బుధవారం 02 డిసెంబర్ 2020
Nalgonda - Sep 13, 2020 , 02:21:39

పథకాల అమలులో నిర్లక్ష్యం వద్దు

పథకాల అమలులో నిర్లక్ష్యం వద్దు

  • l   ‘దిశా’ సమావేశంలో మంత్రి     జగదీశ్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌ 
  • l   పలు కేంద్ర ప్రభుత్వ     పథకాలపై సమీక్ష
  • l   సూచనలు చేసిన ఎమ్మెల్యేలు
  • l   సమస్యలను ప్రస్తావించిన ఎంపీపీలు
  • l   పార్లమెంట్‌ సమావేశాల్లో నిధుల కోసం కృషి చేస్తా
  • l   రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ 

నల్లగొండ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కేంద్ర ప్రభుత్వ నిధులను  సద్వినియోగం చేసుకోవాలని, పథకాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నిధులేవైనా వాటిని సకాలంలో వినియోగించి ప్రజలకు మేలు జరిగేలా చూడాలని సూచించారు. శనివారం నల్లగొండ కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షక(దిశా)కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న పలు పథకాలపై సమీక్ష చేశారు. ముందుగా గత సమావేశంలో చర్చించిన అంశాలపై ప్రగతి నివేదికను అధికారులు సమర్పించారు. ఆ తరువాత వ్యవసాయం, వైద్యారోగ్య శాఖ, ట్రాన్స్‌కో, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, విద్యాశాఖల్లో కేంద్ర నిధులతో జరుగుతున్న పనులపై చర్చ జరిగింది. ఈ పథకాల్లో ఇప్పటివరకు జరిగిన ప్రగతి నివేదికను అధికారులు వివరించగా మధ్యలో సభ్యులు ప్రశ్నలు సంధించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. వైద్యారోగ్య శాఖ చేసే కార్యక్రమాల్లో గతానికి, ప్రస్తుతానికి తేడాపై ప్రశ్నించారు. కేసీఆర్‌ కిట్‌, ఇతర పథకాల అమలు ద్వారా వచ్చిన మార్పులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. గతంతో పోలిస్తే తల్లీబిడ్డల మరణాల రేటు తగ్గినట్లు స్పష్టమైందన్నారు. కరోనా విషయంలోనూ ప్రజలకు మరింత భరోసా ఇచ్చేలా పనిచేయాలని సూచించారు. దీనిపై పలువురు ఎంపీపీలు మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోమౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని కోరారు. దీంతోపాటు కొన్ని చోట్ల వైద్యసిబ్బందిని ఇతర ప్రాంతాలకు డిప్యుటేషన్‌పై పంపడంతోనూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సమావేశం దృష్టికి తెచ్చారు. అంబులెన్స్‌లు కూడా కావాలని కోరగా త్వరలోనే కొన్ని ఏరియాలకు ఎమ్మెల్యేల ద్వారా అందుబాటులోకి వస్తాయని మంత్రి చెప్పారు. విద్యుత్‌ శాఖపై జరిగిన చర్చలో ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మాట్లాడుతూ.. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో పలు సబ్‌స్టేషన్లు ప్రారంభించినా సరఫరా మొదలు పెట్టలేదన్నారు. త్వరలోనే ప్రజలకు వాటిని అందుబాటులోకి తేవాలని కోరారు. నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ పల్లె ప్రగతిలో భాగంగా నిర్మిస్తున్న శ్మశానవాటికలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. కొందరు సభ్యులు మాట్లాడుతూ.. మండల స్థాయిలోని విద్యుత్‌ సిబ్బంది కొన్నిచోట్ల విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవసహరిస్తున్నారని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. అలాంటి అధికారులు తీరు మార్చుకునేలా చర్యలు తీసుకుంటామని, ఇంకా ఏమైనా విద్యుత్‌ సమస్యలుంటే  ఏమ్మెల్యేల ద్వారా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. గ్రామీణాభివృద్ధి శాఖపై జరిగిన చర్చలో దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ మాట్లాడుతూ హరితహారంలో మొక్కలను ప్రణాళికాబద్ధంగా నాటడం లేదని, పల్లెపగ్రతి వనాలే అందుకు నిదర్శనమన్నారు. కొన్నిచోట్ల లెక్కల కోసమే మొక్కలు పెడుతున్నట్లుగా ఉందని, డబ్బులు వృథా అవుతున్నాయని ఆరోపించారు. డీఆర్‌డీఏ పీడీ శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ మియావాకీ తరహాలో నాటుతున్నామని చెప్పగా మంత్రి జగదీశ్‌రెడ్డి స్పందించారు. నాటిన మొక్కలు పెరిగి పెద్దయ్యేలా చూడాలని ఆదేశించారు. ఎమ్మెల్యే భాస్కర్‌రావు మాట్లాడుతూ పథకాల అమలుపై పలు సూచనలు చేశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి వివిధ పథకాలపై మాట్లాడుతూ ప్రతి పథకం లక్ష్యం నెరవేరేలా అధికారులు కృషి చేయాలన్నారు. అన్ని పథకాల లక్ష్యం కూడా ప్రజలకు మెరుగైన ప్రయోజనాలు కల్పించేలా ఉండాలన్నారు. విధుల నిర్వహణలో అలసత్వం ఉండకూడదని హెచ్చరించారు. కరోనా విషయంలో ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు. చివరలో దిశా చైర్మన్‌, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రం నుంచి మరిన్ని నిధుల కోసం ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే ప్రస్తావిస్తానని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మరిన్ని వసతుల కోసం మినరల్‌ ఫండ్‌ ఉపయోగించేలా చూడాలని మంత్రి జగదీశ్‌రెడ్డిని కోరారు. బీపీఎల్‌ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌ల కోసం కేంద్రంపై ఒత్తిడి తేచ్చే ప్రయత్నం చేస్తానన్నారు. కేంద్రంలో విద్యుత్‌ స్టాండింగ్‌ కమిటీలో సభ్యుడిగా తాను కూడా నిధుల కోసం కృషి చేస్తానని, హైదరాబాద్‌-విజయవాడల మధ్య హైస్పీడ్‌ రైలుమార్గం కోసం ఈ సమావేశాల్లో మాట్లాడుతానని  వివరించారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ మాట్లాడుతూ కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన నిధులపై గళం వినిపిస్తానని చెప్పారు. హైస్పీడ్‌ రైల్వేలైన్‌తోపాటు జాతీయ రహదారుల అభివృద్ధి నిధుల కోసం ప్రశ్నిస్తానన్నారు. అదేవిధంగా జీఎస్టీ బకాయిలపై చర్చను లేవనెత్తుతామని వివరించారు.  సమావేశంలో జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, అడిషనల్‌ కలెక్టర్‌ రాహుల్‌శర్మ, ట్రైనీ ఐఏఎస్‌ ప్రతిమాసింగ్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.   

