మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Nalgonda - Aug 09, 2020 , 03:35:02

ఫస్ట్‌ కాల్‌ అమ్మకే చేశా..

ఫస్ట్‌ కాల్‌ అమ్మకే చేశా..

  • ర్యాంకు గురించి చెబుతూ బోరున ఏడ్చేశా..
  • అమ్మనాన్నలు పడ్డ కష్టం అలాంటిది
  • విఫలమైన ప్రతిసారీ వెన్నుతట్టారు
  • ఆరో ప్రయత్నంలో సక్సెస్‌ అయ్యా.. ఐపీఎస్‌ పక్కా..
  • పక్కా ప్రణాళిక, చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే అసాధ్యమేమీ కాదు
  • ఏడాది పాటు సోషల్‌ మీడియాకు దూరం
  • సామాన్యుల సేవకుడిగా ఉంటా.. 
  •  ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూలో సివిల్స్‌ ర్యాంకర్‌ శీతల్‌కుమార్‌ 

‘నాకు ఊహ తెలిసిన నాటి నుంచి నాన్న టైలర్‌.. అమ్మ టైలరింగ్‌ మెటీరియల్స్‌ అమ్ముతుంటది.. చిన్నప్పటి నుంచి నేను కూడా చాలాసార్లు వాళ్లతో షాప్‌కు వెళ్లేవాడిని.. నాకు స్కూల్‌, కాలేజీ సెలవులు ఉన్నాయంటే అమ్మకు తోడుగా అక్కడే ఉండేవాడ్ని.. ఉదయం 9 నుంచి రాత్రి 9గంటల వరకు ఇద్దరికీ అదే పని. అమ్మ పడిన కష్టం స్వయంగా చూసిన.. అది మాటల్లో వ్యక్తం చేయలేనిది.. అందుకే సివిల్స్‌ ర్యాంకు తెలియగానే ఫస్ట్‌ కాల్‌ అమ్మకే చేశా.. ఏడుపు ఆగలేదు.. బోరున ఏడ్చేశా.. కొద్దిసేపటికి ఆ సంతోషాన్ని అమ్మ పక్కనే ఉన్న నాన్న, అక్కబావలతో పంచుకున్నా.. నా కలనే వారందరి కలగా భావిస్తూ వచ్చారు.. నా జీవితంలో మరుపురాని, మరువలేని క్షణాలు అవి.. ఓ కొడుకుగా తల్లిదండ్రులకు ఇంతకంటే ఏమివ్వగలను’ సివిల్స్‌ ర్యాంకర్‌ రేణుకుంట్ల శీతల్‌కుమార్‌ మనసులోని భావాలు ఇవి. తన ఆరో ప్రయత్నంలో సివిల్స్‌లో 417 ర్యాంకు సాధించిన శీతల్‌కుమార్‌ది నల్లగొండ పట్టణంలోని క్రాంతినగర్‌. ర్యాంకు విషయం తెలిసే సమయానికి ఆదిలాబాద్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర శాఖ కార్యాలయంలో విధి నిర్వహణలో ఉన్నాడు. అక్కడి నుంచే ఫోన్‌లో తన ఆనందాన్ని కుటుంబసభ్యులతో పంచుకున్నాడు. శని, ఆదివారాలు సెలవు కావడంతో నల్లగొండలోని తన స్వగృహానికి చేరుకున్నాడు. స్వీట్లు తినిపిస్తూ, బొకే అందిస్తూ కుటుంబసభ్యులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా తన మనోభావాలను పంచుకున్నాడు. తన సక్సెస్‌ స్టోరీలో ఎత్తుపల్లాల గురించి చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు. తన ప్రస్థానంలో తల్లి కష్టం గుర్తొచ్చి కంటతడి పెట్టాడు. ఆ వెంటే తన్నుకొచ్చిన ఆనందబాష్పాలతో పంచుకున్న ఆ విశేషాలే ఇవి..

