మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Nalgonda - Aug 11, 2020 , 02:26:54

ముకుందా.. ముకుందా

ముకుందా.. ముకుందా

  • l నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి
  • l కరోనాతో ఇళ్లల్లోనే ఉత్సవాలు
  • l ఉట్టికొట్టే వేడుకకు దూరం

శ్రావణ మాసంలో వచ్చే చివరి ముఖ్యమైన పర్వదినం శ్రీకృష్ణ జన్మాష్టమి. ఈ ఉత్సవాన్ని మంగళవారం నిర్వహించుకునేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. కరోనా కారణంగా తమ ఇళ్లల్లోనే పండుగ జరుపుకోనున్నారు. ఆలయాల్లో పూజలు యథావిధిగా జరిగినా.. ఉట్టికొట్టే వేడుకకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఉత్సవాల్లో పాల్గొనే భక్తులు కొవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. 

- నల్లగొండ కల్చరల్‌


శ్రీమహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించేందుకు ఎనిమిదో అవతారంగా వచ్చాడని.. ఆ అవతారమే శ్రీకృష్ణ జననానికి మూలమని పురాణాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు ఎనిమిదో సంతానంగా శ్రావణమాసం కృష్ణపక్షం అష్టమి తిథి రోజు కంసుడు బంధించిన చెరసాలలో జన్మించాడు. ఈ రోజునే కృష్ణాష్టమి, జన్మాష్టమి, గోకులాష్టమి, అష్టమిరోహిణి అనే పేర్లతో పిలుస్తారు. శ్రీకృష్ణాష్టమి రోజు పూజలు చేసిన అనంతరం సాయంత్రం ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ పర్యాయం కరోనా కారణంగా ప్రజలు గుమిగూడే కార్యక్రమాలకు దూరంగా ఉంటుండగా.. ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించకూడదని పలువురు పేర్కొంటున్నారు. 

పండుగ నిర్వహణ ఇలా...

కృష్ణాష్టమి రోజు పగలంతా ఉపవాసం ఉండి శ్రీకృష్ణుడిని పూజిస్తారు. శ్రావణమాసంలో లభించే పండ్లు, అటుకులు, బెల్లంతో పాటు వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం కృష్ణుడి విగ్రహాన్ని ఉయ్యాల్లో ఉంచి భక్తి పాటలు పాడతారు. సాయంత్రం ఆలయ ఆవరణల్లో ఉట్టి కట్టి దానిని పగుల గొట్టేందుకు భక్తులు పోటీ పడతారు. అందుకే ఈ పండుగను ‘ఉట్ల పండగ’ అని కూడా పిలుస్తారు. ఈ పండుగ రోజు ఆలయాల్లో ఉదయాన్నే గోపూజ నిర్వహిస్తారు. శ్రీ కృష్ణ జయంతిని వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసినంత పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం.  

 పూజలకే పరిమితం

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ సారి శ్రీకృష్ణాష్టమిని పూజలకే పరిమితం చేయాలని భావిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పలు దేవాలయాలు, ఇతర ప్రాంతాల్లో  ఘనంగా నిర్వహించేవారు. కానీ ఈ సారి మాత్రం ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని, జనం గుమిగూడే ఉట్టికొట్టే కార్యక్రమం మాత్రం నిర్వహించవద్దని పలు ఆలయ కమిటీలు నిర్ణయించాయి. 

పూజలే చేస్తాం.. ఉట్టి కొట్టడం లేదు


కరోనా వైరస్‌ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో శ్రీ కృష్ణజన్మాష్టమిని పూజలు, అభిషేకాలకే పరిమితం చేస్తున్నాం. ఆలయంలో ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తాం. ఉట్టికొట్టే కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. దీంతో వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అందుకే ఈ కార్యక్రమం నిర్వహించవద్దని నిర్ణయించాం. భక్తులు సహకరించాలి. 

- రుద్ర వెంకటేశం, మేనేజర్‌, శ్రీ భక్తాంజనేయస్వామి దేవస్థానం, తులసీనగర్‌, నల్లగొండ.logo