 అభివృద్ధి, సంక్షేమ పథకాలను వేగంగా పూర్తి చేయాలి...

సూర్యాపేట, నమస్తేతెలంగాణ : రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వేగవంతంగా పూర్తి చేయాలని దిశ కమిటీ చైర్మన్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశా)సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, జిల్లా కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్‌ పద్మజారాణి, హుజూర్‌నగర్‌, కోదాడ ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్‌లతో కలిసి జిల్లా గ్రామీణాభివృద్ధి, విద్యుత్‌, మున్సిపాలిటీ, వ్యవసాయ, ఉద్యానవన, వైద్య, మహిళా శిశు సంక్షేమ, సివిల్‌ సప్లయ్‌, రెవెన్యూ, జిల్లా పరిశ్రమలు, పౌరసరఫరాల శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. శాఖల వారీగా చేపడుతున్న పనుల పురోగతిపై వారు సమీక్షించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఉపాధి హామీ పథకం కింద జిల్లాలోని 475గ్రామ పంచాయతీలు, 707ఆవాసాల్లో ఇప్పటి వరకు 2,69,508 కుటుంబాలకు జాబ్‌కార్డులను జారీ చేసి ఉపాధి హామీ పనులు చేపట్టినట్లు తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో లక్షల పని దినాలు లక్ష్యంగా నిర్దేశించి 1,60,727 కుటుంబాల్లో 3,04,413 మంది కూలీలకు ఇప్పటి వరకు 65లక్షల పని దినాలు కల్పించినట్లు తెలిపారు. కూలీలకు వేతనాల రూపంలో రూ.8271.26లక్షలు, సామగ్రి కోసం రూ.2009.03లక్షలు చెల్లించినట్లు చెప్పారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం కింది 474 శ్మశాన వాటికలు మంజూరు కాగా, ఇప్పటి వరకు 56 పూర్తి అయ్యాయన్నారు. 403 వివిధ దశల్లో ప్రగతిలో ఉన్నాయన్నారు. హరితహారం పథకం కింద ఈ సంవత్సరం 83.79లక్షల మొక్కలు నాటడం లక్ష్యం కాగా ఇప్పటి వరకు 71.12 లక్షల మొక్కలు నాటామన్నారు. సంపూర్ణ పారిశుధ్య నిర్వహణ కింద జిల్లాలో 472 డంపింగ్‌ యార్డులు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 398 పూర్తయ్యాయన్నారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌లో భాగంగా జిల్లాకు 70,065 మరుగుదొడ్లు మంజూరవగా 65,343 పూర్తయినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 2869 మంది రైతులకు పంట మార్పిడి కల్లాల నిర్మాణాలకు అనుమతి ఇవ్వగా 46 పూర్తయినట్లు స్పష్టం చేశారు. బ్యాంకు లింకేజీ ద్వారా 12958 మహిళా సంఘాలకు రూ.347.39లక్షల రుణాలు లక్ష్యం కాగా 5070 సంఘాలకు రూ.120.16లక్షలు అందజేశామన్నారు. జిల్లాలో 1,32,282 మందికి రూ.31,32,54,840ప్రతి నెలా ఆసరా పింఛన్లు అందిస్తున్నట్లు చెప్పారు. అధికారులు తమ శాఖల పురోగతిని వివరించగా అనంతరం సమీక్షించారు. సమావేశంలో పీడీ కిరణ్‌కుమార్‌, సీపీఓ అశోక్‌, డీసీఎస్‌ఓ విజయలక్ష్మి, డీసీఓ ప్ర సాద్‌, సంక్షేమాధికారులు నర్సింహారావు, శ్రీనివా స్‌, దయానందరాణి, ఏడీఏ జ్యోతిర్మయి, ఏడీ పరిశ్రమలు తిరుపతయ్య, ఎంపీపీలు పాల్గొన్నారు.