- నల్లగొండ ప్రతినిధి, నమస్తే తెలంగాణ


నల్లగొండ ప్రతినిధి - నమస్తే తెలంగాణ :  నల్లగొండ పట్టణం క్రాంతినగర్‌కు చెందిన సామాన్య కుటుంబం వారిది. రేణుకుంట్ల నరేందర్‌, సుజాత దంపతుల ఏకైక కుమారుడు శీతల్‌కుమార్‌. అతడి అక్క సింధూర ఎస్‌బీఐలో ఉద్యోగి. బావ నాగరాజు డివిజనల్‌ ఇంజినీర్‌. తండ్రి టైలర్‌గా పని చేస్తుండగా.. తల్లి టైలర్‌ మెటీరియల్‌ విక్రయించే చిన్న వ్యాపారం నిర్వహిస్తోంది. శీతల్‌ కుమార్‌ ప్రాథమిక విద్య నల్లగొండలోని ఆల్ఫా స్కూల్‌లో, సెకండరీ విద్య కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌లో సాగింది. టెన్త్‌లో 86శాతం, ఇంటర్‌ నారాయణలో చదవగా 85శాతం మార్కులు వచ్చాయి. బీటెక్‌ వర్ధమాన్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో పూర్తి చేశాడు. ఇక్కడ ఉండగానే ఎన్‌సీసీలో చేరాడు. ఈ సందర్భంగా పలు సేవాకార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఇలాంటి సేవా కార్యక్రమాలు  విస్త్రతంగా చేయాలంటే సివిల్‌ సర్వీస్‌ సాధించాలనే మాట అతని చెవిలో పడింది. బీటెక్‌ ఫైనలియర్‌ ఎగ్జామ్స్‌ పూర్తి కాగానే సివిల్స్‌పై దృష్టి సారించాడు. విషయాన్ని అమ్మానాన్నలు, అక్కబావలకు చెప్పగా.. వారు మొదట్లో అంత ఈజీ కాదంటూనే సరే అన్నారు. ఓ వైపు సివిల్స్‌ రాస్తూనే... మరోవైపు ఎంటెక్‌, ఆ తర్వాత ఎంఏ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్‌ డిగ్రీ పట్టా పొందాడు.

2014లో తొలి ప్రయత్నం

సివిల్స్‌ గోల్‌ పెట్టుకున్నాక 2014లో తొలిసారి పరీక్షకు హాజరయ్యాడు. అందుకోసం హైదరాబాద్‌లోని ఓ స్టడీ సర్కిల్‌లో పది నెలల పాటు కోచింగ్‌ తీసుకోవడంతో పరీక్షపై పూర్తిస్థాయిలో అవగాహన ఏర్పడింది. కానీ తొలి ప్రయత్నంలో విఫలమయ్యాడు. రెండో ప్రయత్నంలో భాగంగా 2015లో మరోసారి రాయగా.. మళ్లీ సరైన ఫలితం రాలేదు. మూడో ప్రయత్నం 2016లో చేయగా ఇంటర్వ్యూ వరకు వెళ్లి.. విఫలమయ్యాడు. దీంతో తీవ్ర నిరాశకు లోనై.. మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఈ సారి అక్క సింధూర బాగా సపోర్ట్‌ చేసింది. “ఏం కాదు.. ఇంకా వయస్సు ఉంది... మరోసారి గట్టిగా ప్రయత్నించు” అని వెన్నుతట్టింది. అమ్మనాన్న కూడా అదే విషయం చెప్పారు. కొంత టెన్షన్‌లో 2017లో నాల్గో ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. 2018లోనూ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో మరోసారి చెయ్యాలా వద్దా అన్న సంశయంలో పడిపోయాడు. ఇప్పటికే ఐదేళ్లు వృథా అయ్యాయి. నిరుద్యోగిగా ఇంకా ఎన్నాళ్లు ఇలా అని మదనపడడం మొదలైంది. కానీ ఈ ఒక్కసారి గట్టిగా ప్రయత్నించు అంటూ మళ్లీ కుటుంబసభ్యులు వెన్నుతట్టారు. దీంతో ఇదే చివరిసారి అన్న కోణంలో పూర్తిస్థాయి ప్రిపరేషన్‌కు సిద్ధమయ్యాడు.

