ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Nalgonda - Aug 14, 2020 , 03:45:23

తుది దశలో..

తుది దశలో..

l  మున్సిపాలిటీల్లో పూర్తికావొస్తున్న  పబ్లిక్‌ టాయిలెట్ల నిర్మాణాలు 

l  వెయ్యి మంది జనాభాకు ఒకటి చొప్పున ఏర్పాటు

l  నల్లగొండ జిల్లాలో 145, సూర్యాపేట జిల్లాలో 162 

l  ఇప్పటికే 90 శాతం పనులు పూర్తి

మున్సిపాలిటీల్లో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రతి వెయ్యిమందికి ఒక పబ్లిక్‌ టాయిలెట్‌ ఉండాలని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు జిల్లాలో వాటి నిర్మాణాలను వేగంగా పూర్తి చేస్తున్నారు. స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా నల్లగొండ జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో 145, సూర్యాపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 162 నిర్మిస్తుండగా ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయి. మిగతావి కొద్దిరోజుల్లో పూర్తికానున్నాయి. 

 నల్లగొండ జిల్లాలో..

నల్లగొండ : 25

దేవరకొండ : 10

మిర్యాలగూడ : 75

నందికొండ :  8

చిట్యాల :  6

హాలియా : 11

చండూరు : 10

మొత్తం :145

సూర్యాపేట జిల్లాలో 

సూర్యాపేట : 56

కోదాడ : 47

హుజూర్‌నగర్‌ :  3

తిరుమలగిరి : 36

నేరేడుచర్ల : 18

మొత్తం            : 162నల్లగొండ : స్వచ్ఛ భారత్‌లో భాగంగా పట్టణాలు, నగరాలను బహిరంగ మల మూత్ర విసర్జన రహిత ప్రాంతాలుగా మార్చడంతో పాటు ఆయా పనుల నిమిత్తం పట్టణాలకు వచ్చే వారు సైతం ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతోనే  ప్రభుత్వం సామూహిక మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టింది. వెయ్యి జనాభాకో పబ్లిక్‌ టాయిలెట్లను అన్ని మున్సిపాలిటీల్లో అందుబాటులో ఉంచాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సూచించారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఆ దిశగా చర్యలు తీసుకొని శరవేగంగా నిర్మాణాలు చేపడుతోంది.

సూర్యాపేట జిల్లాలో..

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఐదు మున్సిపాలిటీలు ఉండగా ఆయా మున్సిపాలిటీల్లో వెయ్యి మంది జనాభాకు ఒక సామూహిక మరుగుదొడ్డి చొప్పున మొత్తంగా 280 మరుగుదొడ్లు ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటి వరకు సూర్యాపేటలో 74, కోదాడలో 28, హుజూర్‌నగర్‌లో 14తో పాటు తిరుమలగిరిలో 4 మొత్తం 120 ఉండగా నేరేడుచర్లలో ఒక్కటి కూడా లేవు. దీంతో జిల్లా వ్యాప్తంగా సూర్యాపేట మున్సిపాలిటీలో 56, కోదాడ 47, నేరేడుచర్ల 3, హుజూర్‌నగర్‌ 36, తిరుమలగిరి మున్సిపాలిటీ 18 ఇలా మరో 162 టాయిలెట్ల నిర్మాణాలు చేపడుతున్నారు. మున్సిపల్‌ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టి పనులు శరవేగంగా పూర్తి చేయిస్తున్నారు. తాజాగా నిర్మాణం చేపట్టిన 162 పబ్లిక్‌ టాయిలెట్లు 50 శాతం మహిళల కోసం కేటాయించనున్నారు. ఈ పంద్రాగస్టు నాటికే నిర్మాణాలు పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేయడంతో ఆ దిశగా అధికారులు ఇప్పటికే 90 శాతం పనులు పూర్తి చేశారు.  

నల్లగొండ జిల్లాలో.. 

నల్లగొండతో పాటు మిర్యాలగూడ, దేవరకొండ, హాలియా, నందికొండ, చండూర్‌, చిట్యాలతో మొత్తం ఏడు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీల్లో జనాభా ఆధారంగా 365 సామూహిక మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉంది. అయితే ఆయా మున్సిపాలిటీల్లో 223 పబ్లిక్‌ టాయిలెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 145 టాయిలెట్లు వెంటనే నిర్మించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నూతనంగా నల్లగొండలో 25 టాయి లెట్లు నిర్మిస్తుండగా దేవరకొండలో 10, మిర్యాలగూడలో 75, నందికొండలో 8, చిట్యాలలో 6, హాలియాలో 11, చండూర్‌లో 10 నిర్మిస్తున్నారు. ఇం దులో ఇప్పటికే 90 శాతం మరుగుదొడ్లు పూర్తి కాగా మిగిలినవి నేడో, రేపో అందుబాటులోకి రానున్నాయి.

అన్ని టాయిలెట్లు 

ముగింపు దశలో ఉన్నాయి 

జిల్లా వ్యాప్తంగా ఏడు మున్సిపాలిటీల్లో 145 నూతన సామూహిక మరుగుదొడ్లు నిర్మిస్తున్నాం. వెయ్యి మంది ఒక మరుగుదొడ్డి చొప్పున మొత్తం 365 టాయిలెట్స్‌ ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 223 మాత్రమే ఉన్నాయి. దీంతో ఇంకో 146 పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మిస్తున్నాం. దాదాపు అన్ని మున్సిపాలిటీల్లోనూ 90 శాతం పైగా పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు రెండు, మూడు రోజుల్లో పూర్తవుతాయి. 

 -రాహుల్‌ శర్మ,  నల్లగొండ అదనపు కలెక్టర్‌


logo