిగినట్లు ఆన్‌లైన్‌ ద్వారా మ్యుటేషన్‌ను కూడా పూర్తి చేస్తారు. ఆ తర్వాత సంబంధిత ధ్రువీకరణ పత్రాన్ని కొనుగోలుదారుడికి అందజేస్తారు. అయితే పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను, నల్లా, ఇతర బిల్లులు రిజిస్ట్రేషన్‌ కంటే ముందే  ఉంటుంది. అవి చెల్లించినట్లు క్లియరెన్స్‌ ఉంటేనే రిజిస్ట్రేషన్‌కు వెబ్‌సైట్‌ ఓకే చెబుతుంది. దీనివల్ల క్రయవిక్రయాల్లో అక్రమాలకు చెక్‌ పడనుంది. పైగా కొనుగోలుదారులకు ఎంతో మేలు జరుగనుంది. వ్యవసాయ భూ రికార్డుల కోసం నిర్వహిస్తున్న ధరణి పోర్టల్‌లోనే వ్యవసాయేతర భూముల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో ఆస్తుల వివరాలన్నీ ఆన్‌లైన్‌ చేసే ప్రక్రియ ఎప్పుడో మొదలైంది. దాన్ని పూర్తి చేసి సమగ్రంగా అన్ని వివరాలను ధరణి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయనున్నారు. ఇక ముందు దీని ద్వారానే అన్ని రకాల లావాదేవీలు జరుగనున్నాయి. రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు, సిబ్బంది జోక్యం లేకుండా పనులు ఆటోమెటిక్‌గా జరిగిపోనున్నాయి. 

తగ్గనున్న పనిభారం...

కొత్త చట్టాల వల్ల మున్సిపల్‌, పంచాయతీ అధికారులు, సిబ్బందిపై పనిభారం తగ్గనుంది. మ్యుటేషన్‌ పనులు ఇక ముందు ఉండబోవు. ఆస్తి పన్ను, నల్లా కనెక్షన్లలో పేర్ల మార్పుల అవసరం ఉండదు. పైగా బకాయి వసూళ్ల కోసం సిబ్బంది తిరగాల్సిన పని కూడా తగ్గిపోనుంది. వీటి స్థానంలో ప్రజలకు అవసరమైన మరిన్ని సేవలు  ఆస్కారం ఏర్పడుతుంది. పారిశుధ్యం, మంచినీటి సరఫరా, ఇతర మౌలిక సౌకర్యాల కల్పనలో సిబ్బందిని ఉపయోగించుకునేందుకు వెసులుబాటు లభించనుంది. సిబ్బందిపై ఉన్న అవినీతి మరకలు కూడా కొంతవరకు తొలగిపోయే అవకాశం ఉంది. చట్టం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే సులభతర సేవలపై మరింత స్పష్టత రానుంది.

ప్రజలకు సమయం, డబ్బు ఆదా..

కొత్త చట్టం ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతది. ఆఫీసుల చుట్టూ తిరిగే పని తప్పుతది. పట్నాల్లో ఇండ్లు, ప్లాట్లు కొనుగోలు చేస్తే వాటిని మ్యుటేషన్‌ చేయించుకోవాలంటే మస్తు తిప్పలు ఉండేవి. మున్సిపాలిటీ, కరెంటు ఆఫీస్‌ చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోయేవాళ్లు. పనులు వదులుకోని రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. కొత్త చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్‌ పూర్తయితే మ్యుటేషన్‌తోపాటు సర్వ హక్కుల బదలాయింపు కూడా ఒకేసారి అయితయని తెలిసింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో మోసాలకు చెక్‌  ప్రజలకు మరింత విశ్వాసం పెరుగుతది. ప్రజల మనసుల్లో ఉన్న విధంగా చట్టం వస్తుండడం చాలా సంతోషకరం. సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.

- దోసపాటి శ్రీనివాసులు, రియల్టర్‌, నల్లగొండ 

మ్యుటేషన్‌ కోసం నరకయాతన..

మా అమ్మాయి విదేశాల్లో స్థిరపడింది. ఇక్కడకు వచ్చినప్పుడు నల్లగొండలో ఓ ఇల్లు కొనుగోలు చేశాం. రిజిస్ట్రేషన్‌ అయ్యాక మిగతా పనుల బాధ్యత చూసుకొమ్మని నాకు అప్పజెప్పింది. మ్యుటేషన్‌ కోసం మున్సిపల్‌ కార్యాలయంలో రెండు నెలలు ముప్పుతిప్పలు పెట్టారు. కరెంటు మీటర్‌ మార్పిడికి కూడా చాలా కష్టాలు పడ్డా. ఏ పనీ ఒక్కసారికి కాలేదు. తిరిగి  అలిసిపోయా. అసలే రిటైర్డ్‌ ఉద్యోగిని. ఇలాంటి కష్టాలు అందరూ అనుభవిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ తీసుకొస్తున్న కొత్త చట్టం వీటన్నింటికీ పరిష్కారం చూపుతుందని చెబుతున్నారు. చట్టంలో ఉన్న ప్రకారం అన్ని జరిగితే.. ప్రజల కష్టాలు తప్పినట్లే. లంచాల అవసరం కూడా ఉండకపోవచ్చు. ముఖ్యమంత్రికి ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు. 

- మసన వెంకటేశ్వర్లు, నల్లగొండ



logo