ఆరో ప్రయత్నంలో విజయం

పట్టువదలని విక్రమార్కుడిలా ఆరో ప్రయత్నానికి పక్కా ప్రణాళిక, మానసిక దృఢత్వంతో ప్రిపరేషన్‌ ప్రారంభించాడు. అందుకోసం కుటుంబాన్ని వదిలి ఢిల్లీ వెళ్లాడు. అక్కడే ఏడాది పాటు ఉన్నాడు. రోజు పది గంటలకు పైగానే కష్టపడ్డాడు. రోజుకు రెండు న్యూస్‌ పేపర్లు చదివి నోట్స్‌ తయారు చేసుకున్నాడు. రాజ్యసభ టీవీల్లో చర్చలను ఫాలో అవుతూ సామాజిక, ఆర్థిక అంశాలపై అవగాహన పెంచుకున్నాడు. దీంతో పాటు ఆల్‌ ఇండియా రేడియోలో న్యూస్‌ను కూడా ఫాలో అయ్యాడు. వీటితో పాటు గతంలో యూపీఎస్సీ నిర్వహించిన పరీక్షల తాలుకూ ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్‌ చేశాడు. సివిల్స్‌ ర్యాంకర్లతో ప్రత్యక్షంగా కలిసి వారి అనుభవాలను తెలుసుకున్నాడు. ఇవన్నీ కలిపి ఆరో ప్రయత్నంలో పరీక్షను విజయవంతంగా పూర్తి చేశాడు. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ల్లో ఉత్తమ ప్రతిభ తర్వాత కీలకమైన ఇంటర్యూను కూడా బాగానే ఎదుర్కొన్నాడు. పీకే.జోషి బోర్డు చేసిన ఇంటర్వ్యూలో తెలంగాణ రాష్ట్ర సమస్యలు, నల్లగొండ జిల్లా అంశాలతో పాటు కుటుంబ నేపథ్యంపై అడిగిన ప్రశ్నలకు సంతృప్తికర సమాధానాలు ఇచ్చాడు. ఫలితంగా యూపీఎస్సీ ప్రకటించిన ఫలితాల్లో 417 ర్యాంకు సాధించి తనతో పాటు తల్లిదండ్రుల కలను సాకారం చేశాడు. ర్యాంకు సాధించాక మొదటి కాల్‌ అమ్మకే చేసి చెప్పానంటూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు శీతల్‌కుమార్‌.

ఏడాది పాటు సోషల్‌ మీడియాకు దూరం..  

సివిల్స్‌లో ర్యాంకు సాధించాలంటే వ్యక్తిగత జీవితంలో కొన్నింటికి దూరంగా ఉండకతప్పదు. ఏడాది పాటు బంధుమిత్రులకు కూడా అందుబాటులోకి లేకుండా పోయాడు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ లాంటి సోషల్‌ మీడియా టూల్స్‌కు దూరంగా ఉన్నాడు. వాటన్నింటినీ తన మొబైల్‌ లోంచి తొలగించాడు. ఏది చూసినా.. చదివినా అది సివిల్స్‌కు సంబంధించినదై ఉండాలన్నంత కాన్సెప్ట్‌తో కష్టపడ్డాడు. అందుకే ప్రస్తుతం అత్యుత్తమ ర్యాంకు సాధించాడు. ఈ ర్యాంకుతో ఇప్పటివరకు ఉన్న అంచనా ప్రకారం ఐపీఎస్‌కు ఎంపిక కావడం ఖాయం. దీంతో పాటు ఐఏఎస్‌కు ఫిప్టీ ఫిఫ్టీ చాన్స్‌ ఉంది. రెండింటిలో ఏదీ వచ్చినా ప్రజలకు అత్యుత్తమ సర్వీస్‌ అందించడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు.

సివిల్స్‌ ప్రిపేర్‌ కావాలనుకునే వారికి శీతల్‌కుమార్‌ విలువైన సూచనలు చేశాడు. పేద, ధనిక తేడా లేకుండా ఎవరైనా సివిల్స్‌ రాయవచ్చు. అంతకు ముందు దానిపై అవగాహన పెంచుకోవాలి. మనకున్న పరిస్థితులపై ఓ అంచనా ఉండాలి. వీటికి తోడు సివిల్స్‌ కొట్టాలన్న తపన, సాధించే వరకు నిరంతర ప్రయత్నం ముఖ్యం. చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలి. ఆరవ తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఎన్‌సీఆర్టీ పాఠ్యపుస్తకాలు చదవాలి. ప్రతిరోజూ న్యూస్‌ పేపర్స్‌ ఫాలో అవ్వాలి. ఎప్పటికప్పుడు నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకోవాలి. అవసరాన్ని బట్టి ఓ సారి కోచింగ్‌ తీసుకోవాలి. బుక్స్‌లో ఉన్నదాన్ని సమాజంతో ఐప్లె చేసుకోవాలి. ప్రాక్టికల్‌గా ఆలోచించాలి. మనలాంటి వాళ్లతో ఇది కాదులే అంటూ.... చుట్టుపక్కల వాళ్లు చేసే నెగెటివ్‌ కామెంట్స్‌ను పట్టించుకోవద్దు. అన్నింటి పట్ల స్పష్టమైన దృక్పథం, ఓర్పుతో ముందుకు సాగితే అసాధ్యమేమీ కాదు. అంటూ సివిల్స్‌ సాధన ప్రస్థానంలో తన అనుభావాలను షేర్‌ చేసుకున్నాడు శీతల్‌కుమార్‌.

తల్లిదండ్రుల సహకారం, అక్క ప్రోత్సాహం : శీతల్‌కుమార్‌

ఏ తల్లిదండ్రులైనా తన కొడుకు త్వరగా ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాలని కోరుకుంటారు. కానీ నా మనసులోని ‘సివిల్స్‌' గురించి అమ్మ, నాన్నకు చెప్పాను. ఇద్దరు కూడా చదువుకున్న వారే కావడంతో తొందరగానే అర్థం చేసుకొని సంపూర్ణ సహకారం అందించారు. అక్కబావ  కూడా వెన్నంటి ఉండి ప్రోత్సహించారు. విఫలమైన ప్రతిసారీ మళ్లీ ప్రయత్నించమంటూ ధైర్యం చెప్పారు. 2016లో ఇంటర్యూ వరకు వెళ్లి విఫలమైనప్పుడు అక్క ఇచ్చిన ధైర్యం మర్చిపోలేనిది. సివిల్స్‌ సాధించే వరకు అమ్మనాన్నలకు ఆర్థికంగా భారమైనా భరించారు. వీటన్నింటి ఫలితమే ఈ సివిల్స్‌ ర్యాంకు.   

చెప్పలేనంత ఆనందంగా ఉంది : నరేందర్‌, శీతల్‌ తండ్రి

శీతల్‌కుమార్‌ సివిల్స్‌ సాధించడంతో మా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.  కుమారుడి జీవితాశయం, మా చిరకాల కోరిక నెరవేరింది. మా నాన్న కూడా నన్ను కలెక్టర్‌ లేదంటే డాక్టర్‌ చేయాలని కలలు కన్నాడు. కానీ నా నుంచి అవి కాలేదు. ఇప్పుడు ఆ కలను నా కొడుకు శీతల్‌ నెరవేర్చాడు. బాగా చదివి ఉద్యోగం సాధిస్తే చాలు అనుకున్నాం. సివిల్స్‌ రాస్తానంటే నీ ఇష్టం అని చెప్పాను. ఐదుసార్లు విఫలమైనా... మేము ఎన్న డూ నిరాశచెందలేదు. శీతల్‌కు ఉన్న పట్టుదలపై మాకు నమ్మకం ఉంది. మంచి ర్యాంకు సాధించడం సంతోషంగా, గర్వంగా ఉంది. ఐఏఎస్‌, ఐపీఎస్‌ ఏదీ వచ్చినా సంతోషమే. ప్రజల కోసం, సమాజం కోసం పనిచేయాలని కోరుకుంటున్నాం. 
logo